Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!

September 24, 2026 by M S R

.

అప్పుడు సింహాసనానికి ‘చెంపపెట్టు’
ఇప్పుడు ఓటరుకు లేని ‘హక్కు’

దక్షిణ భారతదేశంలో మూడు శతాబ్దాలకు పైగా ఒక వెలుగు వెలిగిన విజయనగర వైభవం గురించి రాస్తే రామాయణం కంటే పెద్దది. ఎందరో రాజులు, మంత్రులు, యోధులు, పండితులు. అదొక స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలో మహామంత్రి తిమ్మరుసు- శ్రీకృష్ణదేవరాయల కాలం కాలానికే కన్నుకుట్టేంత గొప్పది.

Ads

ఎన్నెన్నో కుట్రలను ఛేదించి, సొంతవారి చావు తెలివితేటలను దాటి కృష్ణదేవరాయలను తిమ్మరుసు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సవతి తల్లి రాయలను చంపి…అడ్డు తొలగించుకోవాలని పన్నిన కుట్రను తిమ్మరుసు ఎలా ఎత్తుకు పై ఎత్తు వేసి ఛేదించాడన్నది పెద్ద నరాలు తెగే రియల్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కథ. అదిక్కడ అనవసరం.

అన్నన్ని ఆటంకాలు దాటి సింహాసనం మీద రాయలను ప్రతిష్ఠించే శుభ ముహూర్తం రానే వచ్చింది. అది 1509. అంటే అయిదు వందల ఏళ్ళు దాటింది. హంపీ విధులన్నీ మేళతాళాలతో మారుమోగిపోతున్నాయి. కొత్త పూల రుతువు పల్లకీలో ఊరేగుతోంది. గాలులు గంధాలు మోసుకొస్తున్నాయి. ప్రతి రాతి స్తంభం అరటి బోదెలు కట్టుకుంది. ప్రతి శిల మామిడి తోరణం కట్టుకుంది. రాజభవనంలో ఇసుకవేస్తే రాలనంత జనం. మరో పది నిముషాల్లో రాయలకు పట్టాభిషేకం. తెల్ల పట్టు వస్త్రాల్లో రాయలు దేవేంద్రుడిలా మెరిసిపోతున్నాడు. నెత్తిన ముత్యాలు వేలాడే తలపాగా. అంతా సిద్ధం.

ఈలోపు తిమ్మరుసు రాయలను సింహాసనం వెనుక ఉన్న అభ్యంతర మందిరం( ప్రయివేట్ రూమ్)లోకి రమ్మన్నాడు. రాయలు వెళ్ళాడు. తలపాగా తీసేయమన్నాడు. రాయలు తీసి…ఎందుకు? అన్నాడు. రాయల చెంపమీద చెళ్లుమని కొట్టాడు తిమ్మరుసు. ఆ దెబ్బకు రాయల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకిలా అకారణంగా కొట్టారు అప్పాజీ? అదీ ఇలాంటి వేళ? నేనే తప్పూ చేయలేదే? అని బాధగా అడిగాడు రాయలు.

మరికొన్ని నిముషాల్లో నువ్వు విజయనగర చక్రవర్తివి. నిత్యం నువ్వు తీసుకునే నిర్ణయాలతో అకారణంగా ఎవ్వరికీ నష్టం, కష్టం, బాధ కలుగకూడదు. ప్రతి నిర్ణయానికి ముందు ఆ విషయం గుర్తుండడానికి వీలుగా ఎప్పటికీ గుర్తుండేలా గట్టిగా కొట్టాను- అంతే…అన్నాడు. రాయలు వంగి తిమ్మరుసు కాళ్ళకు నమస్కారం చేశాడు. తిమ్మరుసు రాయలను లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరూ భవిష్యత్తును ఏలడానికి సింహాసనం దగ్గరికి వచ్చారు. మిగిలింది చరిత్ర.

ఇది నిజంగా జరిగిందో! లేదో! తెలియదు. ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో తరతరాలుగా చెప్పుకుంటున్న కథ. కొన్ని నాటకాల్లోకి కూడా ప్రవేశించింది. నిజంగా జరిగి ఉంటే కొట్టిన తిమ్మరుకు, కొట్టించుకున్న రాయలకు కోటి దండాలు. కొట్టకుండా ఉండి…కల్పిత కథే అయి ఉంటే…ఈ కథను సృష్టించినవారికి శతకోటి దండాలు.

ఈ కథను ముందు పెట్టుకుని ఇప్పుడు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ- ‘సర్’ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే…ప్రతి నిర్ణయానికి ముందు ఎవరు ఎవరిని కొట్టాలి? ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఎన్ని కోట్ల ఉద్దేశపూర్వక, అనుద్దేశపూర్వక లోపాలకు ఎన్నెన్ని కోట్ల చెంప దెబ్బలు ఎవరికి పడాలి?

రాచరికంలో సమసమాజాభ్యుదయ ప్రజాపాలన నిర్ణయాల కోసం, తప్పు జరగకుండా ఉండడంకోసం తిమ్మరుసు ఏకంగా కాబోయే చక్రవర్తి చెంప చెళ్లుమనిపించగలిగాడు. ఒక చక్రవర్తి దాన్ని పాలనాపాఠంగా నెత్తిన పెట్టుకుని తరించాడు. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజాస్వామిక సర్వతంత్ర స్వతంత్ర ప్రజాపాలనావ్యవస్థలో తప్పు జరిగాక అయినా చెంప చెళ్లుమనిపించడానికి ఇప్పుడు తిమ్మరుసులు లేరు. ఉన్నా ఆ తిమ్మరుసులకు చేతులు లేవు. ఉన్నా ఆ చేతులు లేవవు. ఒకవేళ పొరపాటున లేచినా ఏమవుతుందోనన్న ప్రజాస్వామిక బాధ్యతాయుత లోలోపలి భయం.

భయం- ఆధునిక ప్రజాస్వామ్యానికి అభయం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!
  • ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!
  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…
  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions