.
*పద్మశ్రీ రఘురాయ్ : సత్యం శివం సుందరం…. భారతదేశమే కాదు, ప్రపంచం గర్వించదగ్గ అపురూపమైన ఫోటోగ్రాఫర్ శ్రీ రఘురాయ్. వారు మొన్న రాత్రి 83వ యేట అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. రెండేళ్ల క్రితం ప్రోస్టేట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని, అది క్రమంగా కడుపులోకి, చివరికి మెదడులోకి వ్యాపించి వారిని బలిగొన్నదని కుమారులు నితిన్ రాయ్ పత్రికలకు తెలిపారు.
వారి లోటు తీరనిది అని చెప్పడం వట్టి మాట. ఆయన వలే మన దేశంలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపే ఛాయా చిత్రకారులు మరొకరు లేరు, రారు. అదృష్టవశాత్తు పదహారేళ్ల క్రితం మొట్టమొదటిసారిగా వారిని కలిశాను, ఒక పుస్తకం రాయడానికి వెళ్లి. చిత్రం ఏమిటంటే వారిని కలిశాక తిరిగి ఫోటోగ్రాఫర్ ని అయ్యాను. తాను గురువర్యులే అయ్యారు. పుస్తకము వెనక్కి వెళ్ళింది. నిజానికి అచ్చు వేయలేదు గాని రాశాను. ఆ అముద్రిత రచన నుంచి ఒక అధ్యాయం… వారి దివ్య స్మృతికి నివాళిగా… – కందుకూరి రమేష్ బాబు
కాసేపు లేదా ఒక పూట అన్నచోట రఘురాయ్ తో నేను చాలా రోజులే గడిపాను. 18 మే 2010న అక్కడకు వెళ్లిన నేను అక్కడే సరిగ్గా పద్నాలుగు రోజులున్నాను.
ఆ రోజుల్లో రఘురాయ్ తో నేను మాట్లాడింది చాలా స్వల్పం. నిజానికి మాట్లాడలేదనే చెప్పాలి. మరేం చేశానూ అంటే రోజూ ఆయన్ని చూడటం, ఆయన పనిచేసుకుంటుంటే పక్కన కూచోవడం, సాయంత్రానికి తనతో కలిసి చక్కగా టీ సేవించడం, చీకట్లు కమ్ముకున్నాక తన కార్యాలయం ఉన్న మలుపు తిరిగి, ఆ పక్కనే గుబురు గుబురు పొదల పక్కనుంచి తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళుతుంటే “బై సర్” అని చెప్పేసి వెనక్కి రావడం! ఇందులో ఆసక్తి కరమైంది ఏమిటీ అంటే “ఆయనే!”
Ads
అవును. రఘురాయ్ గారిని దగ్గరగా చూడటం…ఆయన సన్నిధిని ఫీల్ కావడం…ఇంతకు మించిన అనుభవం ఇంకేం ఉంటుంది?!
సంభాషణ అంటారా? మౌనంగా ఆయన పని చేసుకుంటుంటే నేను ఆయన గురించి చదువుకుంటూ ఉండటం కూడా ఒకలాంటి సంభాషణ వంటిదే. ఇంకా చెబితే దాన్ని మించిందనే అనాలి. ఎందుకంటే, ఆయన సమక్షంలో ఆయన్ని గురించిన విషయాలు లోతుగా చదువుకోవడం అంటే అది ఆత్మీయుల ఆశీస్సులు పొందడం వంటిదే!
‘ఇక్కడకు వచ్చిన పిల్లవాడు తన గురించే ఏదో చదువుకుంటున్నాడు’ అని ఆయన అనుకున్నారో లేదో తెలియదుగానీ, ఆయనైతే అట్లా ప్లెజెంట్గా ఉండటం నాకూ నచ్చింది. ఏమీ అడగటంలేదు. అసలు ఏం చేస్తున్నడో ఇతడు అన్నట్టు కూడా ఆయన ఎప్పూడూ వ్యవహరించలేదు. అయితే, మా మధ్య సంభాషణ ఇంగ్లీషులోనే జరిగేది. కాకపోతే ఏదన్నా అడిగితే దానికి సుదీర్ఘంగా జవాబు చెప్పడం ఎప్పుడూ జరగలేదు. ఈసారి కాదుగానీ తర్వాత ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు మాత్రం కాస్తంత లోతుగానే మాట్లాడుకున్నాం.
అయితే, అతడితో ఎలా సంభాషించాలో ఈ తొలి సందర్శన తాలూకు అనుభవమే కొంత నేర్పింది.
అయితే, ఈ పద్నాలుగు రోజుల్లో ఏ మాత్రం మాట్లాడుకోలేదా? అంటే మాట్లాడుకున్నాం అనే చెప్పాలి. కాకపోతే, క్లుప్తంగా. ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుందిగానీ ఆ ప్రశ్నలు ఎట్లాంటివంటే – ఒక ఫోటోను చూసి ఆశ్చర్యపోయి “మీరు ఈ ఫోటో కూడా తీశారా?” అని అడిగడం… దానికి ఆయన “అవును” అని చెప్పడం. “ఈ పుస్తకంలో ఉన్నది మీ శ్రీమతి గుర్మీతే కదా!” అంటే, “అవునవును” అని నవ్వడం. “ఇది మా చిన్న పాప అవని” అని ఆయన జోడించడం…”మీ అమ్మా నాన్నల ఫోటోలు చూడవచ్చా సార్?’ అంటే, “అయ్యో… అవి ఎక్కడున్నాయో… వెతకాలి” అనడం… “ఇండియా టుడేలో పదేళ్లు ఉన్నారా?” అంటే తల ఆడించడం… ఇట్లా అన్న మాట. ఈ పొడి పొడి మాటలే నా సందేహాలను పూరించేవి కూడా.

చిత్రమేమిటంటే, తనతో ఒక ఏడాది పాటు నేను టచ్లో ఉంటానని నాకు ముందే ఎట్లా తెలుస్తుంది! అందుకే ఇప్పుడనిపిస్తుంది, మా పరిచయం లేదా సంభాషణ అన్నది వర్షం మాదిరిగా మొదలైందనడం కరెక్టని! ముందు భూమి తడసిన వాసన ఉంటుంది చూడండి… అట్లా ఆయన్ని నేను ఫీలవడమే ఈ తొలి పర్యటనలో విశేషంలోకెల్లా విశేషం. ఇక ముందుగా చెప్పినట్టు… ఈ పొడి పొడి మాటలున్నాయి చూడండి… మెల్లగా చినుకు చినుకూ పడుతుంటే అదిగో… వర్షం పడేట్టుంది అనుకోమా… అట్లా అన్నమాట…
అయితే, ఇక్కడున్న రోజుల్లో ఆయన పుస్తకాలన్నీ శ్రద్ధగా చూసే ప్రయత్నం చేశాను. ఆయా పుస్తకాలకు రాసిన ముందు మాటల్ని ఒకటికి రెండు సార్లు చదివాను. టైం లేదు అన్నట్టుగా కాకుండా నిదానంగా ఆ రోజులన్నీ గడిపాను. ఆయన వేరే వాళ్ల పుస్తకాలకు రాసిన ముందు మాటల్నీ ఎక్కడెక్కడున్నాయో వెతికి మరీ చదివాను. అట్లే, తాను స్వతంత్రంగా అచ్చువేయనివి, వేరే వాళ్లతో కలిసి ప్రచురించిన పుస్తకాలను, అవికాకుండా ఇతర అవసరాల రీత్యా ఎడిట్ చేసిన పుస్తకాలనూ చూశాను. నోట్సూ రాసుకున్నాను.
ఆయన గురుతుల్యులైన హెన్రీ కార్టియర్ బ్రస్సెన్ కంప్లీట్ వర్స్ తాలూకు వాల్యూం చూడటం కూడా గొప్ప అనుభవం. అన్నట్టు, నేను ఢిల్లీ వస్తుండగా నా మిత్రుడు చంద్రశేఖర్ సార్ కెమెరా తెచ్చుకున్నాను. అది చిన్న డిజిటల్ కెమెరా. దాంతోనే వీలైనన్ని ఫోటోలు తీసుకున్నాను. రఘురాయ్ గదిని, ఆయన తన గదిలో, కంప్యూటర్ వద్ద పనిచేసుకుంటూ ఉన్న ఫోటోలను, ఆ గదిలో ఉన్న రెండు పెద్ద ప్రింటర్లనుంచి ఆయన ఫోటోలు ప్రింటై బయటకు వస్తున్నప్పుడు వాటినీ ఫోటోలు తీయడం… ఆ ప్రింట్ల తాలూకు ఫ్రెష్నెస్ను అనుభవిస్తూనే, వాటిలోని లోటుపాట్ల గురించి ఆయన తన ముఖ్య అసిస్టెంట్కు సలహాలు ఇస్తుండడం… ఆ సమయాలనీ ఫోటోలు తీశాను.
ఇక తన భార్య, ఆమె తాను పనిచేసుకుంటూ ఉన్న చోటుకు వచ్చి నిలబడి మాట్లాడుతుండగా కొన్ని ఫోటోలు తీశాను. అంతేకాదు, గోడలకు వేలాడదీసిన హెన్రీ కార్టియర్ బ్రస్సెన్ ఫోటోలనీ తీసుకున్నాను. అలాగే రఘురాయ్ గారికి 30వ ఏటనే పద్మశ్రీ (1972) వచ్చింది. ఆ పురస్కారం ఫ్రేమ్ చేయించి ఉంది. దాన్నీ తీసి ఉంచుకున్నాను.
చెప్పాను కదా! కాలం గడిచినాక ఏది ముఖ్యమో ఏది అనవసరమో తెలిసి వస్తుందిగానీ ఆప్పటి వర్తమానంలో ప్రతిదీ ముఖ్యమే అని.
ఇక నేను బయలు దేరడానికి రెండు రోజుల ముందు ఆయనతో జరిగిన సంభాషణ కూడా ముఖ్యమైందే. నేనున్న ఈ రోజుల్లో, చేసిన కాస్తంత స్టడీలో నాకు లీలగా తట్టిన ఒక లైన్ ఆయనతో పంచుకుందామనిపించింది. అంటే మరేంలేదు, నేను తన మీద రాయబోతున్న పుస్తకానికి శీర్షిక “ది స్టోరీ ఆఫ్ డాంకీ” కాదు, మరొకటనిపించింది! ఎందుకంటే ఆ ఛాయచిత్రకారుడిని కేవలం ఒక స్థాయిలోనే కాకుండా మూడు పార్శాల్లో దర్శించాలన్న భావన కలిగింది. అందుకే కొంచెం ప్రణాళిక వేసుకున్నట్టే వేసుకుని, అవసరమైన కొన్ని ఫోటోలను తన కార్యాలయంలోనే జిరాక్స్ కాపీలు తీసుకుని ఆయన వద్దకు వెళ్లాను.
***
“సార్.. కొద్దిసేపు మీ సమయం ప్రత్యేకంగా కావాలి” అని అడిగాను. ఆయన దానికి తడుముకోకుండా, “ఓ.. తప్పకుండా. రేపు మధ్యాహ్నం… ఓకేనా?” అన్నారు.
దానర్థం ఆయన రోజూ భోజనం చేశాక కాసేపు కునుకు తీస్తారు. అదీ ఓ పావుగంట లేదా ఇరవై నిమిషాలు. ఆ సమయం గడవగానే టక్కున మేలుకుంటారు. వెళ్లి మొహం కడుక్కుని వచ్చి మళ్లీ కంప్యూటర్ వద్ద… తన అసిస్టెంట్ పక్కన కూచుంటారు. మళ్లీ ఎడిటింగ్ షురూ… అంటే ఆ సమయం అన్నమాట.
అన్నట్టు, ఆయన ఉదయం తొమ్మిదిన్నరకే కార్యాలయానికి వస్తారు. రాగానే పని మొదలు… ఒంటిగంట దాకా వేరే పనేం లేదు. ఎడిటింగ్… ఎడిటింగ్… ఇదెలా ఉంటుందంటే, పనిలో విసుగు రాకుండా ఆయన ఎట్లా తన పనుల్లోనే భేదం పాటిస్తారంటే ఒక సబ్జెక్ట్ నుంచి మరో సబ్జెక్టుకు వెళ్లిపోతారు. ఈ విధానాన్ని తర్వాతి అధ్యాయంలో రాస్తాను గానీ మొత్తంగా ఆయన విసుగూ విరామం లేకుండానే అయినప్పటికీ కూల్ గా పనిచేస్తారంటే దానికి కారణం తనలోని భిన్న పార్శాలను స్పృశించడమే.
అయితే, ఇట్లా పని చేసుకోవడం ఉదయాన్నే మొదలు పెట్టారంటే మధ్యాహ్నం భోజనం సమయానికే ఆగుతారు. సిగరెట్టు అలవాటు కూడా చాలా ఏళ్లయిందట మానేసి. దాంతో ఇక ఒక్క నిమిషమూ కాళీగా ఉండరు. భోజనం తర్వాత మాత్రం తప్పకుండా ఇరవై నిమిషాల రెస్ట్. తర్వాత మళ్లీ పని మీద కూచుంటే ఏడు ఏడున్నర ప్రాంతంలో ఆయన శ్రీమతి వచ్చి ఒక సారి కనిపించి పోతుంది. మళ్లీ పనే… మధ్యలో స్నేహితులు వచ్చినా పని చేసుకుంటూనే మాట్లాడుతారు. దూర ప్రాంతాలనుంచి ఎవరైనా వస్తే లేదా ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్కింగ్ టేబుల్ – అంటే కంప్యూటర్ పక్కనుంచి లేచి -ఆయన తన ముఖ్య గదిలో- అదే -మొదట ఆయన కోసం వెయిట్ చేశానే- ఆ గదిలోకి వెళతారు. మాట్లాడి మళ్లీ టక్కున ఇక్కడ వాలుతారు. ఇదే అంతిమం…లేదా ఇదే ప్రారంభం అన్నట్టు. మళ్లీ కొత్త ఉత్సాహంతో పని మొదలెడతారు.
ఇక అక్కడ, ఈ గదికి ఆనుకుని ఉన్న గదిలో – ప్రింటర్ల నుంచి బయటకు వచ్చిన పెద్ద పెద్ద ఫోటోలను టచింగ్ చేస్తూ ఆ ముసలాయన- అదే నన్ను రఘురాయ్ గదిలోకి పంపిన మనిషి- ఆయన ఇరవై ఏళ్లుగా రఘురాయ్ వద్ద అసిస్టెంట్గా ఉన్నారు – ఆయన పాత కాలం పని అంటే బ్రష్ ఇంకూ చేతబట్టుకుని చిన్న చిన్న మరకలను టచింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఆయన మణికట్టుపై బ్రష్ తాలూకు గీతలు చూస్తుంటే పాతకాలం నాటి ఫోటోగ్రఫి పనికి వారసుడిగా ఆయన మిగిలి ఒకలాంటి నాస్టాల్జియా కలుగుతుంది.
ఇక ఈ గదిలో ఆయనా, ఆయన యువ అసిస్టెంట్. అతడు కంప్యూటర్, ఫోటోషాప్, ఇతర ఆధునిక వ్యవహారాల్లో నిపుణుడైన ఇప్పటి కాలానికి ప్రతీకగా కనిపిస్తాడు. మధ్యలో రఘురాయ్ పాత కొత్తల మేలుకలయికను బ్యాలెన్స్ చేస్తూ నేరుగా కంప్యూటర్లో తల దూర్చకపోయినా అసిస్టెంట్ సహాయంతో పనిని సంధానించుకుంటూ కనిపిస్తారు. అక్కడ అతడ్ని చూస్తే తనకు పూర్తిగా కంప్యూటర్పై పట్టులేదన్న సంగతి తెలుస్తూనే ఉంటుంది.
ఇదీ అక్కడి వాతావరణం అని చెప్పి ముగించే ముందు రఘురాయ్, ఆయన అసిస్టెంట్లూ కాకుండా ఆ పధ్నాలుగు రోజులూ మూడో మనిషంటే నేనే. నేను కాకుండా అక్కడ మరొక అస్తిత్వం తప్పక ఉంటుంది. అదే సంగీతం.
అవును. కంప్యూటర్లోంచే ఆయనకిష్టమైన శాస్త్రీయ సంగీతం ఎప్పుడూ వినవస్తూ ఉంటుంది. దాన్ని వింటూ ఆ సంగీత తరంగాలకు ఆయన తలాడిస్తూ, అప్పుడప్పుడూ సంతోషంతో చప్పట్లు చరుస్తూ ఆయన చిన్న పిల్లవాడివలే ఆనందిస్తూ ఉండటం చూడాలే గానీ చెబితే లాభం లేదు!
మరో విశేషం ఏమిటంటే ఆ సంగీతానికి తోడు కంప్యూటర్ తెరపై ఆడే ఆయన చిత్రాలు. అవును మరి. ఆ చిత్రాల్లో ఒక లయాత్మకమైన సంగీతం ఉండనే ఉంటుంది. అది తనను క్రమేణా మత్తెక్కిస్తుంటుందేమో ఆన్నంత ఆనంద పారవశ్యంతో ఉంటారా యన. అప్పుడప్పుడు ఆ సంగీతాన్ని డామినేట్ చేసేలా తానూ పాటందుకుంటారు.

తన అసిస్టెంట్కి ఇదంతా బాగా అలవాటు కనుక ఆయన పారవశ్యానికి తోడన్నట్టు వరసగా “ఫలానా సబ్జెక్టపై ” అని రఘురాయ్ సూచించగానే వాటి తాలూకు ఫైల్స్ తీసి అందులోంచి ఒకటొకటిగా ఫోటోలన్నీ ఓపెన్ చేస్తుంటే… అవన్నీ తెరపై కనిపించడం మొదలవుతుంటుంటే, వాటిని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. మళ్లొకసారి వెనుక ఫోటో చూపమంటూ ఆనందంతో తన అసిస్టెంట్ భుజాలను బాలుడే అయి చరుస్తారు.
ఆయన సంతోషం ఎట్లుంటుందీ అంటే ఇందులో అంత ఆనందించేదేముందీ అన్న కుతూహలంతో మెల్లగా మనమూ ఆ సంతోషావరణంలోని కెరటాలకు లొంగి మెలమెల్లగా ఉల్లాసభరితమైన మోముతో నవ్వుతో ఆయన ఆనందంతో శృతి కలిపే స్థితికి వస్తాం. అది ఖాయం. అనుభవంతో చెబుతున్నాను గనుక నమ్మండి. లేకపోతే ఇదంతా ఒక ప్రేమ మయి పిచ్చి వ్యవహారం అనైనా క్షమించి వదిలేయండి.
అన్నట్టు, టక్కున ఆయన పక్కన ఎవరుంటే వాళ్లను… ఆఖరికి తన అసిస్టెంట్నైనా అడుగుతారు…”ఈ ఫోటో ఎట్లుందీ అని!”
కావచ్చు… అవన్నీ తాను తీసిన ఫోటోలే కావచ్చు. కానీ వాటిని మళ్లీ ఒక ప్రేక్షకుడిగా చూస్తూ, అందులోని జీవితాన్ని మళ్లీ మళ్లీ ఆస్వాదిస్తూ, ఆ రంగులను ఆ జీవనచ్ఛాయలను మరింత ఆకర్షణీయంగా తయారయ్యేందుకు కావల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ లేదా వాటి గాఢత మరింత పైకొచ్చేలా నలుపు తెలుపుల్లోకి మారుస్తూ ఉండటం… ఇట్లా తాను పని చేసుకుంటుంటే అది పని అన్నట్లే అనిపించదు. పూర్తిగా ఆనంద డోలికల్లో మునిగే ఒక సంగీతజ్ఞుడే మనకు దర్శనమిస్తాడు.
క్రమంగా ఆయన పట్ల కూడా మనకు ఆశ్చర్యం పోయి, ఆయన కంపోజ్ చేసిన పిక్చర్లో మనమూ లీనమై… మెల్లమెల్లగా ఆ గదిని’ అందులోని మనుషులను తనలోకి లాగేసుకుంటుండే సంగీతాలయంలో మనం జేగంటల్లా ఊగి ధ్వనిస్తుంటాం. ఇదే ఇలా ఆ రోజుల్లో నేను పొందిన మహత్తర అనుభవం తాలూకు విశేషాలని చెప్పక తప్పదు.
అయితే, మళ్లీ ఆయన ఆ సంగీతాలయంలోకి వెళ్లేలోపే – నేను తన ముఖ్య గదిలో- భోజనానంతరం కునుకు తీసిన రఘురాయ్తో ఆయన లేచాక మాట్లాడాలనుకున్నాను. అలా అనుకుని మరుసటి రోజు సిద్ధమయ్యాను. పెన్నూ కాగితాలూ ఏమీ లేవు. మామూలుగానే మొదలెట్టాను. అన్నట్టు, ఇక్కడా సంగీతం వినిపిస్తుంది. ఆయన నిద్రిస్తున్నప్పుడూ శాస్త్రీయ సంగీతం లీలగా వినపడవలసిందే.
చిన్నగా ఆయన టేబుల్పై వేళ్లతో కొడుతూ ఆనందిస్తుంటే, నేను నెమ్మదిగా కదిపాను. ,”సార్… ఈ పది రోజులూ వీలైనన్ని పుస్తకాలు చూశాను. చదివాను. నాకనిపిస్తోంది… బహుశా నాకు మీ మీద ‘సత్యం శివం సుందరం’ అన్న పుస్తకం రాయాలన్న తలంపేదో కలుగుతున్నది…” అన్నాను.
‘అవునా? అదేంటీ?” అన్నారాయన. “అవును. మానవ జీవన కాసారంలోని అతి సూక్ష్మమైన వ్యక్తీకరణలను… అత్యంత కఠోరమైన వాస్తవాలనూ మీరు చిత్రించారు. అదే సత్యం. మనిషిలోని మానవత్వానికి పెద్ద పీఠ వేసే అపూర్వ చిత్రాలనూ తీశారు. అది శివం. ఇక సామాన్య జనం – ఎన్ని కడగండ్లు కష్టాలెదురైనా కూడా గొప్ప సహనంతో ఈ జీవన సాగరాన్ని ఈదడాన్ని మీరు అత్యంత ఆత్మీయంగా ఆవిష్కరించారు. అదే సుందరం…” అన్నాను.

“సత్యం ఎట్లా?” అన్నారాయన.
“ఈ దేశంలోని అభాగ్యులను, నిస్సహాయులను, సామాన్యులను మీరు గొప్ప మానవతతో చిత్రించారు. వాళ్లను, వాళ్ల ప్రదేశాలను, మహోన్నత నాగరికత అంటే కట్టడాలు కాదు, వాటిని నిర్మించిన మనుషులే అన్నట్టు చిత్రించారు. అంతెందుకు? తాజ్ మహల్ కనిపిస్తుండగా సరయూ నది వద్ద తీసిన మీ ఫోటోలెన్ని లేవు. కాదంటే, భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో ఒక పసి పాప మోము…. ఆరిపోయిన ఆ నిశ్చలమైన ప్రాణం. అది ఈ దేశ వాస్తవికతను, ప్రభుత్వాల అమానుషత్వాన్నీ సూటిగా చెబుతుంది. జీవన వాస్తవికత అంటే అదే. అదే సత్యం…” అన్నాన్నేను.

“శివం అంటే?”
“చాలా ఉన్నాయి. మచ్చుకు మదర్ థెరీసా, దలైలామా పొట్రెయిట్స్” అన్నాను. “లక్షలాది జన సామాన్యాన్ని పేదవాళ్లుగా చూపకుండా వాళ్లను కష్టజీవులుగానే చూపిస్తారు. వాళ్లను సృజనశీలురుగానే చూపిస్తారు. ఈ జగత్తులో వాళ్లు కదులుతూ, కదిలిస్తున్నట్టే చూపిస్తారు. వాళ్లను ఓదార్చే హస్తాలనూ ఎంతో బాధ్యతాయుతంగా గొప్ప ధారుడ్యంతో చూపిస్తారు.”

“మరి సుందరం?”
“కోల్కొత్తాల ఒక శ్రమజీవి శక్తికొద్దీ బండిని తోస్తూ ఉన్న దృశ్యం. అవును. శ్రమశక్తికి మహోన్నత రూపం మీరు జన సామాన్యం నుంచే, కష్టజీవుల నుంచే తీసుకున్నారు. ఆ ఒక్క ఫోటో చాలు, ఈ దేశం ఎందుకింత అందంగా, ఆనందంగా ఉందో చూపడానికి. తమ రెక్కల కష్టం మీద ఈ దేశాన్ని బతికిస్తున్నదే అధికం. అందుకే ఆ చిత్రం సుందరం… అదే కదా అసలు సిసలు అందం” అన్నాన్నేను.
… నిజానికి ఇన్ని మాటలు కూడా మాట్లాడలేదు. కానీ ఆయనకు అర్థమైంది. ముందే తనకు చూపడానికి ఆయన పుస్తకాల్లోంచి మూడు ఫోటోలను ఎన్లార్జ్ చేసి జిరాక్స్ ప్రింట్స్ తీసుకున్నాను. అందులో ఒకటి భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి చిహ్నంగా మారిన చిత్రం. తర్వాత మొహాన్ని చేతులతో కప్పేసుకున్న మదర్ థెరిస్సా చిత్రం. మూడోది ఒక మహిళ తోస్తున్న బండి దృశ్యం.
ఇవి మూడూ చూపించి…”నేను గనుక పుస్తకం రాస్తే బహుశా ఈ మూడు దృక్కోణాలతో కూడిన పుస్తకం- ఇట్లా ఈ మూడు చిత్రాలతో – సత్యం శివం సుందరం అన్న మూడు ముక్కలతో మీ జీవిత కాలం కృషిని సంక్షిప్తంగా చెబుతాను. అయితే, ఆ పుస్తకం రాస్తానో రాయనో తెలియదు. రాస్తే ఇలాగే రాస్తానో కూడా తెలియదు. కానీ ఇప్పటికైతే ఇదే సత్యం శివం సుందరం” అన్నాన్నేను.
ఆయన ప్రసన్నంగా నవ్వారు. అది అంగీకారమో కాదో కూడా నాకు తెలియదు.
( అముద్రితం – ‘సత్యం శివం సుందరం’లోని నాలుగవ అధ్యాయం)
Share this Article