.
భక్తి తప్పు కాదు, ఆధ్యాత్మిక మార్గం తప్పు కాదు, స్పష్టంగా నిర్వచనం అర్థంకాని ఓ పాజిటివ్ వైబ్స్, అనగా ఏదో మహత్తు మనకు మంచి చేస్తుందనే నమ్మకంతో గుళ్ల సందర్భన కూడా అస్సలు తప్పు కాదు… కానీ మూఢనమ్మకం ఖచ్చితంగా తప్పే…
అరుణాచలం మోక్షమార్గంలో చిక్కుకున్న మరో ఆంధ్ర మహిళ… ఇది మొన్నటి వార్త… తిరువణ్ణామలైలోని అరుణాచల మోక్షమార్గంలో ఇరుక్కొని రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) ఈ నెల 24న చనిపోయిన సంగతి తెలిసిందే… తాజాగా ఏపీకి చెందిన మరో భక్తురాలు కూడా అదే తరహాలో మోక్షమార్గంలో చిక్కుకుంది… బయటకు వచ్చేందుకు ఇబ్బందిపడుతూ కేకలు వేసింది…. దీంతో అక్కడ ఉన్నవారు ఆమెను కష్టమ్మీద బయటకు లాగి రక్షించారు…
Ads
సొరికె… తెలంగాణలో ఇదే పదం… బండరాళ్ల మధ్య ఇరుకుగా ఉండే చీలిక… అందులో నుంచి సన్నగా ఉన్నవాళ్లు అయితే వోకే, కాస్త బరువు ఎక్కువ ఉన్నవాళ్లు ఎందుకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూరడానికి ప్రయత్నించి, ఆయాసపడి, అలా దూరితే పుణ్యం వస్తుందనే భ్రమలు దేనికి..? అసలు ప్రవచనకారులు ఇవి కదా జనంలోకి తీసుకెళ్లాల్సింది… అవి మాత్రం చేయరు! ( కొంతమేరకు గరికపాటి నయం, చాలా మూఢనమ్మకాల్ని నిరసిస్తూ, ఎవడేమైనా అనుకోనీ అనే ధోరణిలో చెబుతుంటాడు)…
నిజానికి ఏమిటా మోక్షమార్గం… సోషల్ మీడియాలో కనిపించింది… ‘‘అది గుడి కాదు, అక్కడ దేవుడి విగ్రహం కూడా లేదు. 1964 వరకు దాని ప్రస్తావన కూడా తమిళ గ్రంధాలలో లేదు. ఓ వ్యక్తి రెండు రాళ్ల మధ్య ఒక నిర్మాణం చేసి ప్రచారం చేసుకున్నాడు. 1969లో గుర్తింపునకు వచ్చింది. దాని పేరు ఇడక్కు పిల్లయార్.
అంటే ఇరుకైన వినాయకుడు. ఆ తర్వాత 2004 నుంచి దానికి మన రాష్ట్రంలోనే మోక్షమార్గం అన్న పేరు వచ్చింది. దానిలో దూరితే మోక్షం సిద్ధిస్తుంది అని తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి దాన్ని కట్టించిన రంగనాథం అనే వ్యక్తి చెప్పిన దాని ప్రకారం తిరువన్నామలై ఆలయానికి దీనికి సంబంధం లేదు. 1964 నుంచి ప్రచారంలోకి వచ్చి 2004 నుంచి విపరీతమైన భక్తజనులతో నిండిపోతున్న ఈ మోక్షమార్గం మన తెలుగు రాష్ట్రాల భక్తులతోనే ప్రచారం పొందింది .
అక్కడికి వెళ్లే వాళ్ళు నూటికి 90 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలే . అక్కడ ఏ దేవుడు లేడు. అక్కడ మెట్ల మీద ఒక చిన్న పాదముద్ర మాత్రమే ఉంటుంది. దానికి దండం పెట్టుకొని పోతుంటారు. అక్కడ ఈ మోక్ష మార్గం అని మన పండితులు చెప్పే గుహ నిజంగా
1964లో రెండు రాళ్ల మధ్య దాన్ని ఒక నిర్మాణంగా రూపొందించారు. అప్పటినుంచి దీనిని తిరువణ్ణామలైలోని చిన్నకాడ వీధికి చెందిన రంగనాథన్ అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడు. ఆయన ఈ ఆలయాన్ని మొదటిసారిగా 1969 మార్చి 23వ తేదీన మరమ్మతులు చేయించే భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత 1976 నుంచి 2004 వరకు ఇక్కడ చిన్నచిన్న నిర్మాణాలు చేపట్టాడు .
చాలా కాలం పాటు ఆయన స్వాధీనంలోనే ఉండిపోయింది. దానిలో వచ్చే హుండీలో ఆదాయం కూడా ఆయనకు తీసుకునేవాడు. గిరి వలయ మార్గంలో ఉన్న ఈ గుహ నుంచి దూరి బయటకు వస్తే క్షుద్ర గ్రహాల ప్రభావం పోతుందని , శారీరకమైన బాధలు ఉపశమనం కలుగుతాయని , ఇతర వ్యాధులు కూడా నయమవుతాయని మొదటి నుంచి ఉన్న ప్రచారం…
కొత్తగా పెళ్లయిన దంపతులు బిడ్డలు కలగకపోతే ఈ గుహ నుంచి బయటకి వస్తే బిడ్డలు కలుగుతారన్న ప్రచారం కూడా ఉండింది. అంతే తప్ప ఏ తమిళ గ్రంధంలో, తమిళ పండితుల మాటల్లోనూ ఇది మోక్షమార్గమని, ఆ మోక్షమార్గం నుంచి వస్తే మోక్షం సిద్ధిస్తుందన్నమాట ఎక్కడా లేదు.
మన రాష్ట్రంలో మాత్రం యూట్యూబ్లో, పలు ప్రవచనకారుల మాటల్లో దీన్ని మోక్షమార్గంగా చెప్పి భక్తులను అక్కడికి పోయేట్టు చేశారు. మన తెలుగు భక్తజనం సంగతి తెలిసిందే కదా… గానుగాపూర్‌కు వేలాదిగా తరలివెళ్తున్నది మనవాళ్లే… డబ్బులున్నోళ్లు కామాఖ్య అంటున్నారు… తిరుమల, శ్రీశైలం సరేసరి… ఇవన్నీ వోకే… కానీ మోక్షమార్గంతోనే జాగ్రత్త!! అక్కడే మోక్షం పొందే ప్రమాదం ఉంది మరి!!
Share this Article