Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే ఈవీవీ కదా… అప్పట్లోనే జబర్దస్త్ మార్క్ మూవీ తీసి వదిలాడు…

April 29, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … 1992 సెప్టెంబరులో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా పేరుకే కామెడీ కానీ  సందేశాత్మక సినిమా . స్వయంకృషిని నమ్ముకోకుండా , కష్టపడి పని చేయటం మానేసి రాశిఫలాలు , జాతకచక్రాలు , దొంగ జ్యోతిష్కుల మాటలు నమ్మే ఉంగరాల రాయుళ్ళకు గొప్ప సందేశం . మనిషి వైఫల్యాలలో ఉన్నప్పుడు తన మీద తనకు నమ్మకం పోయి ఏదో అదృశ్య శక్తి మీద ఆధారపడతాడు . ఈ దుర్బల అలోచన మనందరిలో ఉంటుంది . నాకూ ఉంది . అయితే మనం కష్టపడకుండా ఏదీ రాదు . గాలిలో దీపం పెట్టి దానిని వెలగనివ్వు దేవుడా అంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు . కనీసం మనం చేతులు అడ్డం పెట్టాలిగా .

అలాంటి సందేశాన్ని అందించే సినిమా ఇది . కష్టే ఫలే అనే సిధ్ధాంతాన్ని నమ్మి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడు అయిన రొయ్యల నాయుడు పాత్రలో రావు గోపాలరావు అద్భుతంగా నటించారు . ఎన్నో డిగ్రీలను పేరు చివర పెట్టుకుని after one year కాబోయే కింగునని ఓ పూంపుహార్ మాటను నమ్మి వచ్చిన ప్రతీ అవకాశాన్ని జారవిడుచుకునే అటుకుల చిట్టిబాబు పాత్రలో రాజేంద్రప్రసాద్ రావు గోపాలరావుతో ధీటుగా నటించారు .

Ads

ఈ రెండు పాత్రల తర్వాత ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర కనపడ్డ ప్రతి వారితో ఫ్లాగ్ (జండా) ఎత్తేస్తాననే హీరో చెల్లెలి పాత్రలో శ్రీలత . బాగా నటించింది . వాస్తవానికి తమిళ సినిమా Paaru Paaru Pattanam Paaru కు రీమేకే అయినా దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ విశాఖ అందాలను చక్కగా ఉపయోగించుకున్నారు . తమిళంలో మోహన్ , రంజని , వెన్నిరాడై మూర్తి లీడ్ రోల్సులో నటించారు .

ఈ సినిమా విజయానికి విశాఖ అందాలు కూడా కారణమే . పాలకుల ప్రోత్సాహం లేని ఆ రోజుల్లోనే ఎన్నో విజయవంతమైన తెలుగు సినిమాలకు కేరాఫ్ విశాఖపట్టణం . ఇప్పుడు పోటాపోటీగా జరుగుతున్న అభివృద్ధి విశాఖ సహజ అందాలను , ప్రశాంత సంస్కృతిని ఖరాబు చేయకుండా ఉండుగాక .

కధ టూకీగా ఏంటంటే రొయ్యల నాయుడు కూతురు రంభ రాజేంద్రప్రసాదుని గాఢంగా ప్రేమిస్తుంది . తండ్రి ఎంత గోల పెట్టినా అతన్నే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టు పడుతుంది . చేసేది లేక పెళ్లి జరిపిస్తాడు . కానీ , శోభనం జరపడు . కష్టపడి లక్ష సంపాదించి తెస్తేనే శోభనం అంటాడు నాయుడు మామ .

అడ్డదారుల్లో సంపాదించటానికి ప్రయత్నిస్తున్న అల్లుడిని రెచ్చగొట్టి కార్యోన్ముఖుడిని చేస్తాడు . పట్టుదలతో దివాలా అంచున ఉన్న ఓ గార్మెంట్స్ ఫేక్టరీని టేకప్ చేసి లాభాల బాటలోకి తెస్తాడు . అలా సంపాదించిన లక్ష తీసుకొచ్చి మామ మొహాన కొట్టి శోభనం చేసేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .

సినిమాను ఉరికించటంలో చాలామంది పాత్ర ఉంది . ఒకరు యల్ బి శ్రీరాం . మామాఅల్లుళ్ళ మధ్య , అన్నాచెల్లెళ్ళ మధ్య విరుపులు , సవాళ్లు , వగైరా డైలాగులు అద్భుతంగా వ్రాసారు యల్ బి శ్రీరాం . బ్రహ్మాండంగా పేల్చారు రావు గోపాలరావు , రాజేంద్రప్రసాద్ , శ్రీలత .

తర్వాత ఇళయరాజా సంగీతం , వేటూరి భువనచంద్ర పాటలు , బాలసుబ్రమణ్యం జానకమ్మల గాత్రం . పాటలన్నీ చాలా బాగుంటాయి . భువనచంద్ర వ్రాసిన రాజాధిరాజాను నేను ఇక వైజాగు వైభోగం చూడరా పాట బాగుంటుంది . అంకులో దిగిరావేమయ్యా శోభనము జరా కానివ్వయ్యా పాట హడావుడి బాగుంటుంది .
వారెవా మానవా ఎదలే అదిరే , అమ్మమ్మో రాతిరి వచ్చిందిరోయ్ డ్యూయెట్ల చిత్రీకరణ కుర్రాళ్ళకు బాగా నచ్చుతుంది . పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా విషాద గీతం కూడా రంభ , రాజేంద్రప్రసాదుల మీద బాగుంటుంది .

సినిమాలో కళ్ళు చిదంబరాన్ని మోసం చేసి రాజేంద్రప్రసాద్ మేకను అమ్మే సీన్ ప్రేక్షకులు మరచిపోలేరు . అలాగే ఈమధ్య కాలంలో బొక్కల పేంట్లు , బొక్కల చొక్కాలు వీర పాపులరయ్యాయి . 1992 లో వచ్చిన ఈ సినిమాలో బొక్కలు పెట్టల్లా అమ్ముతాడు హీరో . అలాగే స్లీవ్ లెస్ చొక్కాలు , కిళ్ళీ తుప్పర్లతో చొక్కాలు , వగైరా నావెల్ గా ఉంటాయి . ఇలా ఎన్నో సీనులు.

ఇంక రంభ . విజయవాడలో పుట్టి వన్ టౌన్ Atkinson స్కూల్లో చదువుకున్న రంభకు తెలుగులో మొట్టమొదటి సినిమా ఇది . ఇతర ప్రధాన పాత్రల్లో నిర్మలమ్మ , బాబూమోహన్ ,రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ పాత్రలో అల్లు రామలింగయ్య , ఆయన భార్యగా రాధాకుమారి , నాయుడు గారి పి.ఏ గా బ్రహ్మానందం , సాక్షి రంగారావు , పొట్టి ప్రసాద్ , హరిబాబు , అనూజ  తదితరులు నటించారు .

తమిళం , తెలుగులో విజయవంతమైన ఈ సినిమా 1995 లో కన్నడంలోకి కూడా రీమేక్ అయింది . 1997 లో హిందీలోకి Mr&Mrs ఖిలాడీ అనే టైటిలుతో రీమేక్ అయింది . అక్షయకుమార్ , జూహీ చావ్లా నటించారు . మన తెలుగు సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసినా మళ్ళా మళ్ళా కూడా చూడతగ్గ సినిమాయే . కాస్త అక్కడక్కడ అశ్లీలం డోస్ ఎక్కువగా అనిపిస్తుంది , వినిపిస్తుంది , కనిపిస్తుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఈవీవీ కదా… అప్పట్లోనే జబర్దస్త్ మార్క్ మూవీ తీసి వదిలాడు…
  • నేతి బీరకాయలో నేయి… తమిళనాట తెలుగువారి ఆధిపత్యం…
  • సోయి లేని సాయిపల్లవి… స్వయంకృతం, అతి తెలివి… ఎందుకంటే..?
  • ‘హాట్ స్టార్’ ఐతేనేం..? మనస్సుండదా..? ఆ కళ్లల్లో నీళ్లుండవా..?
  • ఎవడు ఈ సలీం డోలా..? డ్రగ్స్ దందాకే కాదు, ఉగ్రనిధులకూ దెబ్బ..!!
  • సర్పంచ్ సాబ్‌కు తొలి దెబ్బ… ఛోటా భీమ్ నేల మీదకు దించేశాడు…
  • దుబయ్ సొంత పెట్రో గేమ్… ఒపెక్ జట్టు నుంచి బయటికి… ప్రభావం..?
  • ఆషురెడ్డి రివర్స్ కట్నం కేసులో తెరపైకి వేణుస్వామి పేరు..!
  • ఈ వ్యవస్థలో వాళ్లకు ఏ హక్కులూ సాయాలూ అక్కర్లేదా..? అవి అస్థిపంజరాలా..?!
  • సోనియా నారంగ్… సోషల్ ప్రచారంలో నిజాలెన్ని..? అతిశయోక్తులెన్ని..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions