Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ బెంచీ..! ఎన్ని జ్ఞాపకాల నెమరివేత..? ఎన్ని కన్నీళ్లు ఇంకిన వేదిక..!!

June 12, 2026 by M S R

.

Raghu Mandaati …. బెంచీ…
ప్రభుత్వ ఆసుపత్రి క్యాన్సర్ వార్డు బయట ఒక పాత ఇనుప బెంచీ ఉంటుంది.
ఎన్ని ఏళ్ల నుంచో అక్కడే ఉంటుంది.
దానికి రంగు ఎప్పుడు వేసారో ఎవరికీ గుర్తుండదు.
వర్షాలు దాన్ని తడిపాయి…
ఎండలు దాన్ని ఎండబెట్టాయి…
కానీ మనుషుల బాధలు దాన్ని ఇంకా ఎక్కువగా తుప్పు పట్టించాయి.

ఉదయం ఐదు గంటలకే ఆ ప్రాంగణం మెల్లగా కళ్లు తెరుస్తుంది.
ఎక్కడో దూరంగా టీ అమ్మే వాడి గళం వినిపిస్తుంది.
“టీ… టీ…”
వార్డు కిటికీల్లోంచి మందుల వాసన వస్తుంది.
రాత్రంతా నిద్రపోని బంధువులు ముఖాలు కడుక్కుంటారు.
కొంతమంది దేవుడి ఫోటో ముందు చేతులు జోడిస్తారు.
మరికొందరు డాక్టర్ రౌండ్స్ కోసం ఎదురుచూస్తారు.

Ads

ఆ బెంచీ మీద మాత్రం ఒక తాత కూర్చుని ఉంటాడు.
నిన్న కూర్చున్నాడు.
మొన్న కూర్చున్నాడు.
నెల రోజులుగా కూర్చుంటూనే ఉన్నాడు.
లోపల ఆయన భార్య ఉంది.
యాభై ఏళ్ల వైవాహిక జీవితానికి సాక్ష్యమైన మనిషి.
తన జీవితంలో ఎప్పుడూ తనను ఒంటరిగా వదిలిపెట్టని మనిషి.
ఇప్పుడు మాత్రం ఒక గోడకు అవతల ఉంది.
ఒక తలుపుకు దూరంలో ఉంది.
అంత దగ్గరగా…
అంత దూరంగా…

అప్పుడప్పుడు నర్స్ బయటకు వస్తుంది.
తాత ఒక్కసారిగా లేచి నిలబడతాడు.
ఎదురుచూపుల్లో వయసు ఉండదు.
ఎనభై ఏళ్ల వాడైనా…
ఎనిమిదేళ్ల పిల్లాడైనా…
ఎదురు చూసేటప్పుడు ఒకేలా కనిపిస్తారు.

“అమ్మా… మా ఆవిడ ఎలా ఉంది?”
నర్స్ చిన్నగా నవ్వుతుంది.
“బాగానే ఉంది తాతయ్య.”
“నిజంగానేనా?”
“అవును.”
“రాత్రి దగ్గు తగ్గిందా?”
“తగ్గింది.”
“నన్ను అడిగిందా?”
ఆ ప్రశ్న విన్న ప్రతిసారీ నర్స్ కళ్లల్లో నీళ్లు మెరుస్తాయి.
“అడిగింది తాతయ్య…”
అంతే.

ఆయన ముఖంలో చిన్న వెలుగు.
ఎన్నో కోట్ల ఆస్తుల కంటే విలువైన వెలుగు.
ఒక రోజు పక్క బెంచీ మీద కూర్చున్న వ్యక్తి అడిగాడు.
“తాతయ్య… మీ పెళ్లై ఎన్ని సంవత్సరాలు?”
తాత నవ్వాడు.
“యాభై మూడు.”
“అంతకాలం గొడవలు లేకుండా ఉన్నారా?”

తాత మెల్లగా నవ్వుకున్నాడు.
“రోజూ గొడవలే బాబూ…”
అతను ఆశ్చర్యపోయాడు.
“అయితే ఎలా కలిసి ఉన్నారు?”
తాత కళ్లలో మెరుపు.
“ఇప్పుడు మీ తరం ఒక విషయం మర్చిపోయింది.
మా కాలంలో…
విరిగిపోయిందని పారేయడం తెలియదు.
బాగు చేసుకుని మళ్లీ వాడుకోవడం తెలుసు.
అది వస్తువైనా… బంధమైనా…
సంబంధమైనా… అనుబంధమైనా…
అంతే.

ఆ మాట చెప్పి మౌనమయ్యాడు.
ఎందుకంటే…
ఇప్పుడు తాను బాగు చేయలేని ఒకే ఒక్క విషయం తన భార్య ఆరోగ్యం.
మధ్యాహ్నం అవుతుంది.
ఒక చిన్న స్టీల్ డబ్బా తెరుస్తాడు.
ఇంట్లో కూతురు పంపిన అన్నం.
రెండు ముద్దలు తింటాడు.
మూడో ముద్ద చేతిలో ఆగిపోతుంది.

యాభై ఏళ్లుగా తన పక్కన కూర్చుని…
“కారం ఎక్కువైంది…”
“ఉప్పు తక్కువైంది…”
అని ఆవిడను అంటూ తినే రోజులు గుర్తొస్తున్నాయి.
ఒంటరిగా తినడం కంటే…
ఆకలితో ఉండటం తేలికగా అనిపిస్తుంది.
డబ్బా మూసేస్తాడు.

అంతలో వార్డు తలుపు తెరుచుకుంటుంది.
స్ట్రెచర్ మీద ఒక పేషెంట్‌ను తీసుకెళ్తున్నారు.
వెనకాల భార్య ఏడుస్తూ వస్తోంది.
“నన్ను వదిలి వెళ్లొద్దండీ…
నాకెవరు ఉన్నారు…”
అని విలపిస్తోంది.

ఆ శబ్దం వినగానే…
తాత గుండెలో ఏదో విరిగినట్టు అవుతుంది.
ఎందుకంటే…
అదే మాట ఒకప్పుడు తన భార్య చెప్పింది.
పెళ్లైన కొత్తలో…
మొదటిసారి ఉద్యోగం కోసం ఆరు నెలలు ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు.
బస్ ఎక్కే ముందు…
ఆమె కళ్లలో నీళ్లు.
“ఇంత దూరం వెళ్లాల్సిందేనా?”
అని అడిగింది.
అప్పుడు నవ్వుతూ చెప్పాడు.
“ఆరు నెలలే కదా…
అంతలో ఏమవుతుంది?”

  • ఈ రోజు…
    ఆసుపత్రి బెంచీ మీద కూర్చుని…
    అదే మాట తనను వెంటాడుతోంది.
    “అంతలో ఏమవుతుంది?”
    మనిషి జీవితంలో అతి పెద్ద అబద్ధం అదే.
    “అంతలో ఏమవుతుంది?”
    అంతలోనే జీవితాలు మారిపోతాయి.
    మనుషులు మారిపోతారు.
    కాలం మారిపోతుంది.
    ఒక్కోసారి…
    మనిషి కూడా వెళ్లిపోతాడు.

సాయంత్రం అయిదు గంటలు.
ఆసుపత్రి గేటు దగ్గర పూలమ్మాయి కూర్చుంది.
మల్లెపూలు అమ్ముతోంది.
తాత చూపు ఆ పూల మీద ఆగిపోతుంది.
యాభై ఏళ్లుగా…
ప్రతి శుక్రవారం తన భార్యకు మల్లెపూలు తీసుకెళ్లడం అలవాటు.
ఎంత పేదరికం ఉన్నా…
ఆ పూలు మాత్రం మానలేదు.

ఒకసారి డబ్బులు లేక…
ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాడు.
ఆవిడ నవ్వి…
“పూలు లేవని బాధపడుతున్నావా?”
అంది.
“అవును…”
అన్నాడు.
ఆమె తన జడలో ఉన్న రెండు మల్లెలు తీసి…
అతని చొక్కా జేబులో పెట్టింది. మన మల్లె తీగవే ఇవి అని…
“నువ్వుంటే చాలు…
ఇక నుండి పూలు లేకపోయినా పర్వాలేదు…”
అంది.
ఆ రోజు గుర్తొచ్చింది.

  • ఈ రోజు జేబులో డబ్బులు ఉన్నాయి.
    పూలు కొనగలడు.
    కానీ…
    ఆ పూలు పెట్టుకునే జడ మంచం మీద ఉంది.

రాత్రి.
ఆసుపత్రి ప్రాంగణంలో చలి పెరుగుతోంది.
బెంచీ చల్లబడుతోంది.
తాత భుజంపై పాత శాలువా కప్పుకున్నాడు.
నిద్ర రావడం లేదు.
పక్కనే కూర్చున్న యువకుడు ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
“అమ్మా…
నేను వస్తా…
ఏడవకు…”
అంటున్నాడు.
ఆ మాట విని తాత కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఎందుకంటే…
తన అమ్మ చనిపోయిన రోజు గుర్తొచ్చింది.
ఆ రోజు కూడా ఇలాగే పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
కానీ…
చేరేసరికి ఐదు నిమిషాలు ఆలస్యమైంది.
అమ్మ చేతులు చల్లబడిపోయాయి.
అప్పుడు తన భార్య భుజం మీద చేయి వేసి చెప్పింది.
“ఏడవకండి…
మీ అమ్మ మీలోనే ఉంటుంది…”
అంది.
ఈ రోజు…
ఆ మాట చెప్పే ఆమెనే మంచం మీద ఉంది.

నర్స్ బయటకు వచ్చింది.
“తాతయ్య…
లోపలికి రండి.”
అంది.
తాత గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది.
వణుకుతున్న కాళ్లతో లోపలికి వెళ్లాడు.
ఆవిడ నిద్రలో ఉంది.
ముఖం చిక్కిపోయింది.
జుట్టు పలచబడిపోయింది.
కానీ…
తనకు మాత్రం ఇప్పటికీ పెళ్లి రోజు కనిపించిన అమ్మాయే కనిపిస్తోంది.
మెల్లగా దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఎముకలు మాత్రమే మిగిలిన ఆ చేతుల్లో…
ఒకప్పుడు మొత్తం కుటుంబాన్ని మోసిన శక్తి ఉండేది.

ఆ చేతులే…
పిల్లలకు అన్నం కలిపి పెట్టాయి.
ఆ చేతులే…
తన జ్వరం తగ్గే వరకు తల నిమిరాయి.
ఆ చేతులే…
తన కష్టాల్లో తోడుగా నిలిచాయి.
మెల్లగా ఆమె చెవిలో చెప్పాడు.
“వింటున్నావా…”
“ఇంకా మన ఇంటి పెరట్లో జామచెట్టు ఉంది.”
“నువ్వు నాటిన తులసి మొక్క కూడా ఉంది.”
“మన మనవరాలు నవ్వుతోంది.”
“నువ్వు లేస్తే చెప్పాలని చాలా మాటలు ఉన్నాయి.”
కొద్దిసేపు ఆగాడు.
గొంతు వణికింది.
కళ్లలో నీళ్లు నిండిపోయాయి.
“కానీ…
నువ్వు అలసిపోయి ఉంటే…
పోరాడలేకపోతే…
వెళ్లిపో…”
“నేను ఆపను…”
“ఈ యాభై మూడు ఏళ్లలో…
మొదటిసారి నీ ఇష్టం.”
అన్నాడు.

  • ఆ మాట చెప్పిన వెంటనే…
    తన ముఖాన్ని ఆమె చేతుల మీద పెట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
    ఎనభై ఏళ్ల మనిషి…
    మళ్లీ ఎనిమిదేళ్ల పిల్లాడైపోయాడు.
    ప్రేమ అంటే…
    కలిసి నవ్వడం కాదు.
    కలిసి ఫోటోలు దిగడం కాదు.
    కలిసి ప్రపంచం తిరగడం కాదు.
    ప్రేమ అంటే…
    మనిషి మొత్తం ప్రపంచమే అయిపోయిన తర్వాత…
    ఆ ప్రపంచాన్ని కోల్పోతాననే భయంతో…
    చిన్న పిల్లాడిలా ఏడవడం.

ఆసుపత్రి బయట ఉన్న ఆ బెంచీకి…
ఈ విషయం బాగా తెలుసు.
ఎందుకంటే…
అక్కడ కూర్చునే ప్రతి మనిషి…
ఒక రోగి కోసం కాదు…
తన ప్రపంచం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

బయట ఆసుపత్రి ఆవరణలో ఒక చిన్న పిల్లాడు పరిగెడుతూ వెళ్తాడు.
తాత చూపు అతనిపై ఆగిపోతుంది.
అతనికి ఒక్కసారిగా తన కొడుకు గుర్తొస్తాడు.
మొదటి సారి స్కూల్‌కు వెళ్లిన రోజు.
ఏడుస్తూ…
“నాన్నా… నువ్వు కూడా రా…”
అని చేతులు పట్టుకున్న రోజు.
సైకిల్ తొక్కడం నేర్పిన రోజు.
డిగ్రీ పాస్ అయిన రోజు.
పెళ్లి రోజు.
అన్నీ గుర్తొస్తాయి.

కాలం ఎంత విచిత్రం కదా…
ఒకప్పుడు పిల్లలు మన చేతిని పట్టుకుని నడుస్తారు.
తర్వాత మనమే వాళ్ల జ్ఞాపకాలను పట్టుకుని నడవాల్సి వస్తుంది.
రాత్రి ఎనిమిది గంటలు.
విజిటింగ్ అవర్స్ ముగిశాయి.
ఆసుపత్రి నిశ్శబ్దమవుతుంది.

దూరంగా అంబులెన్స్ సైరన్ వినిపిస్తుంది.
ఎవరో ఏడుస్తున్నారు.
ఎవరో ప్రార్థిస్తున్నారు.
ఎవరో ఆశ ఎదురు చూస్తూ కూర్చున్నారు.
ఎవరో ఆశను కోల్పోయి తల పట్టుకొని కూర్చున్నారు.
ఆ బెంచీ మాత్రం అన్నింటినీ చూస్తోంది.

మళ్ళీ తాత బెంచి మీదకు వచ్చి నడుం వాలుస్తాడు. తాత జేబులోంచి ఒక పాత ఫోటో తీస్తాడు.
నలభై ఏళ్ల క్రితం తీసింది.
బ్లాక్ అండ్ వైట్ ఫోటో.
ఆవిడ నవ్వుతోంది.
తాను పక్కన నిలబడి ఉన్నాడు.
చాలాసేపు చూస్తాడు.
తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలుపెడ్తాడు.
ఎదుట ఎవరూ లేరు.
కానీ అతనికి ఆవిడ వినిపిస్తోందనిపిస్తుంది.

“వింటున్నావా?”
“నువ్వు లేకపోతే నాకు టీ కూడా తాగడం రావట్లేదు.”
“ఇంట్లో మన తులసి మొక్క ఎండిపోతోంది.”
“నీ పిల్లి ప్రతిరోజూ నిన్నే వెతుకుతోంది.”
“నీకు ఇష్టమైన మల్లెపూలు పూశాయి.”

కొద్దిసేపు ఆగుతాడు.
గొంతు బరువెక్కుతుంది.
“ఇంకా కొంచెం ఉండు…”
“ఇంత తొందరగా వెళ్లిపోకు…”
“నువ్వు వెళ్తే…
నేను ఎవరితో గొడవపడాలి?”
“ఎవరితో మాట్లాడాలి?”
“ఎవరికోసం ఇంటికి వెళ్లాలి?”

తెల్లవారుజామున నాలుగు గంటలు.
ఆసుపత్రి ఇంకా పూర్తిగా మేల్కొనలేదు.
కారిడార్లలో లైట్లు మాత్రం వెలుగుతున్నాయి.
నిశ్శబ్దం.
ఎక్కడో దూరంగా ఒక మానిటర్ “బీప్… బీప్…” అంటూ వినిపిస్తోంది.
మరో మూలన ఎవరో దేవుడి పేరు జపిస్తున్నారు.
ఆ బెంచీ మీద మాత్రం తాత కూర్చునే ఉన్నాడు.
రాత్రంతా కంటిమీద కునుకు లేదు.
కళ్ల కింద నల్లటి వలయాలు.
గుండెల్లో చెప్పలేని భయం.
అప్పుడే…
వార్డు తలుపు తెరుచుకుంది.

నర్స్ బయటకు వచ్చింది.
“తాతయ్య…”
అంది.
ఆ ఒక్క పిలుపుతోనే…
ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
ఎందుకో తెలియదు.
కొన్ని పిలుపులు వినగానే…
జీవితం మారబోతోందని మనసు ముందే పసిగడుతుంది.
“లోపలికి రండి…”
అంది నర్స్.
తాత మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లాడు.
మంచం మీద ఆమె ఉంది.

కానీ…
ఈసారి ఏదో భిన్నంగా అనిపించింది.
ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి.
చాలా రోజుల తర్వాత.
చాలా రోజుల తర్వాత తనను చూసి నవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఆ నవ్వులో శక్తి లేదు.
కానీ ప్రేమ మాత్రం ఉంది.
అదే పాత ప్రేమ.
యాభై మూడు సంవత్సరాల ప్రేమ.
తాత దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.
ఆమె చేయిని పట్టుకున్నాడు.

ఈసారి…
ఆమె కూడా తన వేళ్లను కదిలించింది.
బలహీనంగా…
కానీ స్పష్టంగా.
“ఏమండీ…”
అంది.
ఆ మాట వినగానే…
తాత గుండె బద్దలైంది.
ఎందుకంటే…
మూడు వారాల తర్వాత ఆమె తనను పిలిచిన మొదటి మాట అది.
“ఏమండీ…”
అనే పిలుపు.

అందులో యాభై మూడు ఏళ్ల సంసారం ఉంది.
వేల గొడవలు ఉన్నాయి.
లక్ష జ్ఞాపకాలు ఉన్నాయి.
“ఏమండీ…”
మళ్లీ పిలిచింది.
“చెప్పు…”
అన్నాడు తాత.
గొంతు వణుకుతూ.
“మన ఇంటి తలుపు మూసారా?”
అంది.
తాత ఒక్కసారిగా ఏడ్చేశాడు.

చివరి క్షణాల్లో కూడా…
ఆమెకు ఇంటి గురించే ఆలోచన.
ఆ ఇంటి కోసం…
ఎన్ని నగలు అమ్ముకుంది.
ఎన్ని కోరికలు చంపుకుంది.
ఎన్ని రాత్రులు నిద్రపోలేదు.
ఆ ఇంటి గురించే.
“మూసాను…”
అన్నాడు.
“తులసి మొక్కకు నీళ్లు పోశారా?”
“పోశాను…”
“మన పిల్లి తిందా?”
“తింది…”
“మన మనవరాలు స్కూల్‌కి వెళ్లిందా?”
“వెళ్లింది…”
ఆమె చిన్నగా నవ్వింది.

ఒక్కొక్క ప్రశ్నతో…
ఆమె జీవితం మొత్తం కళ్లముందు తిరుగుతోంది.
కొద్దిసేపు మౌనం.
తర్వాత మెల్లగా అడిగింది.
“నేను పోతే…”
తాత వెంటనే ఆమె నోరు మూసేశాడు.
“అలా మాట్లాడకు…”
అన్నాడు.
చిన్న పిల్లాడిలా.
ఆమె బలహీనంగా నవ్వింది.
“నన్ను ఎప్పుడూ మాట్లాడనివ్వరు…”
అంది.
అదే ఆమె పాత అలవాటు.
చావు ముందు కూడా మారలేదు.
“నేను పోతే…”
మళ్లీ మొదలుపెట్టింది.
“మీరు టైంకి భోజనం చేయాలి.”
“మందులు వేసుకోవాలి.”
“ఎక్కువగా ఏడవకండి.”
“మన పిల్లలకు భారంగా మారకండి.”
“ప్రతిరోజూ సాయంత్రం బయట కూర్చోండి.”
“మల్లెపూలు కనిపిస్తే కొనండి.”
“నాకు ఇష్టం కదా…”
అంది.

తాత తల వంచుకున్నాడు.
కన్నీళ్లు ఆగడం లేదు.
ఆమె అకస్మాత్తుగా అడిగింది.
“ఒక విషయం చెప్పండి…”
“చెప్పు…”
“మన జీవితంలో నేను మీకు మంచి భార్యనేనా?”
అంది.
ఆ ప్రశ్న విన్నాక…
తాత కళ్లల్లోని నీళ్లు ఆగలేదు.
ఎందుకంటే…
ఆ ప్రశ్నకు జవాబు మాటల్లో చెప్పలేడు.
యాభై మూడు సంవత్సరాలు సరిపోవు.
ఒక జీవితకాలం సరిపోదు.

మెల్లగా ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు.
బహుశా…
పెళ్లైన తర్వాత మొదటిసారి.
“భార్య కాదు…”
అన్నాడు.
“నువ్వే నా ఇల్లు.”
“నువ్వే నా ధైర్యం.”
“నువ్వే నా దేవుడు.”
“నువ్వే నా ప్రపంచం.”
“ఈ జన్మలో నేను చేసిన ఒక్క మంచి పని ఉంటే…”
“అది నిన్ను పెళ్లి చేసుకోవడమే.”
అన్నాడు.

ఆమె కళ్ళలో నీళ్లు మెరిశాయి.
చాలా కష్టంగా చేయి ఎత్తింది.
అతని చెంప మీద పెట్టింది.
అదే చేయి…
ఒకప్పుడు అతని జుట్టు సర్దింది.
అదే చేయి…
అతని జ్వరాన్ని తాకింది.
అదే చేయి…
పిల్లల భవిష్యత్తును నిర్మించింది.
ఇప్పుడు…
చివరిసారి అతని ముఖాన్ని తాకుతోంది.
“ఏమండీ…”
అంది.
“చెప్పు…”
“తర్వాతి జన్మ ఉంటే…”
కొద్దిసేపు ఊపిరి తీసుకుంది.
“మళ్లీ మీకే భార్యగా వస్తాను.”
అంది.

  • తాత ఇక తట్టుకోలేకపోయాడు.
    ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
    “నాకు తర్వాతి జన్మ వద్దు.”
    అన్నాడు.
    “ఈ జన్మలోనే ఇంకొంచెం ఉండు…”
    అన్నాడు.
    “ఇంకో సంవత్సరం కాదు…”
    “ఇంకో నెల కాదు…”
    “ఇంకో రోజు కాదు…”
    “ఇంకో గంట కాదు…”
    “ఇంకో ఐదు నిమిషాలు ఉండు…”
    అన్నాడు.
    “నువ్వు లేకుండా బతకడం ఎలా అని నేర్చుకునేంత వరకు ఉండు…”
    అన్నాడు.

కానీ…
కొన్ని మొక్కులకు సమాధానం ఉండదు.
కొన్ని ప్రేమలకు ముగింపు రాసి ఉంటుంది.
కొన్ని చేతులు…
ఎంత గట్టిగా పట్టుకున్నా జారిపోతాయి.
ఆమె పెదవుల మీద చిన్న నవ్వు.
కళ్లల్లో తృప్తి.
అతని చేతిలో తన చేయి.
అలాగే…
మెల్లగా కళ్ళు మూసుకుంది.

ఆసుపత్రి గది నిశ్శబ్దమైంది.
మానిటర్ శబ్దం మారిపోయింది.
డాక్టర్లు పరుగెత్తుకొచ్చారు.
నర్సులు వచ్చారు.
ఎవరో మాట్లాడుతున్నారు.
ఎవరో కదులుతున్నారు.
కానీ…
తాతకు ఏమీ వినిపించడం లేదు.
ఎందుకంటే…
అతని ప్రపంచం ఇప్పుడే ఆగిపోయింది.

ఆ రోజు సాయంత్రం…
ఆ పాత ఇనుప బెంచీ మళ్లీ ఖాళీగా ఉంది.
కానీ ఈసారి…
అది నిజంగా ఖాళీ కాదు.
దాని మీద యాభై మూడు ఏళ్ల ప్రేమ కూర్చుని ఉంది.
ఒక మనిషి జీవితమంతా కూర్చుని ఉంది.
ఒక స్త్రీ చేసిన త్యాగాలన్నీ కూర్చుని ఉన్నాయి.
ఒక కుటుంబం నిలబడటానికి తన జీవితాన్ని ఖర్చు చేసిన అమ్మ కూర్చుని ఉంది.

  • కొన్నాళ్ల తర్వాత…
    తాత మళ్లీ అక్కడికి వచ్చాడు.
    చేతిలో చిన్న మల్లెపూల దండ.
    బెంచీ మీద కూర్చుని…
    పక్కన ఖాళీ చోటు చూసి మెల్లగా అన్నాడు…
    “ఏమే…”
    “ఈరోజు కూడా పూలు తెచ్చాను…”
    “నువ్వు పెట్టుకోడానికి లేవు…”
    “కానీ నేను తేవడం మానలేకపోతున్నాను…”
    అన్నాడు.

ఆ తర్వాత…
మొదటిసారి కాదు…
చివరిసారి కాదు…
మళ్లీ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
ఆ బెంచీ మాత్రం…
మౌనంగా అతని కన్నీళ్లను మోస్తూ కూర్చుంది.
మన జీవితంలో ప్రేమ అంటే…
పెద్ద పెద్ద మాటలు కాదు.
రోజూ “తిన్నావా?” అని అడిగే మనిషి.
జ్వరం వస్తే రాత్రంతా మేల్కొని కూర్చునే మనిషి.
మన కోపాన్ని భరించే మనిషి.
మన బలహీనతలను దాచే మనిషి.
ఆ మనిషి ఉన్నప్పుడు…
అది సాధారణంగా అనిపిస్తుంది.
లేనప్పుడు…
అదే స్వర్గం అని తెలుస్తుంది.

ఆసుపత్రి ఆ బెంచీ ఇప్పటికీ అక్కడే ఉంది.
ప్రతిరోజూ కొత్త మనుషులు వస్తున్నారు.
కొత్త కథలు.
కొత్త కన్నీళ్లు.
కొత్త ప్రార్థనలు.
కానీ ప్రతి రాత్రి…
ఆ బెంచీ ఒకటే ప్రశ్న అడుగుతుంది.
“మీరు ప్రేమించే వాళ్లు ఇంకా మీ పక్కనే ఉన్నారా?”
“అయితే ఈరోజు వాళ్లతో కాసేపు కూర్చోండి…”
“రేపు సమయం ఉంటుందనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు…” అని.
.
.
.
.
.
.
రఘు మందాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • M6… ఆరు నగరాలు… భారత భవిష్యత్తు… రేవంత్‌రెడ్డి భేషైన ప్రతిపాదన…
  • ఆ బెంచీ..! ఎన్ని జ్ఞాపకాల నెమరివేత..? ఎన్ని కన్నీళ్లు ఇంకిన వేదిక..!!
  • తెలంగాణలో ‘సర్’… 88 లక్షల వోట్లు డౌట్‌ఫుల్… కథ మొదలైంది…
  • FIFA … 39 రోజులపాటు భూభ్రమణం ఓ బంతి చుట్టూ… హైఫీవర్ షురూ…
  • బీజేపీ బిగ్ గేమ్..! ఇండి కూటమి కకావికలు… టార్గెట్ 2028…!!
  • సుప్రీం కోర్టు ఆ తీర్పు… మీనాక్షి నటరాజన్ కేసులో కీలకం..?!
  • ఆ ధర్మస్థల కుట్రదారుల్ని సమాజం ఏం శిక్షించగలిగింది..!?
  • ఈ పిశాచిని ఈ న్యాయవ్యవస్థ శిక్షించగలదా..? ఎవ్వడూ నమ్మడు..?!
  • వర్తమాన రాజకీయాల్లో విజయశాంతి ‘ఆశయం’ నెరవేరేనా..?
  • కాంగ్రెస్‌లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions