ఏం జరుగుతుంది..? మూడో ప్రపంచ యుద్ధం సాగుతుందా..? కరోనా విపత్తుతో ఇప్పటికే కుదేలైన ప్రపంచం ఈ దెబ్బకు దీర్ఘకాలపు మాంద్యంలోకి ప్రయాణించాల్సిందేనా..? పుతిన్ మరో హిట్లర్ అయిపోయాడా..? సగటు మనిషిలో ఇవీ ప్రశ్నలు… ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఈ భయాలన్నీ మీడియా వ్యాప్తి చేస్తున్నవే… మూడో ప్రపంచ యుద్ధానికి చాన్సే లేదు… అబ్బే, మేం నేరుగా ఉక్రెయిన్‌లోకి వచ్చేసి, రష్యా దళాలతో యుద్ధం చేయబోవడం లేదు, జస్ట్, ఆయుధసాయం చేస్తాం, రష్యాను ఆంక్షలతో దారికితెస్తాం అని నాటో దేశాలు మేకపోతు గాంభీర్యంతో ప్రకటన చేసినప్పుడే ఉక్రెయిన్ యుద్ధం క్లైమాక్స్‌కు వచ్చేసినట్టు అర్థం కావడం లేదా..?
ఉక్రెయిన్ అధ్యక్షుడు సైనిక దుస్తుల్లో యుద్ధరంగంలోకి స్వయంగా దిగాడని ఒక ఫోటో హల్‌చల్ చేస్తోంది… తను ఆల్‌రెడీ దేశాన్ని విడిచి జర్మనీకి పారిపోయాడని మరో సమాచారం… ఆంక్షలతో రష్యాను కట్టడి చేయడం సాధ్యమేనా..? ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే నాటో కూటమి ఎలా స్పందిస్తుందో తెలియకుండానే రష్యా ఈ చర్యకు దిగిందా..? పుతిన్ సాధారణ రాజకీయ నాయకుడేమీ కాదు… ఓ నియంత… మాజీ గూఢచారి… మిలిటరీ ఏజెంట్… ప్లస్ వ్యాపారి కూడా..!
ఒకప్పటి బలోపేతమైన సోవియట్ యూనియన్‌లాగే ఇప్పటి రష్యాకు పూర్వవైభవం తీసుకురావాలనే కాంక్ష ఉన్నవాడు… కాలాన్ని వెనక్కి తిప్పలేకపోవచ్చుగాక… కానీ ఎవరికీ తలవంచకుండా, తలెగరేసి నిలబడాలనే తపన… దౌత్యం తెలుసు, ద్యూతం తెలుసు… ఎస్, నాటో కూటమికి కూడా తెలుసు… ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే తామేమీ చేయలేమని తెలుసు… ఇప్పుడు ప్రపంచం సుదీర్ఘ, భారీ యుద్ధాల వైపు వెళ్లే సాహసం చేయలేదు… ఎవడి పరిస్థితీ బాగాలేదు…
Ads
రష్యాది సామ్రాజ్య విస్తరణ ధోరణి కాదిక్కడ… నాటో దేశాలతో సాగే చదరంగం ఆటలో ఓ భాగం… ఎన్నాళ్లుగానో ఉన్న పంచాయితీయే… పుతిన్‌కు బుల్లెట్‌తో సమస్యను క్లోజ్ చేసే పనిలో ఉన్నాడు… కొద్దిరోజులు మీడియా హడావుడి… ప్రపంచ రాజకీయాల్లో కలకలం… కానీ ఒక్కటి నిజం… ఇప్పుడు ప్రపంచం ఏకధ్రువం కాదు… అమెరికా మాటే చెల్లుబాట కాదు… గతంలోలాగా చైనా ప్రభావరహిత దేశమేమీ కాదు… తను అగ్రదేశం కావాలనుకుంటోంది… రష్యా మళ్లీ బలోపేతం కావాలని అనుకుంటోంది… అవసరం… అమెరికాకు బలమైన ప్రతిపక్షం అవసరం… కానీ ఇండియా ఎటువైపు..? ఇదీ కీలకమైన ప్రశ్న…
రష్యాను కాదనలేం… ఉక్రెయిన్‌కు మద్దతు పలకలేం… రష్యాతో మనకు కాలపరీక్షకు నిలిచిన స్నేహం ఉంది… స్వతంత్రం పొందాక ప్రతి దశలోనూ, ప్రతి అవసరంలోనూ, ప్రతి పరీక్షలోనూ రష్యా మనకు అండగా ఉంది… అఫ్‌కోర్స్, ఇప్పుడు దాని అవసరాల కోసం పాకిస్థాన్, చైనాల కొమ్ముకాయవచ్చుగాక… ఐనాసరే ఇండియాకు శత్రువు కాదు… రష్యాలో మన పెట్టుబడులున్నయ్… రష్యాతో మనకు స్నేహసంబంధాల అవసరం ఉంది…
ప్రత్యేకించి అమెరికాను నమ్మలేం… కుటిలబుద్ధి… ఇప్పుడు చైనాతో పోరులో దానికి ఇండియా అవసరం ఉంది కాబట్టి, పాకిస్థాన్ మక్కీచూజ్ కాబట్టి, దాన్ని వదిలేసి ఇండియాను దువ్వుతోంది… పైగా ఇండియా మార్కెట్ కావాలి దానికి… ఆయుధాల అమ్మకం అందులో ఒకటి… అందుకే స్నేహం నటిస్తోంది… అదెప్పుడూ నమ్మలేని దేశమే… అమెరికాను, రష్యాను పక్కపక్కన నిలబెట్టి బేరీజు వేస్తే… రష్యా వైపే టిక్ కొట్టాలి… వర్తమానమే కాదు, చరిత్రనూ పరిగణనలోకి తీసుకుని చూస్తే… అమెరికా మనల్ని ఎప్పుడూ తొక్కాలని చూసింది… రష్యా ఎప్పుడూ మనల్ని నిలబెట్టాలని చూసింది… అదీ తేడా… ఒకవైపు స్నేహహస్తం చూపిస్తూనే ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను రష్యా మనకు అమ్మకుండా బెదిరింపులకు దిగింది అమెరికా… ఇరాన్ తో మన బంధానికి కూడా ఎసరు పెట్టింది… అదంతే…
అలాగని నాటోకు వ్యతిరేకంగా పోలేం… వాటి దుష్ట ఆంక్షలకు ఇప్పటికిప్పుడు ఎదురొడ్డలేం… ఇప్పుడు నిలదొక్కుకుంటున్న దేశం మనది… సేమ్ టైమ్ రష్యాకూ మనం వ్యతిరేకంగా పోలేం… అందుకే తటస్థ వైఖరి… ఎవరి అవసరాల కోసం వాళ్లు ఆడే రణతంత్రంలో మనం పావు కావల్సిన పని లేదు… కరెక్టో కాదో తెలియదు… కానీ ప్రస్తుతం మన విదేశాంగ శాఖ వేస్తున్న అడుగులు సరైనవే అనిపిస్తోంది…!!
Share this Article