.
సంతోషం… వరంగల్ ఎయిర్పోర్టుకు ‘రాణి రుద్రమదేవి’ పేరు, అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ‘కుమ్రం భీమ్’ పేరు ఖరారైనట్లు వస్తున్నాయి వార్తలు… ఎయిర్పోర్టు అథారిటీకి ఈమేరకు ప్రభుత్వం ప్రతిపాదించిందట కూడా… నిజంగా తెలంగాణ చారిత్రక ప్రాధాన్యతను చాటే మంచి నిర్ణయం…
ఇంకా సంతోషం ఏమిటంటే, ప్రధాన ప్రతిపక్షం దీనికి కూడా ఏదో పీకి పీకి, గాయిగత్తర చేసే ప్రయత్నం చేయకపోవడం… ఒకవేళ చేస్తే అది వాళ్లకే రివర్స్ కాబట్టి మౌనంగా ఉండిపోయారేమో… నిజానికి రేవంత్ రెడ్డి వరంగల్ ఎయిర్పోర్టుకు మంచి పేరు సూచించండీ అని జనాన్ని అడిగినప్పుడు ఎక్కువ శాతం రాణి రుద్రమ పేరే చెప్పారు…
Ads
సమర్థ పాలనకు, రాజకీయ ఎత్తుగడలకూ, సాహసానికీ ఆమె పెట్టింది పేరు… స్త్రీ శక్తి… ఆమె పేరు పెట్టడమే కాదు, వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ముంగిట రాణి రుద్రమదేవితో పాటు, కాకతీయుల కాలం నాటి మహా సేనాధిపతి రేచర్ల రుద్రారెడ్డి (రేచర్ల రుద్రుడు) విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ద్వారా మరుగున పడిన ఒక గొప్ప చరిత్రకు ప్రాణం పోసినట్లవుతుంది…
సినిమాలో, నవలలో రాణి రుద్రమ గురించి ప్రస్తుత తరానికి ఎంతో కొంత తెలుసు…? కానీ ఎవరు రేచర్ల రుద్రారెడ్డి..? చరిత్రలో చిరస్మరణీయుడు.. కాకతీయ సామ్రాజ్య రక్షకుడు ‘రేచర్ల రుద్రారెడ్డి’!
కాకతీయ సామ్రాజ్యం అనగానే మనకు రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు వంటి చక్రవర్తుల పేర్లు వెంటనే గుర్తుకువస్తాయి… కానీ, ఆ సువిశాల సామ్రాజ్యాన్ని ఒక అత్యంత సంక్షోభ సమయం నుండి కాపాడి, నిస్వార్థంగా నిలబెట్టిన ఒక గొప్ప యోధుడు ‘రేచర్ల రుద్రారెడ్డి’ (రేచర్ల రుద్రుడు)… ఆధునిక తరానికి పెద్దగా తెలియకపోయినా, కాకతీయుల చరిత్రలో ఆయనది అత్యంత కీలకమైన స్థానం…
రాజూ కాని రాజు.. రాజ్య రక్షకుడు…. క్రీ.శ. 1199 ప్రాంతంలో కాకతీయ రాజు మహాదేవుడు దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు…. ఆ సమయంలో యువరాజు గణపతి దేవుడిని శత్రువులు బందీగా పట్టుకున్నారు…. నాయకుడు లేక, శత్రువుల దాడితో కాకతీయ సామ్రాజ్యం చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది…
ఈ క్లిష్ట సమయంలో కాకతీయ సామ్రాజ్య ప్రధాన సేనాధిపతిగా (కమాండర్ ఇన్ చీఫ్) ఉన్న రేచర్ల రుద్రారెడ్డి అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించాడు… అంతర్గత తిరుగుబాటుదారులను అణచివేస్తూ, శత్రువులను ఎదుర్కొంటూ దాదాపు 13 సంవత్సరాల పాటు యువరాజు పేరుతో రాజ్యానికి రక్షణను, సుపరిపాలనను అందించాడు…

నిస్వార్థ రాజకీయ చాణక్యత….
కేవలం బలప్రయోగమే కాకుండా తన దౌత్యనీతితో యాదవులతో పోరాటంకంటే సంప్రదిప్తే మేలని భావించాడు… యాదవ రాజు జైత్రపాలుడితో చర్చలు జరిపి, ఆయన కుమార్తె సోమలాదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించి రెండు రాజ్యాల మధ్య శాంతి ఒప్పందానికి కారణమయ్యాడు…
ఆ తర్వాత గణపతి దేవుడిని విడిపించి తీసుకువచ్చి, ఎంతో నిస్వార్థంగా ఆయనకు రాజ్యాభిషేకం చేశాడు… తను చేసిన సేవలకు గుర్తింపుగా ‘సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య’ అని కొనియాడబడ్డాడు… కాకతీయ చరిత్రలో బాహుబలి సినిమాలోని కట్టప్ప వంటి విధేయ సైనిక చక్రవర్తి పాత్ర తనది…
ప్రపంచ ప్రసిద్ధ రామప్ప శిల్పకళా సృష్టికర్త… కేవలం యుద్ధ తంత్రమే కాకుండా లలిత కళలపై, నిర్మాణ రంగంపై రేచర్ల రుద్రారెడ్డికి అపారమైన అభిరుచి ఉంది… నేడు ప్రపంచ ప్రఖ్యాత UNESCO ప్రపంచ వారసత్వ కట్టడంగా విరాజిల్లుతున్న చారిత్రక రామప్ప దేవాలయాన్ని (రుద్రేశ్వరాలయం) క్రీ.శ. 1213లో నిర్మించింది ఈయనే… తన పేరు మీదుగా, శివుని పేరు మీదుగా ఆ ఆలయానికి రుద్రేశ్వర ఆలయంగా పేరు పెట్టాడు… శిల్పి పేరుతో రామప్ప ఆలయంగానూ పిలుస్తారు…
సో, చరిత్ర మరువని రుద్రుడి త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ… వరంగల్ ఎయిర్పోర్టు వేదికగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం… భావితరాలకు మన గొప్ప చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేసే అభినందనీయమైన పరిణామం…
Share this Article