Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిండుకుండ ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ ! – గులాబీ నోళ్లు క్లోజ్ !!

July 31, 2026 by M S R

.

గోదావరి నీటిని వృథాగా వదిలేస్తున్నాడు రేవంత్ రెడ్డి… తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేస్తున్నాడు… కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోవడం చారిత్రిక కుట్ర, మన్నూమశానం, గురుదక్షిణ అంటూ ఏవేవో శుష్క విమర్శలకు దిగింది కదా బీఆర్ఎస్ క్యాంపు… ప్రత్యేకించి హరీష్ రావు…

అది ఓ ట్రాప్, రేవంత్ రెడ్డి నిజంగానే ఆ పంపులన్నీ ఆన్ చేస్తే, మూడు బరాజులు కొట్టుకుపోతే, రేవంత్ రెడ్డి మెడలో ఆ నింద వేయాలనేది ఉద్దేశం… చివరకు ఏ NDSA పంపుల్ని ఆన్ చేయకండి, నీళ్లు నింపకండి అని చెప్పిందో, దాన్ని కూడా ట్రాపులోకి లాగుతోంది బీజేపీ, దాని రహస్య స్నేహితురాలు బీఆర్ఎస్… (ఈరోజు ఏం చెబుతుందో చూడాలి)…

Ads

నిజానికి కాళేశ్వరం బరాజులు పనిచేయకపోయినా రెండున్నరేళ్లుగా తెలంగాణ రైతాంగం అద్భుతమైన పంటల్ని పండిస్తూ రికార్డులు తిరగరాస్తోంది… అందుకే కేంద్ర జలశక్తి మంత్రి అన్నాడు, లక్ష కోట్లు గోదాట్లో పోశారు అని… మరి ఇప్పుడేమిటీ అంటారా..? ఈ ఎల్‌నినో దుస్థితిలో కూడా ప్రకృతి తెలంగాణ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది…

కాళేశ్వరం ఫట్‌.. ఎల్లంపల్లి హిట్‌! ఇదీ నిరూపణ అయింది, కన్నెపల్లి పంపింగ్ వితండవాదకులకు సమాధానంగా! రివర్స్‌ పంపింగ్‌ వాదన మళ్లీ ఫెయిల్… కన్నెపల్లి నుంచి ఎత్తిపోయకుండానే నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు… కడెం, స్థానిక పరీవాహకం నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం… 15 గేట్లు ఎత్తి దిగువకు 1.50 లక్షల క్యూసెక్కుల విడుదల…

kaleswaram

కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి ఒక్క చుక్క నీటిని ఎత్తిపోకుండానే ఎగువన కురిసిన వర్షాలు, కడెం ప్రాజెక్టు నుంచి వచ్చిన భారీ వరదతో ఎల్లంపల్లి నిండిపోయింది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో గురువారం రాత్రి 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది…

గురువారం రాత్రి 8 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 3,56,254 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది… ఇందులో కడెం ప్రాజెక్టు నుంచి 1,56,279 క్యూసెక్కులు, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి 1,99,975 క్యూసెక్కులు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఒక్క క్యూసెక్కు ప్రవాహం కూడా లేకపోయినా ఎల్లంపల్లికి ఈ స్థాయిలో వరద చేరడం గమనార్హం…

మేడిగడ్డ నుంచి సుమారు 47.2 కిలోమీటర్ల దూరంలో అన్నారం, 80.7 కిలోమీటర్ల వద్ద సుందిళ్ల, 111.1 కిలోమీటర్ల వద్ద ఎల్లంపల్లి ఉన్నాయి. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్లకు, చివరకు ఎల్లంపల్లికి ఎత్తిపోస్తేనే ఉత్తర తెలంగాణకు నీరు అందుతుందని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదే పదే ప్రచారం చేసుకుంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన తర్వాత అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల వద్ద గేట్లను ప్రభుత్వం తెరిచిపెట్టింది. నీటిని నిల్వ చేస్తే ప్రమాదమంటూ ఎన్​డీఎస్​ఏ సూచనలను అమలు చేసింది. కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయాలని విపక్షాలు ఇటీవల పట్టుపట్టాయి. గోదావరిలో నీరు ప్రవహిస్తున్నా ప్రభుత్వం కన్నెపల్లి పంపులను ఎందుకు నడపడం లేదని ప్రశ్నించాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేసి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని డిమాండ్‌ చేశాయి.

అయితే నదిలో నీరు కనిపించడం వేరు.. పంపులు నడపడానికి అవసరమైన కనీస నీటిమట్టం ఉండటం వేరు. మేడిగడ్డలో పంపింగ్‌కు కనీసం +93.50 మీటర్లు, అన్నారంలో +116.50 మీటర్లు, సుందిళ్లలో +126.50 మీటర్ల నీటిమట్టం అవసరం. అంతేకాకుండా మేడిగడ్డ భద్రతకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ సూచనలను పక్కనపెట్టి నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదు.

ఎల్లంపల్లికి సొంత పరీవాహకమే బలం … ఎల్లంపల్లి కేవలం కాళేశ్వరం నుంచి రివర్స్‌లో ఎత్తిపోసే నీటిపైనే ఆధారపడిన ప్రాజెక్టు కాదు. ఎగువ గోదావరి ప్రవాహాలు, కడెం నది, విస్తారమైన స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి సహజంగా వచ్చే నీరు ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆధారం. తాజా వరద లెక్కలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి.

కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపులు నడవకపోయినా ఎల్లంపల్లి నిండింది. నిండటమే కాదు.. వచ్చిన వరదను గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసే స్థాయికి చేరింది.  ఎల్లంపల్లి నిండాలంటే ప్రతిసారీ మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేసి కన్నెపల్లి నుంచి మూడు దశల్లో ఎత్తిపోయాల్సిందేనన్న ప్రచారం మాత్రం తాజా వరద లెక్కల ముందు నిలబడటం లేదు…

ప్రస్తుతం నంది, గాయత్రి, దేవాదుల పంపుల నుంచి గోదావరి నీళ్లు విస్తృతంగా ఎత్తిపోయబడుతున్నయ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions