.
మీకు గుర్తుందా..? అమెరికాలో జంటటవర్లు కూల్చేయబడినప్పుడు… పొగ, ముక్కలైన దేహాలు, పారిన నెత్తురు, చెల్లాచెదురుగా అవయవాలు, కాలిన శరీరాలు, భవన శిథిలాలు… ఎంత బీభత్సం..? కానీ మీడియా అలాంటి ఒక్క ఫోటోను గానీ, ఒక్క వీడియోను గానీ చూపించలేదు… ప్రపంచవ్యాప్తంగా మీడియా దీన్ని ఓ నైతిక పాఠంగా భావిస్తోంది… పాత్రికేయం అంటే ఏది చూపించకూడదో కూడా తెలిసి ఉండటం, తెలివిడి ఉండటం!
మన దేశ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రమాదాలు, పేలుళ్ల వార్తల కవరేజీలో ఈ సూత్రాన్ని పాటిస్తోంది… ఉరి వేసుకున్న సీన్లు, రైలు ఆత్మహత్యలు వంటి ఫోటోలను కూడా పరిహరిస్తోంది… పాత్రికేయ విలువల్లేని కొన్ని పత్రికలు, టీవీలను వదిలేస్తే… బీభత్సం కనిపించే సీన్లను చూపించకపోవడం, తీవ్రతను అక్షరాల్లో వివరించడం ఓ నైతికత…
Ads
మరి జనంపై బాగా ప్రభావం చూపించగల దృశ్యమాధ్యమం సినిమాకు ఏం రోగం పుట్టింది..? ఎంత ఎక్కువ హింసను చూపిస్తే అంత బిగ్ స్కేల్ సినిమా అన్నట్టుగా… తెరపై నెత్తుటి ప్రవాహాలు పారిస్తున్నారు… ఇదేమైనా క్రియేటివ్ జీనియస్సా…? లేక ఎంత హింసను చూపిస్తే అంత దర్శకత్వ ప్రతిభ అనే భ్రమల్లో దర్శకులు, హీరోలు కొట్టుకుపోతున్నారా..? ఇదేనా జనం కోరుకునే వినోదం?!
తెలుగు సినిమాలకు సంబంధించి ప్యారడైజ్ సినిమా అన్ని పరిధులూ దాటేసింది… నరకడం, తురమడం ఎంత ఎక్కువ ఉంటే అంత మాస్ హీరోయిజం మూర్ఖపు భ్రమల్లో హీరోలూ దీన్ని ప్రోత్సహిస్తున్నారు…
ప్యారడైజ్ సినిమాకు సంబంధించి… ఫేస్‌బుక్‌లో ChandraSekhar Reddy Thimmapuram వాల్ మీద కనిపించిన ఓ పోస్టు చదివితే చాలు, ఈ సినిమాలో హింస ఏ రేంజులో ఉందో… నిజానికి అవన్నీ యథాతథంగా పబ్లిష్ చేయకూడదు… కానీ ఆ తీవ్రత ఓసారి రిజిష్టర్ కావాలి, అందుకే ఇదుగో ఆ పోస్టు…
#Theparadise సినిమాకు వెళ్లాలనుకుంటున్నారా? ఐతే కాస్త ఇది చదివి ప్రిపేర్ అయి వెళ్ళండి. (ఇవి స్పాయిలర్స్ కావులెండి)
* హీరో, హీరో తల్లి చెరో వైపు నుంచి కత్తి దూస్తే.. ఒకడి తల ఎగిరి పడుతుంది.
* హీరో ఆ మొండేన్ని వేసుకుని ఆ చచ్చినోడి ఇంటికి వెళ్లి బాడీని విసిరి కొడతాడు. తల లేని మొండెంతోనే ఆ చచ్చినోడికి అంత్యక్రియలు చేస్తారు.
* తన తండ్రి చొక్కా పట్టుకున్నాడని విలన్ ఒకడి మీదికి కత్తి ఎత్తితే రెండు చేతులు తెగి అవతల పడతాయి.
* హీరో ఒకడ్ని నడుం దగ్గర అడ్డంగా నరికితే పై పార్ట్ ఒక పక్కకి, కింది పార్ట్ ఇంకో పక్కకి పడుతుంది.
* ఇంకొకరిని తల మీద నరికితే బాడీ నిలువునా రెండుగా చీలుతుంది.
* హీరో ఇంకొకడిని రెండు చేతులతో పైకి ఎత్తితే పైన తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు కూరగాయలను తురిమినట్లు తలను తురుముతాయి.
* బిర్యానీలో నల్లి బొక్క తింటున్న ఒకడి తల పట్టుకుని హీరో గారు టేబుల్ మీద కొడితే గొంతులోకి దిగిన ఆ బొక్క.. టేబుల్ ను కూడా చీల్చుకుని కింది నుంచి బయటికి వస్తుంది.
క్రియేటివ్ జీనియస్ #Srikanthodela, ట్రెండ్ సెట్టర్ #Nani గార్లు కలిసి అందించిన కళాఖండం #Theparadise లో కొన్ని సుందరమైన, సృజనాత్మక సన్నివేశాలు.. ఒకసారి ఈ సీన్లు విజువలైజ్ చేసుకుని తర్వాత థియేటర్లలోకి అడుగు పెడితే మంచిదని…
ఇప్పుడు చెప్పండి, ఇదా మన సినిమా ఎదుగుదల..? హింస సక్సెస్ ఇస్తుందా..? మాస్ సినిమా అంటే ఇదేనా..? మితిమీరిన హింసతో మట్టిగొట్టుకుపోయిన సినిమాలు రీసెంట్ రోజుల్లోనే బోలెడు ఉదాహరణలు… ఐనా ఈ ధోరణి ఇంకా ఎందుకు పెరుగుతోంది..? ఓ ఇరవై మంది రౌడీలను నరికేసి ఆ శవాలను కుప్పగా పోసి, దాని మీద హీరో కూర్చున్న సీన్లు ఓసారి గుర్తుతెచ్చుకొండి..!
చివరగా… బలగం సినిమాలో ఒక్క నెత్తుటి చుక్క కనిపించిందా..? మరెందుకు జనం నీరాజనాలు పట్టారు..? ఆలోచించండి… చివరకు నాని ఇలా తయారవుతాడని అనుకోలేదు!! ప్యారడైజులో నానిని చూస్తే భయం వేయలేదు… తన ఆలోచనధోరణికి, తను రూపాంతరం చెందుతున్న తీరుకు …. జాలేసింది !!
Share this Article