రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలి అనే డిమాండ్ రిటైర్డ్, సీనియర్ క్రికెటర్ల నుంచి బలంగా వస్తోంది… గుడ్, అర్హుడే… ఆల్రెడీ తనకు పద్మభూషణ్ ఇచ్చింది ప్రభుత్వం… ఇండియన్ క్రికెట్‌లో అత్యంత హుందాగా వ్యవహరించే కొద్దిమంది క్రికెటర్లలో తను కూడా ఒకడు…
పుట్టిందేమో మధ్యప్రదేశ్, ఇండోర్… బెంగుళూరులో సెటిల్డ్ ఫ్యామిలీ… తండ్రి జామ్ ఫ్యాక్టరీలో ఉద్యోగి, అందుకే రాహుల్ నిక్‌నేమ్ జామ్, జమ్మీ అని పెట్టుకున్నారు పేరెంట్స్… తల్లి ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్… రాహుల్ భార్య ఓ వైద్యురాలు… తను ఎంబీఏ… వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ…
మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచాక… జట్టు ప్లేయర్లందరూ రాహుల్‌ను చేతుల మీద అమాంతం పైకి లేపి ఆనందాన్ని షేర్ చేసుకున్న ఫోటో చాలా బాగుంది… అది ఆనందాన్ని షేర్ చేసుకోవడమే కాదు, కోచ్‌గా రాహుల్ అందించిన సేవలకు ఓ కృతజ్ఞత… బహుశా రాహుల్ ద్రవిడ్ 28 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఇంత ఆనందక్షణాన్ని మరొకటి చూడలేదేమో…
Ads
ఇన్నేళ్లుగా ఎప్పుడూ తను నీడలోనే ఉండిపోయాడు, ఎంత ప్రతిభ చూపినా ఎవరో ఒకరికి మైలేజీ వెళ్లిపోయి, తను డార్క్‌లో ఉండిపోయేవాడు… ఒకరకంగా శనిగ్రస్తుడు… అందుకే ఈ వరల్డ్ కప్ సాధించిన క్షణం తనలోని ఆనందం ఒక్కసారిగా మొహంలోకి వచ్చేసింది…
Living Under Shadows అనడానికి బోలెడు ఉదాహరణలు తన కెరీర్‌లో… క్రికెటర్లందరికీ వేర్వేరుగా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్లందరూ రాహుల్ ద్రవిడ్‌ను అభిమానిస్తారు… దటీజ్ రాహుల్… ఓ ఇంటర్వ్యూలో తనంటాడు… ‘వన్డేలు, టెస్టుల్లో 10 వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా నా మనవళ్లు, మనవరాళ్లకు గుర్తుంటానో లేదో తెలియదు గానీ, సచిన్ టెండూల్కర్ టీమ్మేట్ అని మాత్రం గుర్తిస్తారు…’’
శనిబాధితుడు అనే అంశానికి వస్తే…
లార్డ్స్‌లో తన డెబ్యూ మ్యాచులో సెవెన్త్ ప్లేసులో 95 రన్స్ చేశాడు, కానీ గంగూలీ 131 చేయడంతో అందరి మెప్పూ తనకు పోయింది…
శ్రీలంక మీద ఓ వరల్డ్ కప్ వన్డేలో తను బెటర్ స్కోర్ 145 చేసినప్పుడు… గంగూలీ అదే మ్యాచులో 183 చేశాడు, అది కూడా గంగూలీ కెరీర్ బెస్ట్… మళ్లీ ద్రవిడ్ ఇన్నింగ్స్ చీకట్లోనే ఉండిపోయింది…
న్యూజిలాండ్ మీద ఆడుతున్నప్పుడు సచిన్‌తో కలిసి ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు… 153 చేశాడు, కానీ అందులో సచిన్ తన కెరీర్ బెస్ట్ 186 చేయడంతో అందరి చప్పట్లూ సచిన్‌కే దక్కాయి…
పాకిస్థాన్ గడ్డ మీద 270 కొట్టాడు ఓసారి… కానీ అందులో వీరేంద్ర సెహ్వాగ్ 309 చేశాడు, అందరి ప్రశంసలు మళ్లీ సెహ్వాగ్‌కు దక్కాయి… పైగా ఆ మ్యాచులో 194 దగ్గర సచిన్ ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం విమర్శలకు గురైంది…
ఒక ఓడిపోయినట్టే అనుకున్న ఓ మ్యాచులో ఆస్ట్రేలియా మీద 180 చేశాడు… కానీ ఆ మ్యాచులో వీవీఎస్ లక్ష్మణ్ 281 చేయడంతో మళ్లీ రాహుల్‌కు నిరాశే… అందులోనే హర్భజన్ హ్యాట్రిక్ సాధించాడు…
ఏదో గంగూలీ కెప్టెన్సీకి, ధోనీ కెప్టెన్సీ నడుమ ఓ తాత్కాలిక కెప్టెన్ అన్నట్టుగా రాహుల్ చూడబడ్డాడు గానీ తను వెస్టిండీస్, ఇంగ్లండుల మీద టెస్ట్ సీరీస్ గెలిపించాడు… అదీ ఇండియా ఒక్క మ్యాచయినా గెలిస్తే చాలు అనుకున్న పరిస్థితుల్లో… దక్షిణాఫ్రికాలోనూ తొలి గెలుపు తన సారథ్యంలోనే… ఆ సమయంలో ఇండియా అత్యధిక వరుస విజయాలు అందుకుంది… ఛేజింగ్ విజయాలు కూడా… కానీ 2007 వరల్డ్ కప్ ఫెయిల్యూర్, చాపెల్- గంగూలీ వివాదాలకే మీడియా ఇంపార్టెన్స్ ఇచ్చింది…
తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతూ ఆడిన ప్రతి మ్యాచులో ఇండియా ఓడిపోయింది… దాంతో తనకు ఘనమైన వీడ్కోలు ఎప్పుడూ లభించలేదు… చివరకు ఐపీఎల్ చివరి మ్యాచు కూడా అంతే… అది సచిన్‌కు కూడా చివరి ఐపీఎల్…
తనకు చప్పట్లు దక్కాల్సిన ప్రతిసారీ తనకు నిరాశే… తను ఎవరి నీడల్లోనైతే ఉండిపోయాడో ఆ సహచరులెవరికీ సాధ్యం కాని వరల్డ్ కప్‌ను ఒక కోచ్‌గా సాధించాడు… ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ద్రవిడ్ కోచ్ గా రాజీనామా చేస్తే, రోహిత్ శర్మ T20 వరల్డ్ వరకు ఉండాలని కోరడంతో అంగీకరించాడు… అది టర్నింగ్ పాయింట్…
అందుకే… 2024 వరల్డ్ కప్పు చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇన్నేళ్ల ఓ కసి, ఓ నిరాశ బద్ధలైపోయి, ఓ ఉద్వేగం అలుముకుని కన్నీళ్లు వచ్చాయి తనకు… అప్పటికి గానీ తనను పట్టిన శని వదల్లేదు… అర్థం కాని ఏదో శాపం తొలగిపోలేదు…
అదే మ్యాచుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు కదా మొత్తం చర్చ, అందరి దృష్టీ దానిపైనే కేంద్రీకృతం అవుతుందేమో అనుకున్నారందరూ కానీ… ఈసారి రాహుల్ ద్రవిడ్‌కు కూడా సరైన వీడ్కోలు లభించింది…! మరి భారతరత్న..? ఏమో, ఓవర్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ..!!
Share this Article