.
ఛావా సినిమా చూశారు కదా, మీ రియాక్షన్ ఏమిటీ అనడిగాను ఓ సినిమా పెద్దాయన్ని..! ‘‘విక్కీ కౌశల్ ఓ నటుడిగా ఉన్నతంగా కనిపిస్తున్నాడు… పాత్రల ఎంపిక, వాటి కోసం తపస్సు చేయడం… మానసికంగా, దైహికంగా తనను తాను ఆ పాత్రలోకి ప్రవేశించడం అంత సులభం కాదు…
4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 164 కోట్లు అనేది పెద్ద ఫిగర్ కాకపోవచ్చు, కానీ ఇప్పటి బాలీవుడ్ దుర్దినాల్లో ఇదొక
ఆశారేఖ… ఓ సాదా సీదా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఇంత గొప్పగా ఓ సినిమా తీయగలడని అనుకోలేదు మొదట్లో… తోడుగా విక్కీ, రష్మిక, అక్షయ్, అన్నింటికీ మించి ఔరంగజేబు కూతురి పాత్ర వేసిన డయానా పెంటీ కూడా ఎక్సలెంట్…
Ads
ఒక ఉరి, ఒక సర్దార్ ఉధమ్, ఒక శామ్ బహదూర్, ఇప్పుడు శంభాజీ మహారాజ్… అందుకే విక్కీ కౌశల్ ఈతరానికి, ప్రత్యేకించి మహారాష్ట్ర మరాఠీయులకు స్టార్ హీరో అయిపోయాడు… దిక్కుమాలిన స్మగ్లర్లు, పీలింగ్స్ వంటి వెగటు స్టెప్పులు కాదు… ఈ తరానికి దేశభక్తి, సైనికుల త్యాగాలు, సాహసాలు, మనకు తెలియని చరిత్ర పాత్రల్ని ఎంపిక చేసుకుని మెప్పించడం అంత సులభం కాదు, కానీ విక్కీ ఆ ఫీట్ సాధించాడు…
మన తలతిక్క పాత్రల సూపర్ హీరోయిజం పాత్రల్ని చేసే స్టార్ హీరోలు ఓసారి ఛావా చూడాలి… అసలు హీరోయిజం అంటే ఏమిటో శంభాజీ పాత్ర చెబుతుంది మనకు… క్రియేటివ్ ఫ్రీడం అంటారు కానీ, నిజానికి శంభాజీని ఔరంగజేబు పెట్టిన క్రూర హింసను దర్శకుడు యథాతథంగా చూపించలేకపోయాడనే అంటాను నేను… అదే మన తెలుగు చరిత్ర సినిమాలు చూడండి…
వక్రీకరణలు, తిక్క బాష్యాలు, చెత్తా సమర్థనలు…. అల్లూరికీ కుమ్రం భీమ్‌కూ ముడిపెడతారు ఒకరు… రామదాసునూ కబీర్‌దాసునూ కలుపుతారు… అంతెందుకు, సైరా క్లైమాక్స్, కథనం చూడండి… అంతెందుకు, దేవుళ్లకూ పిచ్చి స్టెప్పుల డాన్సులు పెట్టే మన దర్శకుల గురించి ఇంకేం ఆశించగలం..? మన దైవాంశ సంభూతులైన హీరోలు ఒక శంభాజీ పాత్రను కలగనాలి… can they..?
ఈ పాత్రకు విక్కీ కౌశల్‌కు జాతీయ అవార్డు దక్కాలి… చివరి ముప్పావుగంట విక్కీ విశ్వరూపం… థియేటర్లలో జై భవానీ, జై జగదాాంబే, హరహరమహదేవ్ అనే ఉద్వేగ నినాదాలు ప్రేక్షకుల నుంచి… అదీ ఓ నటుడి సక్సెస్ అంటే…
నిజానికి ఛావా నిర్మాతలు ఓ తప్పు చేశారు… పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాల్సింది… ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు… ఓటీటీ రిలీజులో పలు భాషల ఆడియోలు పెడతారేమో… కానీ ఇది నిజమైన థియేటరికల్ ఎక్స్‌పీరియన్స్… భీకరమైన సౌండ్‌తో బాక్సులు పగిలిపోయే బీజీఎం కాదు, థియేటరికల్ ఎక్స్‌పీరియెన్స్ అంటే…!
ప్రేక్షకులు కథతో కనెక్ట్ కావడం, ఆ ఎమోషన్ వాళ్లూ అనుభవించడం… చూశాం కదా యూత్ కూడా ఛావా క్లైమాక్స్ చూసి ఏడుస్తున్న వీడియోలు… ఓ కథకు, ఓ నటనకు కనెక్ట్ కావడం అంటే అదే… అన్నింటినీ తేలికగా తీసుకునే నేటి యువతరం కూడా ఛావా చూసి ఏడవడమంటే ఆ దర్శకుడికి ఇంకేం కావాలి..? ఆమధ్య తెలుగులో బలగం సినిమా కూడా అంతే, ఏడిపించింది…’’ ఇలా సాగిపోయింది ఆయన ఫ్లో…!!
Share this Article