.
ప్రస్తుతం భీకరమైన ట్రెండింగులో ఉన్న తెలుగు సినిమా పాటలు రెండు… 1) ఆల్రెడీ రిలీజైన ఇరుముడి సినిమాలోని మల్లెపూల పల్లకీ పాట… ఏ రీల్ చూసినా అదే, ఏ షార్ట్ చూసినా అదే… ఫేస్బుక్, ఇన్‌స్టా హోరెత్తిపోతోంది…
కొంత ట్యూన్ మార్చారనీ, అసలు ఒరిజినలే బాగుంటుందనే ఓ చిన్న విమర్శ, అదీ అభిప్రాయం వచ్చింది తప్ప ఆ ఒక్క పాటే సినిమాను దాదాపు 200 కోట్ల వసూళ్ల దాకా తీసుకోబోతోంది… బ్లాక్ బస్టర్, డౌట్ లేదు…
Ads
2) ఏశ నాగుల కట్ట మీద పాట… చివరకు ఏపీలో ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు ఎదుట కూడా హోరెత్తింది ఈ పాట… ఊగుదమా, తాగుదమా అంటూ… ఇదీ వ్యూస్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది…
మంచి సాహిత్యాన్ని ఖైమా కొట్టీ కొట్టీ పాటను చెడగొట్టాడు అనిరుధ్, లేకపోతే మరింత బ్లాక్ బస్టర్ అయ్యేది… పదాలు వినపడకుండా ఇన్‌స్ట్రుమెంట్స్ మోత మోగించాడని ‘ముచ్చట’ కూడా పాటపై ఉన్న విమర్శల్ని పబ్లిష్ చేసింది… సరే, ఓసారి హిట్టయ్యాక ఇలాంటి విమర్శలు గాలికి కొట్టుకుపోతాయి, అదే జరిగింది…
ఇప్పుడు ఇదే పాటపై మరో వివాదం… అప్పట్లో సుద్దాల అశోక్ తేజ మీద సారంగధరియా పాట గురించి కొంత విమర్శ వచ్చింది కదా, ఇదీ అలాంటిదే… ఇప్పుడు కాసర్ల శ్యామ్ మీద విమర్శ ఏమిటంటే..? ఓ జానపద గీతం నుంచి పాదాలు తీసుకుని, హుక్ లైన్ తీసుకుని, ఒరిజినల్ రచయితకు క్రెడిట్ ఇవ్వకుండా, తనే పూర్తి క్రెడిట్ తీసుకుంటున్నాడు అని…
యశ్‌పాల్ అనే తెలంగాణ రైటర్ ఘాటుగా ఓ పోస్టు పెట్టి శ్యామ్ చేసింది తప్పని వాదించాడు… ఇక్కడ ఉన్నదున్నట్టు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి… కాసర్ల శ్యామ్ మొదట ఈ సినిమా కోసం రాసిన పాట తన సొంతం, దిగువన ఆ లిరిక్స్ మొత్తం ఇస్తాను చదవండి… కాకపోతే నిర్మాతో, దర్శకుడో ఎవరు కోరారో గానీ… ఏశ నాగుల కట్ట మీద అనే హుక్ లైన్ తీసుకున్నాడు…
ఇక్కడ జానపదం అంటే ఏమిటో ఓసారి చెప్పుకుందాం… పాత కాలంలో వ్యవసాయం లేదా ఏదైనా పని చేసే సమయంలో అలసటను మర్చిపోవడానికి, నిత్య జీవితంలో చూసిన విషయాలు, కష్టాలు, సంతోషాలను అప్పటికప్పుడు కైగట్టి ప్రజలు పాడుకునేవాళ్లు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే పాటలు… వాటిల్లో జీవం ఉంటుంది… స్వచ్ఛత ఉంటుంది… ఒరిజినల్ రచయిత ఎవరో తెలియదు, తరాలుగా ఓ పరంపరగా వస్తుంటాయి… అవి ప్రజల ఉమ్మడి సంపద…
కానీ తరువాత కాలంలో జానపద శైలిలో చాలామంది రచయితలు పాటలు రాశారు, పాడారు… అవి మనకు తెలిసిన క్రియేషన్… వాటికి పేటెంట్ రైట్స్ ఆయా రచయితలకే దక్కాలి… అంతేకాదు, ప్రతి రచయిత క్రెడిట్స్ కోరుకుంటాడు, డబ్బే కాదు, క్రియేటర్‌కు పేరు కూడా ముఖ్యం… కానీ ఇక్కడ ఏం జరిగింది..?
శ్యామ్ మొదట జిమ్మెదారి పటేలో గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో అనే పాట రాశాడు… కానీ ఇంకా హై ఉండాలని సినిమా టీమ్ కోరడంతో, వాళ్లే సజెస్ట్ చేయడంతో శ్యామ్ ఈ ఏశనాగుల కట్ట మీద అనే హుక్ లైన్ యాడ్ చేశాడు… ఐతే వివాదం రావద్దనే భావనతో ఆ పాట రాసిన, పాడిన జంగిరెడ్డితో మాట్లాడి లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు…
కాకపోతే క్రెడిట్స్ ఇచ్చే దగ్గర పంచాయితీ… శ్యామ్ సినిమా టీమ్‌కు చెప్పి ఉండాల్సింది, రచయిత క్రెడిట్ కోరుకుంటాడు కదా… పాట మూలం జంగిరెడ్డి, కమల్ ఆడియో కంపెనీ అని సదరు వీడియో కింద క్రెడిట్స్‌లో రాయించాల్సింది… అడిగి ఉండాల్సింది… తను కూడా రచయిత కదా, క్రెడిట్ ప్రాధాన్యం తనకూ తెలుసు కాబట్టి… సో, ఇక్కడ శ్యామ్‌నే పూర్తిగా నిందించాల్సిన పనేమీ లేదు… అది సినిమా టీమ్ చూసుకోవాల్సిన యవ్వారం… ఆ క్రెడిట్స్ కూడా ఓ గౌరవసూచకంగా… వాళ్లకూ నిజానికి ఈ పాట మీద ఏ రైట్సూ ఉండవు…
“ఏశనాగుల జానపద గీతాన్ని 1996లో మొదటిసారి కమల్ ఆడియో కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసింది…‘కొంటె కోలాటం’ జానపద గీతాల పేరుతో వచ్చిన ఆ ఆడియో క్యాసెట్ లో ఈ పాటకు రచయిత పేరు వేయలేదు…సేకరణ జానపదం అని వేశారు” అని యశ్ పాల్ గుర్తుచేస్తున్నాడు…
ఐతే సదరు ఆడియో కంపెనీ కూడా ఈ పాట వాడుకోవడానికి నో ఆబ్జెక్షన్ ఇచ్చిందట… అంటే సినిమా టీమ్ లీగల్‌గా సరైన దారిలోనే వెళ్లింది, ఫర్దర్‌గా ఏ చిక్కులూ రాకుండా… ఇక్కడ మరో కీలక ప్రశ్న కూడా ఉంది, ఆ జానపద గీతాన్ని తొలిసారి ఎవరు రికార్డ్ చేస్తే వాళ్లకు హక్కులు వస్తాయా..? ఎవరు తొలిసారి ఆడియో క్యాసెట్ కోసం పాడితే వాళ్లకే క్రెడిట్స్ దక్కాలా..?
ప్రజలు ఎన్నో తరాలుగా పాడుకునే జానపదాలపై హక్కులు ఎవరికి ఉంటాయి అసలు…? కాకపోతే తొలిసారి క్యాసెట్ కోసం పాడిన గాయకుడికి, రికార్డు చేసిన కంపెనీకి కూడా సినిమా టీమ్ సరైన గౌరవమే ఇచ్చింది… ఏదో మాట్లాడింది, ఎంతో కొంత ఇచ్చి ఉంటుంది కూడా… కానీ అదే స్పూర్తి క్రెడిట్స్‌లో ఇస్తే బాగుండేది… గీత రచయిత అని కాదు… గీత సహకారం అని..!!
కాసర్ల శ్యామ్ లిటిగెంట్ కాదు, తను సొంతంగా రాసిన తెలంగాణ పాటలు కూడా కృతకంగా ఉండవు, తెలంగాణ వ్యవహారికంలో ఎన్నో ఏళ్లుగా పాడుకుంటున్నారు అనేంత సహజంగా అల్లుతాడు పదాలను… తెలంగాణతనాన్ని మెరుపులా అద్దుతాడు… ఏవో తోచిన నాలుగు తెలంగాణ పదాలను వాడటం అని కాదు, కొంత సాహిత్య విలువలూ ఉండేలా జాగ్రత్తపడతాడు కూడా… ఇదీ ఏశనాగుల కట్ట పాట లిరిక్స్…

జిమ్మెదరి పటేలో జిమ్మెదరి పటేల
గల్మ కాడ నీ కోసం ముగ్గునైతిరో
జిమ్మెదరి పటేలో జిమ్మెదారి పటేల
నీ తొవ్వల నా సూపులు కావలున్నయో
అర్రల గుడ్డి దీపమయ్యిందిర పానం
వొర్రిన ఇంటలేదు ఏందీ పాపం
బుడ్డ పరకల కూర వొండిన నీ కోసం
బుడుమట్ల బువ్వ తోటి తిని పో కొంచెం
ఓ బుజ్జవ్వ మరి సద్దిగట్టుకొని రారాదు
ఎక్కడికో
ఏశ నాగుల.. ఏశ నాగుల.. ఏశ నాగుల..
ఏశ నాగుల కట్ట మీద ఏశిన ఉయ్యాల
మనం ఊగుదమె బాలా
మొన్న నీ సెమటలు తుడుసుకున్న
నా వాయిల్ సీర
సింగులే చెక్కంగ సిక్కుల బడెరా
నిన్న నీ వేళ్ళను తలుసుకోని నా జబ్బల రైక
ఉక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినయ్ రా
మన గుస్సా గుస్సా ముచ్చటంత గుర్తుకొస్తెరా
చెవి సత్తుకమ్మ మత్తు గమ్మి మొత్తుకుందిరా
నువ్వే బొర్లిపోయిన బొంతనింక సదురలేదురా
ఇయ్యాల రాకపోతె పక్క మీద నేను సత్తరా
ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా ఒళ్ళు
ఎన్నడొ మరిశిపాయె ఎచ్చని నీళ్ళు
గున గున నువ్ దిరిగిన నా ఇరుకు ఇల్లు
ఏరుకుంటాందిర నీ ఎంగిలి పూలు
నీ రంది తీర్సనీకే నా దగ్గర మందుందే బుజ్జవ్వ
ఏందో అది
దొరల్ తాగే … దొరల్ తాగే… దొరల్ తాగే ..
దొరల్ తాగే ఇప్ప సారాయ్ తాగుదమె బాలా
మనం ఊగుదమె బాలా
దుంకి ఆడే బుజ్జవ్వ దుబ్బ లేపే బుజ్జవ్వ
కీంచ్ కట్ దంచి కొట్టు…
Share this Article