.
సేమ్ టు సేమ్ రాఘవేంద్రరావు.. ఎవరు రియలో, ఎవరు కాపీయో తెలియదు! మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఆరుగురో.. ఏడుగురో ఉంటారంటారు. అది నిజమో కాదో పక్కన పెడితే.. కొందరి విషయంలో మాత్రం “పోలిక” అనడం కూడా తక్కువే.. అచ్చం సేమ్ టు సేమ్! ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెద్దాయనను చూస్తే అదే అనిపిస్తుంది.
తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ముఖం, హెయిర్ స్టైల్, గడ్డం.. అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన లుక్. కానీ ఇప్పుడు ఆయనను తలపిస్తున్న మరో పెద్దాయన ఫొటోలు చూస్తే మాత్రం ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే.
Ads
“ఇది రాఘవేంద్రరావే కదా?” అని అనిపించడం ఖాయం! ఈ పెద్దాయన కుటుంబానికి చెందిన స్టిక్కర్ అండ్ ఫ్రేమింగ్ షాప్ గోడలపై ఆయన ఫొటోలు ఉండేవి. వాటిని చూసిన కస్టమర్లు తరచూ ఒకే ప్రశ్న అడిగేవారట.
“మీరు రాఘవేంద్రరావుకి అభిమాన3ా? బంధువా?” కాదు.. “ఆయనే మా నాన్నగారు!” అని ఆయన కుమారుడు చెబితే మాత్రం వాళ్లకు నమ్మకం కుదిరేది కాదట. “రాఘవేంద్రరావు ఇక్కడ ఎందుకు ఉంటారు? నిజం చెప్పండి!” అంటూ మళ్లీ ప్రశ్నించేవారట. అంతలా ఉందట పోలిక!
బయటకు వెళ్లినప్పుడు కూడా ఈ పెద్దాయనను చూసి కొందరు ప్రత్యేకంగా పలకరించేవారట. మరికొందరు ఆయన్ను దర్శకేంద్రుడిగానే భావించి గౌరవం చూపించేవారట. తన రూపంలోనే ఉన్న మరో వ్యక్తి కారణంగా వస్తున్న ఈ సరదా అనుభవాలను ఆయన కూడా నవ్వుకుంటూ ఆస్వాదించేవారు.
అయితే ఈ పోలిక కేవలం సరదా దగ్గరే ఆగిపోలేదు. “నాలా కనిపించే రాఘవేంద్రరావును ఒక్కసారైనా నేరుగా కలవాలి” అన్న కోరిక మాత్రం ఆయన మనసులో ఎప్పటినుంచో ఉంది. ఎట్టకేలకు ఆ కోరికకు కాలం కూడా కుదిరింది.
వీరిద్దరి ఫొటోలు రచయిత అభిరామ్ ద్వారా నటుడు, దర్శకుడు శ్రీ మీర్ దృష్టికి వెళ్లగా.. ఆయన వాటిని రాఘవేంద్రరావుకు పంపినట్లు సమాచారం. ఫొటోలు చూసిన దర్శకేంద్రుడికే కాసేపు ఆశ్చర్యం కలిగిందట.
“అరే.. నాకే ఇంకో వెర్షన్ ఉన్నట్టుందే!” అన్నట్టుగా ఉన్న ఆ పోలిక ఆయననూ ఆకట్టుకుంది. అంతే.. ఆయన్ను కలవాలని రాఘవేంద్రరావు కూడా ఆసక్తి చూపించాడట. ఇద్దరూ ఎదురెదురుగా కలిసిన క్షణం మాత్రం ఈ సరదా కథను ఒక్కసారిగా భావోద్వేగ కథగా మార్చేసింది.
రాఘవేంద్రరావును చూడగానే ఆ పెద్దాయన ఆనందంతో ఆయన పాదాలకు నమస్కరించాడు… దర్శకేంద్రుడు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి, దగ్గరకు తీసుకుని మాట్లాడాడు… ఇంతకాలం అద్దంలో చూసుకున్నట్టున్న ముఖాన్ని.. చివరకు ఎదురుగా చూసుకున్న క్షణం!
అందుకే ఈ కలయిక చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరికి అయితే ఇది ‘అన్నమయ్య’ క్లైమాక్స్‌లో అన్నమయ్య వెంకటేశ్వరస్వామిని కలిసిన సన్నివేశాన్ని గుర్తు చేసిందట. నిజానికి ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఎవరు ఎవరిని పోలి ఉన్నారన్నది కాదు.
ఇద్దరూ ఎదురెదురుగా నిలబడితే.. “అసలు రాఘవేంద్రరావు గారు ఎవరు?” అని అడగాల్సిన పరిస్థితి రావడమే!
సినిమాల్లో హీరోకు డూప్ ఉంటాడు.
కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి ఓ డూప్‌ను తయారు చేసినట్టుంది!
దశాబ్దాలుగా తన రూపంతో పోల్చబడుతున్న దర్శకేంద్రుడిని ఒక్కసారి కలవాలన్న పెద్దాయన కోరిక ఇప్పుడు నెరవేరింది. రూపంలోనే కాదు.. ఆ కలయికలో కనిపించిన ఆప్యాయత కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
పోలిక యాదృచ్ఛికం కావచ్చు..
కానీ ఇంత సేమ్ టు సేమ్‌గా ఉండటం మాత్రం నిజంగా అరుదే!
ఇద్దరినీ పక్కపక్కన చూస్తే ఒక్కటే ప్రశ్న… “రియల్ ఎవరు.. కాపీ ఎవరు?” 😄
Share this Article