Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా నాన్నను నిజంగానే చాలా అడగాలనుకున్నాను…

June 21, 2026 by M S R

.

Murali Buddha … నీకు అంత దైర్యం ఎక్కడిది నాయనా (20, జూన్ 2011, న రాసింది )
మహాత్మా గాంధీ కుమారుడు తన తండ్రిపై రాసిన పుస్తకంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ దేశ ప్రజల దృష్టిలో జాతిపిత, మహాత్ముడు కావచ్చు. కాని ఒక కుమారుడిగా, తన తండ్రి గాంధీపై తన అభిప్రాయం అది కాదు. గాంధీ అంటే ఒక విఫలమైన తండ్రి అని అన్నాడు.

మహాత్ముడు ఈ నేలపై నడయాడిన దేవుడు అని భావించే ప్రజల్లో నేనూ ఒకడిని . కాని ఒక కుమారుడుగా మాత్రం నా ఓటు మహాత్ముని కుమారుడికే .
జాతిపిత కావచ్చు, ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్న వారైనా కావచ్చు, తన పిల్లలను తీర్చి దిద్దాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది . తండ్రి విఫలమైతే మొత్తం కుటుంబమే విఫలమౌతుంది .

Ads

***
మా నాయనను అనేక ప్రశ్నలతో కడిగేయాలని నాకు ఎన్నాళ్ళ నుంచో ఉంది. హైదరాబాద్ నగరానికి కేవలం 45 -50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు మాది. నల్లగొండ జిల్లా మన్నెవారి తుర్కపల్లి. ( నేను మా ఊరు ఎప్పుడూ వెళ్ళలేదు )

ఎకరం కోటి రూపాయల వరకు ధర పలుకుతుందని తెలియగానే . తాతల కాలం నుంచి వచ్చిన అన్ని ఎకరాల భూమి మాకోసం ఉంచాలని అనిపించలేదా నాన్నా ? నీకా ముందు చూపు లేకపోవడం వల్లనే కదా మహానగరంలో మేం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది అని నిలదీయాలని ఉండేది .

పోనీ హైదరాబాద్ వచ్చావు సరే, హైదరాబాద్ గాంధీనగర్ లో భూమి ధర ఇప్పుడు బంగారంకన్నా ఎక్కువ ఖరీదు చేస్తుంది. అప్పుడు వెయ్యి రూపాయలకో ప్లాట్ వచ్చేదట తలా ఓ ప్లాట్ కొని పెట్టినా బాగుండేది కదా . అలా ఎందుకు చేయలేకపోయావు నాయనా?

మీ అమ్మకు బోలెడు బంగారం పెట్టారురా అని మేనమామ చెప్పినప్పుడు కనీసం ఆ బంగారం దాచలేక పోయావా? అని అడగాలనుకున్నా … నిజాం కాలంలో తెలంగాణా పల్లెలను దోచుకోవడానికి అవకాశం ఉన్న స్థానంలో ఉండీ.. దోచుకోలేదు సరే, కానీ కనీసం ఉన్నది ఎందుకు దాచలేకపోయావని ప్రశ్నించాలని అనిపించేది ….. ఇంకా ఇలాంటి ప్రశ్నలు నాలో అనేకం ఉండేవి .

*****
ఇప్పుడు కూడా ప్రశ్నించాలనే అనుకుంటున్నాను . కానీ నా ప్రశ్నల సంఖ్య మారింది, ప్రశ్నలూ మారాయి .
నీకు అంత దైర్యం ఎక్కడిది నాయనా? అని ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది.
నిజంగా పేదరికం కవులు వర్ణించినంత భయంకరంగా ఏమీ ఉండదు.
కసిని పెంచుతుంది , మనలోని శక్తి సామర్థ్యాలను సాన పెడుతుంది. సరిగ్గా ఎదుర్కొంటే తోక ముడుస్తుంది. సంపదలో పెరగడం అంత అదృష్టం కాదు, కష్టం కూడా కాదు . కాని సంపద నుంచి పేదరికంలోనికి మారి బతకడం చాలా కష్టం .

నిజాం కాలంలో గ్రామంలో పెత్తనం చెలాయించే ఇద్దరు ముగ్గురిలో పోలీసు పటేల్ ఒకరు … మా నాన్న పోలీసు పటేల్ గా ఉండే వారు . దాదాపు పన్నెండు గ్రామాల వారికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు. మా నాన్న సంపదలో పుట్టి, సంపదలో పెరిగారు . మాకు ఊహ తెలియక ముందే అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది . సంపద ఉన్నదనే తెలియనప్పుడు ? ఎటుపోయిందో? ఏం తెలుస్తుంది .

*****
నిజమే, మా నాన్నకు పెద్ద వ్యసనాలే ఉండేవి .మనుషులను నమ్మడం, మనుషులను ప్రేమించడం .. ఎలాంటి వారైనా చావు దెబ్బ తినడానికి మనుషులను నమ్మడమనే ఒక్క వ్యసనం సరిపోదూ ? మనుషులను ప్రేమించడం వరకు క్షమించేయవచ్చు , కానీ మనుషులను పూర్తిగా నమ్మడం మాత్రం ఎప్పటికైనా ప్రమాదమే. …..

మా నాన్నకు మనుషులను నమ్మడమనే వ్యసనం ఉంటే మా పెద్దన్నకు మనుషులను అస్సలు నమ్మకపోవడం అనే పెద్ద వ్యసనం ఉంది. తన వ్యసనం వల్ల సంపదలో పుట్టినా పేదరికంలో బతికాడు మా నాన్న .. నమ్మకపోవడమనే వ్యసనం వల్ల మా అన్న మాత్రం పేదరికాన్ని చాలెంజ్ చేసి సంపన్నుడు అయ్యాడు .

తండ్రి వ్యసనాన్ని చూసి మా అన్న ఒకే ఒక పాఠం నేర్చుకున్నాడు. ఎవరినీ నమ్మవద్దు అనే సత్యాన్ని నమ్ముకున్నాడు.  ఆ నమ్మకమే అతన్ని బట్టల కొట్టు గుమస్తా నుంచి బంగారం దుకాణం యజమానిగా మార్చింది , అద్దె ఇంటి జీవితం మొదలు పెడితే ఒకటిన్నర డజన్ల ఇళ్ల నుంచి అద్దెలు వసూలు చేసే యజమానిగా మార్చింది. అందరినీ నమ్మితే ఏమోతుందో నాన్న ఉదాహరణగా నిలిచారు. అలా అని అస్సలు మనుషులను నమ్మకుండా ఎలా ఉంటాం . అందుకే నాకు ఆ రెండు వ్యసనాలలో కొంచం కొంచం వ్యసనం చాలనిపించింది .

***
రామాయణం, మహాభారతం , పురాణాల నుంచి కొన్ని ఉదాహరణలతో వ్యక్తిత్వ వికాసంపై ఓటమే గురువు పుస్తకం రాశాను . మిత్రులకు పుస్తకం ఇస్తుంటే అక్కడికి కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ మిత్రుడు నా చేతిలోని బుక్ పై ఇంటి పేరు చూసి ఈ ఇంటి పేరు గలవారు మాకు తెలుసు, మా ఊరే అని ఆసక్తి చూపించాడు.

మా ఊరిలో బుద్దా కాశయ్య అని ఉండే వారు , మా నాన్న ఆయన శిష్యుడు . తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కలిసి పని చేశారు . వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా జనం సందడి అంటూ చెప్పుకు పోతున్నాడు. చాలా సంతోషం వేసింది . అతను చెబుతున్నది మా నాన్న గురించి.

కొద్దిసేపటి తరువాత చెప్పాను, ఆయన మా నాన్న అని . ఆ తరువాత ఆ మిత్రుడు చాలాసార్లు ’అన్నా ఓసారి ఊరికిరా’ అని అడిగాడు. వస్తానని చెప్పాను కానీ ఎందుకో నాకు పెద్దగా ఆసక్తి అనిపించలేదు . ఓసారి కొంచం ఆశ్చర్యంగా, వింతగా చూస్తూ మన ఊరు చూడాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా? అని అడిగాడు. చిరునవ్వే సమాధానం.

ఓసారి అక్కడి యమ్. యల్.ఏ. తో ఏదో మాట్లాడుతుంటే మురళీ, నువ్వు మానూరివాడివేనట కదా అంటూ ఊరికి చెందిన కొందరు పెద్దల పేర్లు చెప్పి, వీరంతా నాకు పరిచయమే అని చెబుతుంటే ఒళ్ళు పులకరించినట్టు అయింది. చిన్నప్పుడు ఆ పేర్లన్నీ మా నాన్న మాటల్లో తరుచుగా వినిపించేవి .

***
నాకు కొద్దిగా ఎరుక అనేది వచ్చిన తరువాత గుర్తున్న విషయం . రక్త సంబంధీకులకు సంబంధించిన సమస్య. తాతలనాటి ఆస్తి. పాతవారిని ఖాళీ చేయించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి. తేడా వస్తే ఏమైనా జరగ వచ్చు . ఎవరితో వ్యవహారాలు ఎలా జరపాలో నాకు తెలుసు, భయపడకండి అంటూ ఆరు నెలలు రాత్రి పగలు నాన్న అక్కడే ఉన్నాడు. పదే పదే రుజువు అయ్యేదాన్నే సత్యం అంటాం . అక్కడ నమ్మితే మోసమే అనేది మరోసారి రుజువైంది . మా నాన్న మాత్రం ఎప్పుడూ సంతృప్తికరంగానే కనిపించేవారు, చిన్నచిన్న వాటికి సంతోష పడేవారు.

****
స్టాక్ మార్కెట్ పడిపోవడంతో మొన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతోపాటు ఆయన భార్య కుడా చనిపోయింది . ఆ వార్త బాధ కలిగించింది. వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు , ఒకరు iit లో టాప్ రాంక్ సాధించారు . చచ్చి వాళ్ళు సాధించింది ఏముంది. ఆర్ధిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య . పిల్లలను బావిలో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి .. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మనుషులు ఎందుకు అంత పిరికిగా ఆలోచిస్తారని అనిపిస్తుంది.

****
నీకు అంత దైర్యం ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలని ఉంది. పోలీసు పటేల్ గా ఉంటూ సాయుధ పోరాటానికి అండగా ఉండడం కాదు.. ఈ నేల నలు చెరగులా పోరాట గాలులు వీస్తున్నప్పుదు . ఆ గాలి నుంచి ఎవరూ తప్పించుకోలేరు . నా సందేహం అది కాదు .. బంధువులు తప్ప ఏ ఆధారం లేకుండా పదిమందితో హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టడం.

ఎవరి జీవితాన్ని వారు నిర్మించుకునేట్టు చేయడం చూస్తే … అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడగాలని ఉంది . పిల్లలకు ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి చాలు … మార్కెట్ పడిపోతే , ఉద్యోగం పోతుందంటే ఆత్మహత్యను మార్గంగా చూపించకండి . ఏమో ఈ రోజు బావిలో తల్లితో పాటు శవంగా తేలుతున్న పిల్లవాడిని బతకనిస్తే జీవితంలో తలెత్తుకొని నిలబడే వాడేమో .

****
సంపద నుంచి పేదరికంలోకి మారాక జీవితం నరకప్రాయంగా ఉంటుంది కానీ నాకు గుర్తున్నంత వరకు మా నాన్న ముఖంలో నేను నిరాశను ఎప్పుడూ చూడలేదు . నమ్మినవారు మోసం చేసినా అస్సలు పట్టించుకోలేదు . ఉన్నంతలో పిల్లలతో హాయిగా ఉండాలి అంతే. మనం ఫీల్‌ఖానాలో ఉండగా నాన్న కోసం ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఆనాటి ముచ్చట్లు చెప్పుకునే వారని మా చిన్నన్న చెప్పాడు.

ఓసారి మా చిన్నమ్మాయి నాన్నా అంతా సెలవుల్లో మా ఊరెళ్తున్నాం అని గొప్పగా చెబుతున్నారు , మనకు ఉరు లేదా, మనం వెళదాం అంది. హైదరాబాదే మన ఊరు అని సింపుల్ గా చెప్పాను.
ఇప్పుడు నాకు మా ఊరు వెళ్ళాలని ఉంది . మా ఊరికి వెళతాను. ఊరి ముచ్చట్లు మా నాన్న ముచ్చట్లు సేకరిస్తాను.

****
ఈ ఫీజులు , ఖర్చులు చూస్తుంటే ఒక్కోసారి భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది అనే మాట ఇంట్లో వినిపిస్తే , సొంతిల్లు, ప్రభుత్వ ఉద్యోగమంత భద్రత ఉన్న ఉద్యోగం , చక్కగా చదువుకుంటున్న పిల్లలు, ఇలా ఉన్న మనమే అలా అనుకుంటే మరి మా నాయన …. అంటూ మా నాన్న గురించి చెబితే నిజమే అన్నారు. నాకు ఇప్పటికీ మా నాన్నే ధైర్యం .

అధికారంలో ఉన్న వారిని, వెధవలకు కూేడా తలవంచి పైకి ఎదుగుతున్న వారు కళ్ళ ముందు కనిపిస్తున్నా.. నేను నిటారుగా నిలబడే వ్యక్తిత్వంతోనే ఉన్నా … నేను రాసిన జనాంతికం పుస్తక ఆవిష్కరణ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ నీకింత ధైర్యం ఏమిటి ? నీమీద పోటా కేసు పెట్టవచ్చు తెలుసా అని పుస్తకంలోని మాటలు ప్రస్తావించారు. రాయడానికి నిజంగా పెద్ద ధైర్యం అవసరం లేదు. పైరవీలు చేసుకొని బతుకుదాము అనే కోరిక లేకుంటే చాలు . కానీ కష్టాలను ఎదిరించి బతుకు పోరాటం చేయడానికే  ధైర్యం కావాలి .. అందుకే అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలనుకున్నా..

*****
ఓ చోట రాంగోపాల్ వర్మ గవాస్కర్ చెప్పిన మాట చెప్పాడు . అవుట్ అయి రాగానే పాడ్ బాయ్ కూడా మీరు ఆ బాల్ అలా కొట్టాల్సింది కాదు సార్ అని సలహా ఇస్తాడట . అలాగే ఇలా చేయాల్సింది కాదు, అలా చేయాల్సింది కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు . తప్పు ఎవరిది, ఎవరు ఎవరిని మోసం చేసారు అనే దానిపై కూడా నాకిప్పుడు ఆసక్తి లేదు.

బతుకు ఆంటే భయంకరం అనుకొని దాన్ని భయంకరంగా ఊహించుకోకండి . ఆత్మహత్య పిరికి పంద చర్య అని నేను చెప్పడం లేదు . ఆత్మహత్యకు కూడా ధైర్యం కావాలి కానీ బతకడానికి అంతకన్నా మించి ధైర్యం కావాలి. బతుకు భయపెడితే పేదరికాన్ని ఈడ్చి తన్నిన మా పెద్దన్న భవనం బేగంపేట ఆనంద్ సినిమా హాల్ వెనకాల నిటారుగా నిలబడి ఉంటుంది . ఓసారి చూడండి.

****

  • ఏ సమస్య వచ్చినా ముందు నిలిచేది మా నాన్నే. 1982 లో నేను పదో తరగతి పరీక్షలకు సిద్ధమౌతున్నా.. అంత్యక్రియల్లో ఏదో సందేహం . ఎందుకు కంగారు పడతారు, నాన్నను అడగవచ్చు కదా అనే మాట నోటి వరకు వచ్చి ఆగిపోయింది . ఎందుకంటే , అక్కడ జరుగుతున్నవి మానాన్న అంత్యక్రియల ఏర్పాట్లు .

.
( ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ) … ( తండ్రి గురించి బుక్ వేస్తాను అంటే 15 ఏళ్ళ క్రితం రాసిన పోస్ట్ ఇది . అప్పుడు బ్లాగ్ లో పోస్ట్ చేశా . ట్రై చేస్తే దొరికింది . 15 ఏళ్లలో అనేక మార్పులు . ఆర్టీఐ కమిషనర్ గా రిటైర్ అయ్యాను . బుక్ మీద పేరు చూసి, మా నాన్న గురించి చెప్పిన మిత్రుడు బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇప్పుడు RTI కమిషనర్ … )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మా నాన్నను నిజంగానే చాలా అడగాలనుకున్నాను…
  • అదే పాట – అదే సిరివెన్నెల- భానుమతి పాడితే నో – తనే పాడుకుంటే నంది
  • రష్మిక Vs సమంత…! పోలికే అనవసరం… 2 సినిమాలు వేరు- 2 బతుకులు వేరు…
  • ఒక తల్లి, ఒక కొడుకు – మారుపేర్లు, మారిపోయే ఊర్లు… ఎందుకిలా..?
  • అందం అంటే ఏమిటి..? ప్రామాణికాలు, కొలమానాలు ఏమున్నాయి..?
  • వేల విదేశీ డెబిట్ కార్డులు – అమెరికా ఎన్‌జీఓ దేశద్రోహ కుట్ర
  • మామా ఏక్ పెగ్‌లా – నో స్కాచ్ – ఇండియన్ విస్కీ కిక్కే వేరప్పా..!
  • Leonor – ఈ యువరాణి మళ్లీ వార్తల తెరపై..! ముచ్చట గొలిపే తర్ఫీదు..!!
  • ఇద్దరూ హోం మంత్రులే… అప్పట్లో తండ్రి బందోబస్తు- ఇప్పుడు కొడుకు కొరడా
  • ఎస్‌బీఐ వివాదం – ఎవరు ఈ శెట్టి ? పనోడు కాదు- మనోడిగానూ లేడు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions