.
( Shankar G ) …. మీరు బహుశా ఈ సినిమా గురించి విని ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా సృష్టించిన వివాదం ఎంత తీవ్రంగా ఉందంటే, కథానాయిక ఇంటిని కొందరు తగలబెట్టారు. ఆ తర్వాత ఆమె జీవితంలో మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వివాదానికి కారణం సినిమాలోని కథాంశం కాదు… అప్పటి సమాజంలోని కుల వివక్ష, సంకుచిత భావాలే!
1928లో జె.సి. డేనియల్ (J. C. Daniel) మలయాళ సినిమా చరిత్రలో తొలి చిత్రంగా గుర్తింపు పొందిన ‘విగతకుమారన్’ (Vigathakumaran) సినిమాను నిర్మించారు. ఇది మూకీ చిత్రం. తన సొంత డబ్బుతోనే డేనియల్ ఈ సినిమాను రూపొందించారు.
Ads
సినిమా కథ చాలా సాధారణమైనది. కుటుంబం నుంచి విడిపోయిన ఒక యువరాజు, కూలీగా జీవితం గడపడం, ఒక అమ్మాయితో ప్రేమలో పడటం, చివరకు తన అసలు కుటుంబాన్ని తిరిగి కలుసుకోవడం… ఇదీ కథ.
అసలు వివాదానికి కారణం ఇదే: అప్పట్లో సినిమాల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులే వేసేవారు. అలాంటి రోజుల్లో, ఒక మహిళను హీరోయిన్‌గా నటింపజేయడానికి డేనియల్ ఎంతో ప్రయత్నించి, చివరకు పి.కె. రోసీ (P. K. Rosy) అనే దళిత (పులయ) సామాజిక వర్గానికి చెందిన మహిళను ఎంపిక చేశారు. ఆమె సినిమాలో ‘సరోజిని’ అనే అగ్రవర్ణ (నాయర్) యువతి పాత్రను పోషించారు.
ఆనాటి సమాజంలో దళితులు అగ్రవర్ణుల ఇళ్లలోకి రావడమే నిషేధం. అలాంటిది, ఒక దళిత మహిళ అగ్రవర్ణ యువతిగా నటించడం, పైగా తెరపై హీరో ఆమె జుట్టులో పూలు పెట్టడం వంటి సన్నివేశాలను అప్పటి అగ్రవర్ణ సమాజం జీర్ణించుకోలేకపోయింది.
సినిమా విడుదలైనప్పుడు హీరోయిన్ నిజ జీవిత నేపథ్యం (దళిత మహిళ అని) ప్రేక్షకులకు తెలియడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. తెరపై రాళ్లు విసిరి, ప్రదర్శనకు ఉపయోగించిన పరికరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత పి.కె. రోసీపై దాడికి దిగారు.
ఆమె ఇంటిని తగలబెట్టారు. దీంతో రోసీ తన ఇంటిని వదిలి ప్రాణభయంతో తమిళనాడుకు పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఒక లారీ డ్రైవర్‌ను వివాహం చేసుకుని, తన పేరు మార్చుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ సినిమాల్లోకి తిరిగి రాలేదు. కొంతకాలానికే ఆమెను సమాజం పూర్తిగా మరిచిపోయింది.

ఇక దర్శకుడు జె.సి. డేనియల్ కూడా ఆర్థికంగా పూర్తిగా దివాలా తీశారు. కేరళను వదిలి తమిళనాడుకు వెళ్లి దంతవైద్యుడిగా జీవితం కొనసాగించారు. ఆయన కూడా క్రమంగా మరుగున పడిపోయారు. తమిళనాడుకు వెళ్లిపోయారనే కారణంతో కేరళ ప్రభుత్వం ఆయనకు ఆర్థిక సహాయం లేదా పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఇక ఈ సినిమా గురించి మరో విషాదకరమైన విషయం ఏమిటంటే, ‘విగతకుమారన్’ సినిమా రీళ్లు ఏవీ ఈరోజు అందుబాటులో లేవు. డేనియల్ కుమారుల్లో ఒకరు అసూయ, ద్వేషంతో ఆ సినిమా రీళ్లను తగలబెట్టారు. సినిమాలో నటించిన తన అన్నయ్య తనను తరచూ వేధించేవాడనే కోపంతో అతను ఈ పని చేశాడని చెబుతారు.
అలా, ఎలాంటి వివాదాస్పద కథాంశం లేని ఒక సినిమా, అప్పటి సమాజంలోని సంప్రదాయవాద భావాలకు, కుల వివక్షకు వ్యతిరేకంగా నిలిచినందుకు ప్రజల ఆగ్రహానికి గురైంది.
ఈ కథ మనకు చెప్పే విషయం ఒక్కటే: కళలో తప్పు లేకపోయినా, కళను చూసే సమాజంలోని ఆలోచనల్లో తప్పు ఉంటే, కళాకారుల జీవితాలు ఎంత దారుణంగా ప్రభావితమవుతాయో చెప్పడానికి పి.కె. రోసీ జీవితం ఒక విషాదకరమైన ఉదాహరణ.
Share this Article