.
నమ్మేలా లేదు- ఎఐ ట్రెండ్ పాత రూపురేఖల్ని పట్టించవు! 45 ఏళ్ల క్రితం బంగారు హారం దొంగతనం… 2026లో AI ఫొటోతో దొరికిపోయిన మహిళ!
చదవగానే సినిమా కథలా అనిపిస్తోంది కదూ? సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న కథ కూడా ఇలాగే ఉంది. కానీ కాస్త ఆగి చూస్తే… ఈ కథలో ప్రశ్నలు ఎక్కువ. సమాధానాలు తక్కువ. ఉత్త హంబగ్ స్టోరీలాగే కనిపిస్తోంది…
ఈ కథ ప్రకారం… 45 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ చిన్న స్వర్ణకారుడి దుకాణంలోకి ఓ యువతి వెళ్లింది. బంగారు హారం కొట్టేసి అక్కడి నుంచి మాయమైంది. పోలీసులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. తర్వాత పేరు మార్చుకుని, మరో గుర్తింపుతో జీవించిందట.
Ads
కాలం గడిచిపోయింది. కేసు కూడా మరుగున పడిపోయింది. ఇంతలో వచ్చింది 2026లో సోషల్ మీడియాలో నడుస్తున్న 80s nostalgia / AI photo trend.
ఆ మహిళ కూడా సరదాగా AIతో తనను 1980ల నాటి ఫొటోలా తయారు చేయించుకుని సోషల్ మీడియాలో పెట్టిందట. ఆ ఫొటో అనుకోకుండా 45 ఏళ్ల క్రితం తన దుకాణంలో కనిపించిన యువతి ముఖాన్ని గుర్తుచేసిందట. ఎందుకంటే ఆ పోస్టును చూసింది… అదే దుకాణ యజమాని!
ఆయన పోలీసులను ఆశ్రయించాడట. పోలీసులు పాత కేసును తిరిగి తెరిచారట. విచారణలో ఆ మహిళ 45 ఏళ్ల క్రితం జరిగిన దొంగతనాన్ని అంగీకరించిందట. అంతే… 45 ఏళ్లుగా దాగిన దొంగతనం, ఓ AI ఫొటోతో బయటపడిపోయిందట! వినడానికి అద్భుతంగా ఉంది.
కానీ… నమ్మేలా ఉందా?
మొదటి సందేహం… ఈ వార్త అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కథపై అనుమానం రావడానికి AI ఫొటో ఒక్కటే కారణం కాదు. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రధాన కథనం IND Todayలో సెప్టెంబర్ 15న వచ్చింది. పేరును చూసి ఇది India Today అనుకోవద్దు. ఇది IND Today.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… IND Today కథనం చివర్లో తన సమాచారాన్ని Maxim Newsకు ఆపాదిస్తోంది. మరో వెబ్‌సైట్ M9 News కూడా ఇదే కథను ప్రచురించింది. అయితే అక్కడ కథ మొత్తం “reportedly” అంటోంది. అంటే సంఘటనను స్వతంత్రంగా ధృవీకరించినట్టు కాకుండా, ప్రచారంలో ఉన్న సమాచారంగా చెబుతోంది.
అంటే మనకు కనిపిస్తున్నది ఏమిటి? ఒక కథనం… దానికి ఆధారంగా మరో కథనం… దానిని అనుసరించిన ఇంకొన్ని వెబ్‌సైట్లు… ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్. మరి పేరున్న జాతీయ మీడియా సంస్థల్లో ఈ సంచలన వార్త ఎక్కడ?
45 ఏళ్ల పాత క్రైమ్ కేసు. పోలీసులు చేధించలేని కేసు. AI ఫొటోతో అనుకోకుండా దొరికిపోయిన నిందితురాలు. దొంగతనం చేసిన మహిళను 45 ఏళ్ల తర్వాత దుకాణ యజమాని గుర్తుపట్టడం. చివరకు నేరాన్ని అంగీకరించడం. ఇంత ఆసక్తికరమైన ఘటన నిజంగా జరిగితే… దానికి సంబంధించిన పోలీస్ ప్రకటన, కేసు వివరాలు, అరెస్టు సమాచారం, కనీసం విశ్వసనీయ స్థానిక మీడియా రిపోర్టు ఉండాలి కదా? ఇప్పటివరకు కనిపిస్తున్న ప్రచారంలో అలాంటి ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా కనిపించడం లేదు.
రెండో సందేహం… AI నిజంగా 1980లోకి తీసుకెళ్తుందా? ఇక్కడే ఈ కథలోని అసలు ట్విస్ట్ మరింత అనుమానాస్పదంగా మారుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న AI ‘80s photo trend’ను గమనించండి. మన దగ్గర 2026లో తీసిన ఫొటో ఉంది. దాన్ని AIకి ఇచ్చి “1980s style” అని అడిగితే ఏం జరుగుతుంది?
80 నాటి దుస్తులు రావచ్చు. అప్పటి హెయిర్‌స్టైల్ రావచ్చు. పాత స్టూడియో బ్యాక్‌గ్రౌండ్ రావచ్చు. పాత కెమెరాతో తీసినట్టుగా గ్రెయిన్, కలర్ టోన్ రావచ్చు. అంటే… AI 1980 వాతావరణాన్ని సృష్టిస్తుంది. కానీ అది మనల్ని నిజంగా 1980లో ఉన్న మన రూపానికి తీసుకెళ్తుందా?
అదే అసలు ప్రశ్న. ఇప్పుడు 45 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి తన ఫొటోను AIకి ఇచ్చి “1980 photo” అడిగితే… AI తప్పనిసరిగా అతన్ని 1980లో ఉన్న చిన్న పిల్లాడిగా మార్చదు. అతని ప్రస్తుత ముఖాన్ని ఆధారంగా తీసుకుని 80 కాలానికి చెందిన లుక్‌ను సృష్టించే అవకాశం ఉంది. ఇదంతా ఫన్ బేస్డ్ ట్రెండ్ మాత్రమే…
అంటే… “80 style” వేరు. “1980లో నేను ఎలా ఉండేవాడిని?” అనేది వేరు. ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు. మరి ఈ కథలో 45 ఏళ్ల క్రితం 20–25 ఏళ్ల యువతిగా ఉన్న మహిళను, 2026లో AI తయారు చేసిన ఒక ‘80 style’ ఫొటోలో చూసి దుకాణ యజమాని గుర్తుపట్టాడట! ఇది సాధ్యమేనా?
మూడో సందేహం… 45 ఏళ్ల తర్వాత ముఖాన్ని ఎలా గుర్తుపట్టాడు? ఒకసారి ఊహించండి. 1981లో ఓ యువతి మీ దుకాణంలోకి వచ్చింది. మీరు ఆమెను చూశారు. ఆమె ఏదో దొంగతనం చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత 45 ఏళ్ల పాటు ఆమె మీకు కనిపించలేదు. ఇప్పుడు 2026లో ఆమె వయసు 60–70 మధ్య ఉండొచ్చు.
ఆమె ప్రస్తుత ఫొటో కూడా కాదు… AIతో తయారుచేసిన ఒక రెట్రో ఫొటోను చూసి… “ఇదే 45 ఏళ్ల క్రితం నా దుకాణంలోకి వచ్చిన అమ్మాయి” అని మీరు గుర్తుపట్టారు! అదీ కథ చెబుతున్న ట్విస్ట్. మరి ఆ గుర్తింపును పోలీసులు ఎలా నిర్ధారించారు? పాత ఫొటో ఉందా? పాత కేసు రికార్డుల్లో ఆమె వివరాలున్నాయా? ఇతర సాక్షులు ఆమెను గుర్తించారా?
ఆమెను పాత కేసుతో కలిపే ఇంకేదైనా ఆధారం దొరికిందా? లేక కేవలం దుకాణ యజమాని గుర్తుపట్టడమే ఆధారమా? కథలో ఇవేవీ స్పష్టంగా లేవు.
నాలుగో సందేహం… 45 ఏళ్ల పాత కేసు వివరాలేవీ ఎందుకు లేవు? ఇంత పాత కేసు నిజంగా బయటపడితే కొన్ని సహజమైన ప్రశ్నలకు సమాధానాలు ఉండాలి. దొంగతనం జరిగిన సంవత్సరం ఏది? దుకాణం పేరు ఏమిటి? దుకాణ యజమాని పేరు ఏమిటి? దొంగిలించిన హారం విలువ ఎంత? ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారా?
FIR నమోదైందా? కేసు నంబర్ ఏమిటి? మహిళ అసలు పేరు ఏమిటి? 2026లో ఆమెను ఎప్పుడు అరెస్టు చేశారు? ఏ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేశారు? ఆమెపై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? ఇవేవీ స్పష్టంగా లేకుండా కథ మాత్రం క్లైమాక్స్‌కు వెళ్లిపోయింది.
పోలీసులు పట్టుకున్నారు… ఆమె ఒప్పుకుంది… 45 ఏళ్ల రహస్యం బయటపడింది! సినిమా కథలాంటి ఓ సోది వార్తకు ఇది చక్కటి ముగింపు…!! ఏమాత్రం నమ్మశక్యం గాని ఉత్త సోషల్ మీడియా మార్క్ ప్రచారకథ!!
Share this Article