Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై కాక్రోచ్ మీడియా తప్పుడు వాదనలు ఇలా..!!

June 7, 2026 by M S R

.

Jagannadh Goud …. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో 15 లక్షల కోట్ల స్కామ్ నిజమా? లేక ప్రచారమే ఎక్కువా? రాజేష్ మెహతాపై ఆరోపణల్లో నిజమెంత? నాకు తెలిసినంతవరకు అక్కడ స్కాం లేదు, బొచ్చు లేదు.

ప్రస్తుతం ఇది SEBI ఆరోపణలు vs రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వివరణ అనే దశలో ఉంది. మూడు రోజుల క్రితం జూన్ 3వ తేదీన సెబీ వాళ్లు “భారీ స్థాయిలో ఆదాయం తప్పుగా చూపబడింది” అన్నారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ వాళ్లు “అది అపార్థం మాత్రమే; మా ఆర్థిక నివేదికలు సరైనవే” అన్నారు. చివరి నిజానిజాలు కోర్టులు, సెబీ తుది విచారణలు, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలు పూర్తయిన తర్వాతే స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఆ అంశాల జోలికి నేను వెళ్లటం లేదు.

Ads

మీడియా, సోషల్ మీడియా, టీవీ డిబేట్లు మొదలైన వాటిలో ప్రచారంలో ఉన్న విషయాలను గమనించి అసలు విషయం ఏమిటో చూద్దాం.

“గత ఐదేళ్లలో 2021 నుంచి 2026 వరకు 15 లక్షల కోట్ల ఆదాయం చూపించడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు, షేర్ ధర బాగా పెరిగింది, ఇంకా LIC లాంటి కంపెనీ 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. జూన్ 3వ తేదీన ఈ 15 లక్షల కోట్ల స్కాం జరిగింది అనే విషయం బయటికి తెలియడం వల్ల జూన్ 3, 2026 నుంచి ఇప్పటివరకు షేర్ ధర ఆసాంతం 90% పడిపోయింది” అనేది మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా తదితర మిగతా మీడియా కాక్రోచ్‌ల వాదన.

కాక్రోచ్ మీడియా ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆరు వాదనలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.



1. గత ఐదేళ్ల నుంచి ఎక్కువ ఆదాయం చూపించడం వల్ల షేర్ ధర పెరుగుతూ వచ్చింది అనేది మీడియా కాక్రోచ్‌ల మొదటి వాదన. 2021లో షేర్ ధర 600 రూపాయలు ఉంటే, 2022లో 500 రూపాయలు, 2023లో 400 రూపాయలు, 2024లో 300 రూపాయలు, 2025లో 200 రూపాయలు, 2026లో 100 రూపాయలు.
నిజానికి ప్రతి సంవత్సరం ఒక 100 రూపాయలు తగ్గుతూ వచ్చింది. ఆదాయం ఎక్కువ ఎక్కువ చూపించుకుంటూ పోతే షేర్ ధర పెరగాలి, కానీ తగ్గుతూ వచ్చింది. అందుకే మీడియా కాక్రోచ్ మాటలు పచ్చి అబద్ధం.



2. ఈ విషయం బయటికి పొక్కగానే షేర్ ధర 90% తగ్గింది అనేది మీడియా కాక్రోచ్‌ల రెండో వాదన. జూన్ 3వ తేదీ 2026లో ఈ విషయాన్ని సెబీ వాళ్లు వెలుగులోకి తేగానే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ ధర ఆ తర్వాత 90% పడిపోయింది అంటున్నారు. మార్చి 30, 2026 న 80 రూపాయలు ఉన్న షేర్ ధర ఈ రోజు 98 రూపాయలు ఉంది అంటే, అంతకుముందు షేర్ ధరతో చూస్తే పెరిగినట్లా, తగ్గినట్లా? గత రెండు నెలల్లో 22.5% పెరిగింది. ఒకవేళ జూన్ 4వ తేదీన ఉన్న 103 రూపాయల షేర్ ధరతో పోల్చితే ఈ రోజు ఉన్న షేర్ ధర 98 కాబట్టి 4.85% తగ్గింది. మన స్టాక్ మార్కెట్‌లో ఒక స్టాక్ 4% పెరగటం, తగ్గటం సర్వసాధారణ అంశం.



3. మనం కట్టిన LIC డబ్బు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, రాజేష్ మెహతా దోచుకున్నాడు అని వితండ వాదన. LIC వాళ్లు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో పెట్టింది 2 వేల కోట్లు అన్నది నిజం అయితే LIC కి 3 వేల కోట్లు నష్టం అని కొన్ని మీడియా కాక్రోచ్‌ల మూడో వాదన.

ఎంత పెట్టారు అన్నది పక్కన పెడితే, మార్చి 30న రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ ధర 80 రూపాయలు. ఈ రోజు షేర్ ధర 98 రూపాయలు. ఒకవేళ ఈ రోజు విత్‌డ్రా చేసుకుంటే LIC కి లాభం వచ్చినట్లా, నష్టం వచ్చినట్లా? వస్తే ఎంత వచ్చినట్లు? 2 వేల కోట్ల పెట్టుబడి నిజం అయితే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 22.5% చొప్పున పెరిగింది అంటే లెక్క ప్రకారం నష్టం కాదు, లాభం వచ్చినట్లే కదా?



4. LIC కి నష్టం వస్తుంది అని కాక్రోచ్ మీడియా నాలుగో వాదన.
అసలు LIC లాభాల్లో నడుస్తున్న సంస్థ. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికంలోనే సుమారు ₹24,500 కోట్ల లాభం నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 23% ఎక్కువ. అత్యధిక లాభాలు నమోదు చేసిన నేపథ్యంలో ఒక్కో షేర్‌కు ₹10 డివిడెండ్ కూడా ప్రకటించింది. కాబట్టి, దయచేసి LIC గురించి పూర్తిగా నిరాధారమైన ప్రచారం చేయడం ఆపండి. ఇది కోట్లాది పాలసీదారులు, ప్రజల నమ్మకంతో ముడిపడి ఉన్న అంశం.



5. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో విదేశీ పెట్టుబడిదారులు వాటా తగ్గించారు కానీ LIC తగ్గించలేదు అని కాక్రోచ్ మీడియా ఐదో వాదన.
ఇది అత్యంత బలహీనమైన వాదనల్లో ఒకటి. సెప్టెంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు లేదా ఆ తర్వాతి కాలంలో విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) తమ వాటాను కొంత మేర తగ్గించడం నిజమే. అయితే అది కేవలం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కే పరిమితమైన విషయం కాదు. దేశంలోని అనేక పెద్ద కంపెనీల్లో, టాప్ 100 కంపెనీల్లో కూడా FIIలు తమ వాటాలను తగ్గించారు. కొన్ని కంపెనీల్లో అయితే పూర్తిగా నిష్క్రమించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో కూడా విదేశీ పెట్టుబడిదారుల వాటా సుమారు 17% నుంచి 14%కి మాత్రమే తగ్గింది. అంటే కేవలం 3% తగ్గుదల. దీనిని అసాధారణ పరిణామంగా చూపించడం సరైంది కాదు.రూపాయి బలహీనపడటం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, విదేశీ నిధుల ప్రవాహాలు వంటి అనేక కారణాల వల్ల FIIలు తమ పెట్టుబడులను సర్దుబాటు చేస్తుంటారు. అదే విధానాన్ని దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) కూడా అక్షరాలా అనుసరించాల్సిన అవసరం లేదు. విదేశీ పెట్టుబడిదారులు అమ్ముతున్నారు కాబట్టి దేశీయ సంస్థలు కూడా అమ్మేస్తే మార్కెట్ స్థిరత్వమే దెబ్బతింటుంది.

అయినా, వేల కోట్ల లాభాల్లో నడుస్తున్న LIC వంటి సంస్థకు ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలియదా? బంగారం వినియోగం, శుద్ధి, ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సంస్థలో పెట్టుబడి పెట్టడం వెనుక కూడా వారి వ్యాపారపరమైన అంచనాలే ఉంటాయి. అందుకే LIC పెట్టుబడి పెట్టింది, ఇప్పటికీ కొనసాగిస్తోంది. విమర్శలు చేయాలంటే వాస్తవాల ఆధారంగా చేయాలి గానీ, ఊహాగానాల ఆధారంగా కాదు.



6. ఈ ఐదు ఏళ్లలో ఇండియాలో 15 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది అంటే దానికి ట్యాక్స్ కట్టాలి కదా. ప్రతి సంవత్సరం GST, ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి కదా. అసలు సంవత్సరం సంవత్సరం షేర్ ధర తగ్గుతూ వచ్చింది కానీ పెరగలేదు. నిజంగా ఆ విధంగా చూపించి ఉంటే షేర్ ధర పెరుగుతూ రావాలి. అందుకే 1992 హర్షద్ మెహతా స్కాం వేరు, 2009లో సత్యం రామలింగరాజు స్కాం వేరు. వాటితో దీన్ని పోల్చి ఇక్కడ 15 లక్షల కోట్లు దోచుకున్నాడు లేదా 15 లక్షల కోట్ల స్కాం జరిగింది అని మాట్లాడటం తప్పు.

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కార్యకలాపాలు కేవలం భారతదేశంలోని బెంగళూరుకే పరిమితం కావు. ఈ సంస్థకు సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఉనికి ఉంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్ ప్రపంచ బంగారం శుద్ధి, నిల్వలు మరియు వాణిజ్యానికి కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది.

భారతదేశం వద్ద సుమారు 876 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, స్విట్జర్లాండ్ వద్ద దాదాపు 1,040 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం అమెరికా, దాని వద్ద 8,000 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి.

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే, సంవత్సరానికి సుమారు 2,000 టన్నుల బంగారాన్ని శుద్ధి (Refining) చేసే సామర్థ్యం కలిగి ఉండటం. ఇది ప్రపంచ స్థాయిలోనే అత్యంత పెద్ద శుద్ధి సామర్థ్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

కనీసం షేర్ ధర 5 ఏళ్లలో పెరుగుతూ వచ్చింది అని చెప్తే కనీసం వెరిఫై చేయాల్సిన బాధ్యత లేదా? ఒక్క సెకండ్‌లో తెలిసిపోతుంది కదా. లోకల్ మీడియా, స్టేట్ మీడియా అనే కాదు, నేషనల్ మీడియా వాళ్లు కూడా కాక్రోచ్‌లలా ప్రవర్తించారు ఈ విషయంలో.

BSE ఫైలింగ్‌లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వాళ్లు క్లియర్‌గా చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్, కొంత గందరగోళం వల్ల సెబీ వాళ్లు పొరపడి ఉండొచ్చు, ఆ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చి మేము దర్యాప్తుకు పూర్తి సహకరిస్తాం అని చెప్పింది. ఆర్థిక పరమైన అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే మన రెగ్యులేటరీ సంస్థలు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటాయి. కానీ ఈ విషయంలో మీడియా, సోషల్ మీడియా ప్రచారంలో ఉన్న నెగటివ్ వార్తలన్నీ తప్పు.



ఒక చిన్న గ్యారేజ్ నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యాపార సామ్రాజ్యంగా ఎదగడం వెనుక దశాబ్దాల శ్రమ, వ్యాపార దూరదృష్టి, ప్రపంచ మార్కెట్లపై అవగాహన మరియు నిరంతర విస్తరణ ఉన్నాయి. అందుకే ఇలాంటి సంస్థల గురించి మాట్లాడేటప్పుడు కేవలం ఒక సంఘటన లేదా ఒక ఆరోపణ ఆధారంగా కాకుండా, వాటి మొత్తం ప్రయాణం, సాధించిన విజయాలు మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన సేవలను కూడా గుర్తు పెట్టుకోవాలి.

ఈ మధ్య మన ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుంచి 6వ స్థానానికి దిగజారింది. ఇంకా ప్రపంచం అంతా బంగారం గురించి మాట్లాడుకుంటున్న రోజులు. దీనికి తోడు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల మనం పెట్రోల్, డీజల్ దిగుమతుల కారణంగా డాలర్‌తో పోల్చితే రూపాయి పతనమైంది.

బంగారం నిల్వలు దేశాల ఆర్థిక బలాన్ని, స్థితిగతులను నిర్దేశించే రోజుల్లో, మన దేశం నుంచి ప్రధాన బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే కంపెనీపై ఆరోపణలు వస్తే, వాటి నిజానిజాలు తేలకముందే ముందు వెనకా చూసుకోకుండా కాక్రోచ్ బుద్ధి చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్? మన కళ్లను మనమే పొడుచుకుంటున్నాం అన్న సృహ, సోయి ఏమైనా ఉందా?

మన రాష్ట్రంలో అయినా, మన దేశంలో అయినా ప్రభుత్వాలు మారినప్పుడు టాప్ 10లో ఉన్న పారిశ్రామికవేత్తల స్థానాలు మారవు. మరి ఎందుకు అంబానీ మీద, అదానీ మీద ఏడుపులు, ఇంకా టాటాల మీద, బిర్లాల మీద వెక్కిరింపులు?

హెల్థ్ మీద ఎలా పడితే వాడు, ఏ విధంగా పడితే ఆ విధంగా విశ్లేషణలు, సలహాలు… రాజకీయాల మీద అంతే. కనీసం ఫైనాన్షియల్ విషయాల మీదయినా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఆపండ్రా అయ్యా.
ఒక కంపెనీ తప్పు చేసిందా లేదా అనేది కోర్టులు, SEBI, రెగ్యులేటరీ సంస్థలు తేల్చాలి. టీవీ డిబేట్లు, యూట్యూబ్ థంబ్‌నెయిల్లు, సోషల్ మీడియా పోస్టులు కాదు.

ఆరోపణలు వచ్చాయని వెంటనే చప్పట్లు కొట్టకండి. సమర్థనలు వచ్చాయని వెంటనే జెండాలు మోయకండి. నిజం ఏదైనా ఉంటే దర్యాప్తులో బయటపడుతుంది. కానీ ఆరోపణలను నిజాలుగా, ప్రచారాన్ని తీర్పుగా, అనుమానాలను ఆధారాలుగా మార్చడం మాత్రం ప్రజాస్వామ్యానికి, పెట్టుబడి వ్యవస్థకు మంచిది కాదు.
నిజాలు తెలుసుకోవడం కంటే సంచలనాలు సృష్టించడం సులభం. కానీ సంచలనాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లవు.
– పూర్తి వ్యక్తిగత అభిప్రాయం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … అలా నెమ్మ‌దిగా ఇళ‌య‌రాజా అనేవాడి మీద కాస్త ఇంట్ర‌స్టు మొద‌లైంది’
  • నిర్మాతలు, హీరోలు దర్శకుల్ని పేద్ద కాక్రోచ్‌లను చేస్తే… ‘పెద్ది’లు పుడతారు…
  • రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై కాక్రోచ్ మీడియా తప్పుడు వాదనలు ఇలా..!!
  • అసలు తప్పు జాన్వీదే..! ఇదే ధోరణి ఉంటే కెరీర్‌ ప్రశ్నార్థకమే..!!
  • ఏ మొహమాటాల్లేవ్… కొత్త T20 జట్టు ఎంపికపై డిఫరెంట్ రివ్యూ…
  • వాళ్లు బాల్యాన్ని అనుభవించనివ్వండర్రా… రొంపిలోకి అప్పుడే ఎందుకు..?!
  • ‘ పెద్ది సినిమా చూడకపోతే చంపుతా ఒక్కొక్కడినీ’… ఓ మానసిక వైకల్యం..!!
  • I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…
  • మా వాణిశ్రీని చంపేస్తాడా..? అందుకే ఈ దర్శకుడి మీద నాకెప్పుడూ కోపమే..!
  • డెస్టినీ..! ఆ ఒక్కడూ మిగిలిపోయాడు… ఐనవారందరూ ‘బుగ్గి’..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions