Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?

September 26, 2026 by M S R

.

మరీ మన మహానటి కీర్తి సురేశ్‌ ఇలా బోల్డ్‌గా నటించినందుకే రేగిన దుమారం కాదు… ప్రేక్షకుడి ఊహకు కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన షాక్! అందుకే సినిమా విడుదలయ్యాక వివాదం… కాదు, సోషల్ మీడియాలో చర్చ… రచ్చ… అనుకోని పబ్లిసిటీ కూడా..!!

సినిమా అంటే ఏమిటి..? పోస్టర్ చూసి ఒక కథ ఊహించుకోవడమా..? ట్రైలర్ చూసి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అని లెక్కేసుకోవడమా..? లేక దర్శకుడు మన ఊహలన్నింటినీ పక్కకు తోసేసి… “ఇదిగో నేను చెప్పాలనుకున్న కథ!” అని తెరపై ఇంకో ప్రపంచాన్ని చూపించడమా..?

Ads

‘డోరోతి’ ఇప్పుడు చేస్తున్న చర్చ అదే…. కార్తీక్ సుబ్బరాజు సినిమా అంటేనే ఏదో ఒక దగ్గర ప్రేక్షకుడి అంచనాలకు చిన్న షాక్, సర్‌ప్రైజ్ ఉండటం కొత్తేమీ కాదు… కానీ ఈసారి ఆ షాక్ కథలో మాత్రమే కాదు… ప్రేక్షకుడు సినిమా ఏం అయి ఉంటుందని ఊహించుకున్నాడో దానిపైనే పడింది…

1990ల గ్రామీణ తమిళనాడు. ఇద్దరు స్నేహితులు. కుల విభజనలు. కుటుంబ పరువు. గ్రామీణ సమాజంలోని హింస. మగతనానికి సమాజం పెట్టిన నిర్వచనాలు. కథ మొదలైన తీరు చూస్తే… ఇది మరో రా రస్టిక్ గ్రామీణ డ్రామా అనిపిస్తుంది.

అందులో కీర్తి సురేశ్. అంతే… ప్రేక్షకుడు తన బుర్రలో కథ రాసేసుకుంటాడు. “ఇదేదో ప్రేమకథ అయి ఉంటుంది…” కానీ కార్తీక్ సుబ్బరాజు మాత్రం… “ఆగండి… నేను చెప్పేది అది కాదు!” అంటూ ఇంటర్వెల్ తర్వాత కథకు మరో తలుపు తెరిచాడు.

dorothy

అక్కడి నుంచి LGBTQ+ గుర్తింపు, లింగమార్పిడి, ఇద్దరు స్నేహితుల మధ్య సంబంధం, సమాజం అంగీకారం వంటి సున్నితమైన అంశాలు కథలోకి వస్తాయి. అదే ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. కీర్తి సురేశ్ పాత్రకు సంబంధించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి.

కొందరు ఆమె ఇలాంటి పాత్ర ఎందుకు చేసిందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం నటి తన ఇమేజ్‌ను పక్కన పెట్టి భిన్నమైన పాత్ర చేయడానికి సిద్ధపడటం నటిగా ఆమె పరిధిని విస్తరించుకోవడమే అంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది.

వివాదం నిజంగా కీర్తి సురేశ్ బోల్డ్‌గా కనిపించిందా లేదా అన్నదానిపైనే అయితే… ఇంత చర్చ వచ్చేది కాదు. అసలు విషయం కథను ప్రేక్షకుడికి ఎలా అందించారు అన్నది.

సినిమా ప్రమోషన్‌లో అసలు కథాంశాన్ని దాచిపెట్టడం ఒకవైపు ఆసక్తిని పెంచింది. కానీ థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత కథ ఒక్కసారిగా మరో జోన్‌లోకి వెళ్లడంతో కొంతమంది ప్రేక్షకులకు అది షాక్ అయింది. సోషల్ మీడియాలో #BoycottDorothy హ్యాష్‌ట్యాగ్ కూడా ఈ నేపథ్యంలో కనిపించింది.

అంటే… దర్శకుడు ట్విస్ట్‌ను దాచాడు. ప్రేక్షకుడు తన ఊహను దాచుకోలేదు. అక్కడే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది!

ఒక వర్గం —
“నేను చూడటానికి వచ్చిన సినిమా ఇది కాదు!”

మరో వర్గం—
“అదే కదా సినిమా ప్రత్యేకత… ముందే మొత్తం చెప్పేస్తే ట్విస్ట్ ఎందుకు?” అంటోంది.

ఇదే సినిమాల విషయంలో చాలా ఆసక్తికరమైన మార్పు. ఈ రోజుల్లో ప్రేక్షకుడు ట్రైలర్ చూసి కథలో 80 శాతం ఊహించేస్తున్నాడు. హీరో ఎవరిని కొడతాడు, హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తుంది, విలన్ ఎవరు, చివరికి ఏం జరుగుతుంది… అన్నీ ముందే చెప్పేసే ట్రైలర్లు వస్తున్న కాలం ఇది. ఒకరిద్దరు దర్శకులైతే ధైర్యంగా కథ కూడా సూచనప్రాయంగా చెప్పేస్తుంటారు కూడా…

అలాంటి సమయంలో ఒక దర్శకుడు “నా కథను మీరు ఊహించకూడదు, ఊహించలేరు” అని పట్టుబడితే… దానికి వచ్చే మొదటి స్పందన ఆశ్చర్యమే. తర్వాత ఆలోచన. తర్వాత అంగీకారం.

లేదంటే… బాయ్‌కాట్! ‘డోరోతి’ విషయంలో ఇప్పుడు ఈ మూడు దశలూ కనిపిస్తున్నాయి. ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం. అంటే కథ ఆధునికంగా, సున్నితమైన సామాజిక అంశాలను తాకుతున్నా… దాని నేపథ్యం మాత్రం 1990ల తమిళ గ్రామీణ ప్రపంచం.

ఒకవైపు పాతకాలపు గ్రామీణ వాతావరణం. మరోవైపు ఈ కాలంలో కూడా పూర్తిగా ముగియని గుర్తింపు, అంగీకారం, సామాజిక నియమాల ప్రశ్న. అందుకే ‘డోరోతి’ని కేవలం “కీర్తి సురేశ్ బోల్డ్ రోల్” అని కుదించేస్తే అసలు సినిమా అక్కడే మిస్సవుతుంది.

keerthy suresh

కీర్తి సురేశ్ ఒక పాత్ర చేసింది. కార్తీక్ సుబ్బరాజు ఒక కథ చెప్పాడు. ప్రేక్షకులు మాత్రం ఆ కథపై తమ తమ తీర్పులు చెప్పుకుంటున్నారు. అసలు సినిమా అక్కడే మొదలైంది. ఇలాంటి సినిమాలకు ఒక ప్రమాదం ఉంటుంది. కథను చెప్పడానికి ముందు ప్రేక్షకుడి మైండ్‌సెట్‌ను ఎదుర్కోవాలి.

ప్రేక్షకుడు సిద్ధంగా లేకపోతే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా కూడా “ఇది ఎందుకు చూపించారు?” అనే ప్రశ్నలో చిక్కుకుపోవచ్చు. ప్రేక్షకుడు సిద్ధంగా ఉంటే అదే సినిమా… “ఇలాంటి కథను కూడా ఇంత మెయిన్‌స్ట్రీమ్‌గా చెప్పొచ్చా?” అనే చర్చను మొదలుపెట్టవచ్చు. ‘డోరోతి’ ఇప్పుడు ఆ రెండు ప్రశ్నల మధ్య నిలబడి ఉంది….

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!
  • నరుకుడు రోగం! మితిమీరిన హింస- మతిమాలిన దర్శకత్వ ప్రతిభ!!
  • The Paradise – దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను చరిత్ర క్షమించదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions