Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!

August 15, 2026 by M S R

.

సోషల్ మీడియాలో, మీడియాలో ఫుడ్ సెంటర్ కుమారి ఆంటీ ఫోటో కనిపించింది… పాంచాలీ పంచభర్తృక సినిమా టికెట్ తెచ్చి చూపిస్తే 100 రూపాయల డిస్కౌంట్ ఇస్తుందట… ఎందుకు..? అందులో ఆమె నటించింది, ఇదోరకం సినిమా ప్రచారం కోసం అన్నమాట… (చాన్నాళ్లుగా ఇద్దరు ఆంటీలే పాపులర్, ఒకరు ఈమె, మరొకరు అనసూయాంటీ)…

తీరా సదరు పాంచాలీ పంచభర్తృక సినిమా చూసిన ఓ మిత్రుడిని అడిగా… ఆ టైటిల్ ఎందుకు పెట్టారురా అని… తెల్లమొహం వేశాడు, అవును కదా, ఎందుకు పెట్టినట్టు అని నన్నే ఉల్టా అయోమయంగా అడిగాడు… ఉత్తదే… ఇందులో పాంచాలి లేదు, పంచభర్తృక లేదు…  ఇలాంటి టైటిళ్లను ‘చీప్ షాక్ వాల్యూ’ కోసం పెడతారు… అంటే చీప్ పబ్లిసిటీ టాక్టిక్… సో, ద్రౌపదిని కూడా వదల్లేదు ఈ నిర్మాతలు ఎవరో గానీ…

Ads

సినిమాకు కథ కావాలి. కథకు తగ్గ టైటిల్ కావాలి. ఆ టైటిల్ వింటే సినిమా ఏం చెప్పబోతోందో ప్రేక్షకుడికి కనీసం ఓ అంచనా రావాలి. కానీ ఇప్పుడు సినిమా మార్కెటింగ్‌లో మరో కొత్త సూత్రం వచ్చేసింది. కథ ఎలా ఉన్నా ఫర్వాలేదు… టైటిల్ మాత్రం షాక్ ఇవ్వాలి!

‘పాంచాలి పంచభర్తృక’ కూడా ఆ కోవలోకి వచ్చిన సినిమానే అనిపిస్తుంది. పాంచాలి అంటే ద్రౌపది. పంచభర్తృక అంటే ఐదుగురు భర్తలు కలిగిన స్త్రీ. మహాభారతంలోని ద్రౌపదిని సూచించే పదబంధం ఇది. అలాంటి పదాన్ని తీసుకుని ఓ క్రైమ్ కామెడీ సినిమాకు టైటిల్‌గా పెట్టారు.

ఎందుకు?

కథలో ద్రౌపది ఉందా? లేదు.
మహాభారతం ఉందా? లేదు.
పాంచాల దేశం ఉందా? లేదు.
ఐదుగురు భర్తల కథ ఉందా? లేదు.

మరి ఎందుకు ఈ పేరు?

అదే ప్రశ్న. సమాధానం చాలా సింపుల్‌గా కనిపిస్తోంది. ‘ఏమిట్రా ఈ టైటిల్?’ అని ప్రేక్షకుడు ఒక్కసారి ఆగి చూడాలి. సోషల్ మీడియాలో చర్చ జరగాలి. మీమ్స్ రావాలి. యూట్యూబ్‌లో వీడియోలు పడాలి. వార్తల్లో పేరు కనిపించాలి. అంతే. అంటే కథ కంటే ముందే క్యూరియాసిటీని అమ్ముకోవడం.

అదే జరిగిందని విడుదలకు ముందే కనిపించింది. ఈ సినిమా టైటిల్‌నే క్రేజీగా చూపిస్తూ ప్రచారం జరిగింది. విడుదలైన తర్వాత కూడా అనేక రివ్యూలు మొదట ప్రస్తావించిన అంశం అదే—‘పాంచాలి పంచభర్తృక’ అనే ఆసక్తికరమైన టైటిల్. కానీ ఇక్కడ ఒక అసౌకర్యమైన ప్రశ్న ఉంది.

మన పురాణ పాత్రల పేర్లను కూడా ఇక మార్కెటింగ్ మెటీరియల్‌గా వాడుకోవచ్చా? ద్రౌపది భారతీయ సంస్కృతిలో కేవలం ఓ పాత్ర కాదు. మహాభారతంలో అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన స్త్రీ పాత్రల్లో ఒకరు. ఆమె జీవితంలో అవమానం ఉంది, ప్రతిఘటన ఉంది, రాజకీయ చైతన్యం ఉంది, వ్యక్తిత్వం ఉంది.

ఆమె పేరుతో సినిమా తీస్తే తప్పేమీ లేదు. ఆమె కథను కొత్త కోణంలో చెప్పినా తప్పేమీ లేదు. ఆమె పాత్రను ఆధునిక సందర్భంలో పునర్‌వ్యాఖ్యానించినా తప్పేమీ లేదు. కానీ ఆమెను సూచించే పదబంధాన్ని తీసుకుని, దానికి సినిమా కథతో బలమైన సంబంధం లేకుండానే ‘క్రేజీ టైటిల్’గా ఉపయోగించడం మాత్రం ప్రశ్నించాల్సిందే.

ఇది ద్రౌపదిని నేరుగా కించపరిచే సినిమా అని చెప్పడానికి ఆధారం ఉండకపోవచ్చు. కానీ ద్రౌపది పేరుతో చీప్ క్యూరియాసిటీని అమ్ముకోవడం మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించదగ్గ మార్కెటింగ్ వ్యూహం.

మరి సినిమా కథ ఏంటి? ఇక్కడే అసలు కామెడీ మొదలవుతుంది. సినిమాలో నలుగురు వ్యక్తులు కలిసి ఉంటారు. ఒక అమ్మాయిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు. ఆమె వచ్చాక, వాళ్లు ఊహించిన ‘ఆ ప్రక్రియ’  జరగకముందే ఆమె రక్తపు మడుగులో కనిపిస్తుంది. శవాన్ని సూట్‌కేసులో పెట్టి మాయం చేయాలని చూస్తారు. చివరికి ఆ సూట్‌కేసే మాయమవుతుంది.

ఆమెను ఎవరు చంపారు? శవం ఎక్కడికి పోయింది? రాజేంద్రప్రసాద్‌ పోషించిన పరమసుందరి ఎవరు? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు ఏం చేశాడు? ఇలా మర్డర్ మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుంది. ఇది వింటేనే అర్థమవుతుంది…

‘పాంచాలి పంచభర్తృక’ అనే టైటిల్‌కు ఈ కథకు ఏ సంబంధం చెప్పండిక ? రాజేంద్ర ప్రసాద్ అంటే గతంలో ఫ్యామిలీస్ మొత్తం కలిసి చూసేంత ఆరోగ్యకరమైన కామెడీతో ఉండేవి… ఇప్పుడు ఆయన స్టేజ్ ఎక్కితే ఏవేవో పిచ్చి కూతలు, ఇదుగో, ఇలాంటి సినిమాల్లో పాత్రలు చూస్తేనేమో ఇలాంటి పాత్రలు… సరే, ఆ సినిమా సమీక్ష కాదు ఇక్కడ… టైటిల్ గురించే…

సినిమా తీసేవాళ్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేక్షకుడిని ఆకర్షించడం వేరు. ప్రేక్షకుడిని చీప్‌గా రెచ్చగొట్టడం వేరు. ఒక టైటిల్ వింటే ప్రేక్షకుడికి ఆసక్తి కలగాలి. కానీ ఆ ఆసక్తి… “ఈ సినిమా ఏం చెబుతుంది?” అనే ప్రశ్న నుంచి రావాలి. “అరే… ఇలాంటి పేరు పెట్టారా?” అనే షాక్ నుంచి కాదు. ‘పాంచాలి పంచభర్తృక’ రెండో మార్గాన్ని ఎంచుకుంది…

ఇది ఈ ఒక్క సినిమాకు సంబంధించిన సమస్య కూడా కాదు. పురాణాలు, దేవుళ్లు, ఇతిహాసాలు, చారిత్రక పాత్రలు మన సమాజంలో బలమైన భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే వాటి పేర్లతో టైటిల్ పెట్టగానే ఉచిత ప్రచారం వస్తుంది. అదే ఇప్పుడు కొత్త మార్కెటింగ్ ఫార్ములా అయిపోతే మాత్రం ప్రమాదమే.

రేపు మరో సినిమా వస్తుంది. ఎవరైనా శకుంతల పేరును తీసుకుంటారు. మరో నిర్మాత సీత పేరును తీసుకుంటాడు. ఇంకొకరు రాధ పేరును తీసుకుంటారు. కథలో వాటికి సంబంధం లేకపోయినా పర్వాలేదు. పేరు వినగానే జనం మాట్లాడితే చాలు. ఇది కళ కాదు. ఇది అటెన్షన్ ఎకానమీ.

“ఈ పేరు చూసి ఒక్కసారి అయినా జనం మాట్లాడతారు” అనే లెక్క. డబ్బు పెట్టి సినిమా తీయొచ్చు. ప్రచారం కోసం వంద పోస్టర్లు వేయొచ్చు. వైరల్ కావడానికి వంద రకాల ట్రిక్కులు చేయొచ్చు. కానీ మన పురాణాల నుంచి ఓ మహిళ పేరు ఆ పాత్కర విలువను, చారిత్రక–సాంస్కృతిక నేపథ్యాన్ని పక్కనబెట్టి కేవలం షాక్ వాల్యూ కోసం వాడటం మాత్రం ప్రశ్నించాల్సిందే…

ఇక్కడ మరో అంశం చెప్పుకోవాలి… ఒక ఇడుపు కాయితం, ఒక శనార్తి వంటి టైటిళ్లు తెలంగాణ మాండలిక పదసంపదను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి, తెలంగాణ సాంస్కృతిక- సామాజిక నేపథ్యాలతో కథలు చెబుతూ ప్రేక్షకుడి అటెన్షన్ తమవైపు తిప్పుకుంటున్నాయి… మరోవైపు పాంచాలీ – పంచభర్తృక అంటూ ఇదుగో ఈ ఇకారం..!!

ఈ టైటిల్ పెట్టినవాళ్లకు ఓ విషయం గుర్తులేదేమో... మన దేశ ప్రథమ పౌరురాలు, ఓ ఆదివాసీ తేజం, మన రాష్ట్రపతి పేరు కూడా ద్రౌపది !! వెక్కిరింపుల టైటిళ్లు పెడితే, కథ అడ్డం తిరిగితే బుక్కయ్యేది వీళ్లే !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !
  • దేవుడు ఆ రహస్యాన్ని చాన్నాళ్లు దాచాడు – కానీ ఇక దాగలేదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions