.
Gurram Seetaramulu …. తొలి సామాజిక తిరుగుబాటు దారులు. ప్రజా పోరాటాలకు పునాది రాళ్ళు
“ఆ రోజు మారు వేషంలో ఉన్న సర్వాయి పాపన్న ఒక కల్లు కొట్టు దగ్గర ఆగాడు. అతని భాష, ఉచ్చారణ, హావభావాలు, మాట తీరును గ్రహించిన ఆ గౌడ్ ఇప్పుడే వస్తా, ఇక్కడే కూర్చో, నీకోసం మంచి కల్లు తెస్తా అని చెప్పి మాయం అయ్యాడు
కొంత సమయం తర్వాత, అతను స్థానిక డిప్యూటీ ఫౌజ్దార్, 300 మంది సైనికులతో తిరిగి వచ్చాడు. అలా వచ్చిన అధికారి మరెవరో కాదు, స్వయానా ఆ గౌడ్ బావమరిది అంటే తన భార్య సోదరుడు.., అలా పాపన్నను అదుపులోకి తీసుకున్న నాటి అధికారి గవర్నర్ యూసఫ్ ఖాన్ ముందు తీసుకువచ్చారు,
Ads
వాళ్ళ లక్ష్యం పాపన్నను అంతమొందించడం మాత్రమే కాదు, అతను సేకరించిన సంపద కొల్లగొట్టడం… ఆ క్రమంలో పాపడు సేకరించిన సంపద గురించి అనేక రోజులపాటు ప్రశ్నించారు . బంధించిన పాపన్నను ఆధునిక పద్ధతిలో అత్యంత క్రూరంగా రోజుల తరబడి హింసించారు.
వాళ్ళ లక్ష్యం పదేళ్లుగా పాపన్న సేకరించిన సంపద ఆనవాళ్ల కోసం, అతని సహచరుల జాడ కోసం.,.. ఎంత కొట్టినా పాపడు సమాధానం చెప్పలేదు. ఇక లాభం లేదనుకుని అతన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. పాపన్న తలను డిల్లీ పాలకుడు బహదూర్ షా కు కానుకగా పంపారు…
క్రూరంగా నరకబడిన అతని శరీర భాగాలను హైదరాబాద్ గేట్ల వద్ద హెచ్చరికగా వేలాడదీశారు. ఏళ్ల పాటు ఆ ఎముకలు దక్కనీ సమాజాన్ని వెంటాడాయి. ఇలా తలలు వేలాడ దీయడం మొదలు కాదు, రాయలసీమ సైరా నరసింహ రెడ్డి, ఉత్తర తెలంగాణా చర్ల రాజు మేధినీ రాయుడు, ఉత్తర భారతాన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, దక్షిణ తెలంగాణ భూమయ్య, కిష్టా గౌడ్ లాంటి వీరులు ఎందరో.

డిల్లీ సుల్తాన్ ల మొదలు బ్రిటిష్ ల దాకా నేటి అమిత షా వరకు రాజరికంవైపు కన్నెత్తి చూసిన ఎవరికైనా ఇదే గతి పట్టుద్ది అనే హెచ్చరిక చేశారు. ప్రశ్న ఆగిందా ? అదే బహుదూర్ షా కుటుంబాన్ని వెయ్యేళ్లకు పైగా పాలన చేసిన వాళ్ళను కూడా కాల్చి చంపారు. ఆ రక్తం డిల్లీ వీధుల్లో కాలువలుగా పారింది అనేది దాచేస్తే దాగని సత్యం.
బహుదూర్ షా నుంచి అమిత్ షా దాకా భిన్నాభిప్రాయాలను రక్తపు యేరులోనే ముంచారు. పైన పేర్కొన్న కథనం The social History’ of Deccan (1300-1761) Richard M Eaton అనే అమెరికన్ పండితుడు ఇరవయ్యేళ్ల కింద డెక్కన్ హిస్టరీ మీద సాధికారమైన రచన చేశాడు.
ఇకపోతే పాపన్న గౌడ్ ను పట్టించింది తన కులపొడే అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. జీసస్ ను పట్టించిన యూదా ఇస్కారియేత్ నుంచి, పాపన్న, బసవరాజ్ దాకా తాము నమ్మిన మనుషులే నట్టేట్ల్లో ముంచిన విషాద కాలాన , నిన్న తెలంగాణ సచివాలయం ముందు సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ జరుగింది.
విగ్రహాలలో ఆనాటి పౌరుషాన్ని స్ఫూర్తిని నింపే ఆనవాళ్లుగా చూద్దాం అంటున్న ప్రభుత్వం చేయాల్సింది వేరేఉంది. అదేంటి అంటే సర్వాయి పాపన్న, కొమురం భీం, పండగ సాయన్న, మియ్యా సాబ్, బల్మూర్ బాలమ్మల స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఈ తరానికి అందివ్వాలి. వారి చరిత్ర ఈ కాలానికి అవసరం . (నేను బల్మూర్ బాలమ్మ మీద కొంత పరిశోధన చేశా. నా పదేళ్ల అన్వేషణ అది. త్వరలో ఆమె గురించి మంచి వార్త వింటారు).
- నిజానికి వీళ్ళు తొలి సామాజిక తిరుగుబాటు దారులు. ప్రజా పోరాటాలకు పునాది వేసిన వాళ్ళు. పదేళ్ల వెలమ దొర పాలనాకాలంలో చరిత్ర అంటే చింతమడక, ఎర్రవెల్లి, కాళేశ్వరం అని… అవి మాత్రమే తనను జాతి పితని చేస్తాయి అని నమ్మాడు …
పాపన్న మొదలు బాలమ్మ , గద్దర్ దాకా ప్రజల ఆలోచనలో ఐతిహ్యం అయిన విస్మృత చరిత్రను కేవలం విగ్రహాలకే పరిమితం చెయ్యకుండా వాళ్ళ కోసం ప్రత్యామ్నాయ విజ్ఞాన కేంద్రాలు ఇకనైనా నిర్మించాలి అని తెలంగాణ మేథో సమాజం డిమాండ్ చెయ్యాలి. అందెశ్రీ స్మృతివనం మొదలయ్యింది, గద్దర్ విజ్ఞాన కేంద్రానికి ఇంకా భూమి ఇవ్వలేదు.
ఎక్కడో తాటి ముంజలు అమ్ముకునే గౌడ బిడ్డ తెగిన శిరస్సు డిల్లీ పీఠం దాకా నడిచింది. పదేళ్ళు నాటి పాలకులకు కంట నిద్ర కరువు చేసింది. ఆ ఉరితీయ బిడ్డ ఖండిత శిరస్సు చెప్పిన రహస్యాన్ని ఇకనైనా వింటారని పాపన్న పోయిన 315 ఏళ్ల తర్వాతనైనా అడగాలి అనిపిస్తోంది.
చరిత్ర నిర్మాణం అంటే ఫుట్ పాత్ మీద చిద్రమైన పుస్తకాలకు అట్టలు మార్చి రీ ప్రింట్ వేసుకోవడం కాదు. ప్రజల నోట్లో సజీవంగా బ్రతికిన అక్షరాలకు వెలుగు రెక్కలు తొడగడం. ఆ పని తెలంగాణలో ఒక్క ప్రొ. బిరుదు రాజు రామరాజు, ప్రొ. జయధీర్ తిరుమల రావు మాత్రమే చేశారు. మిగతాది అంతా డొల్ల.
విస్మరణకు గురైన తొలి సామాజిక తిరుగుబాటు దారుల స్మరణలో… నిన్న పాపన్న జయంతి…
Share this Article