Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెంటాడే ‘మిన్నేటి సూరీడు’ భారతీరాజా… ఏదో తెలియని మత్తు…

June 12, 2026 by M S R

.

వెంటాడే భారతీరాజా ‘మిన్నేటి సూరీడు’ … కళ్లు మూసుకుని వింటే చెవుల్లో అమృతం… కళ్లు తెరిచి చూస్తే వెండితెరపై ఒక అద్భుతమైన పెయింటింగ్! కొన్ని పాటలు వినడానికి మాత్రమే బాగుంటాయి. కానీ ఈ పాట వింటుంటే… ఒళ్లు మరిచి ఊగిపోవాలనిపిస్తుంది. మనసులో ఏదో తెలియని మత్తు కమ్ముకుంటుంది.

తెలుగు సినిమా హిస్టరీలో కొన్ని గీతాలు కాల గమనాన్ని తట్టుకుని, తరాలు మారినా తలపులను వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక అద్భుత దృశ్యకావ్యమే- భారతీరాజా ‘సీతాకోకచిలుక’ చిత్రంలోని “మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా…”. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ పాట వెనుక ఉన్న అక్షర రమ్యత, స్వర మాధుర్యం, దృశ్య విన్యాసాల గురించి భారతీరాజా స్మృతికి నివాళిగా నాలుగు మాటలు.

Ads

పల్లె పదాల తామర కొలను … ఇది కేవలం పాట కాదు… వేటూరి కలంతో తవ్విన తామర కొలను.
“మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా… పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా…”
ఎంత సరళమైన పదాలు! కానీ ఎంతటి గాఢమైన అర్థం! ఆకాశంలో సూర్యుడు రాగానే కోనేట్లో తామరలు విచ్చుకున్నాయట… అంటే, ప్రియుడి రాకతో ఆ పల్లెపిల్ల మనసు వికసించిందని కవి హృదయం.

పరువాల వయసులో వచ్చే మార్పులను, గుండెల్లో దాగున్న ఆరాటాన్ని వేటూరి పట్టుకున్న తీరు అమోఘం.
“మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా? బుగ్గ దాచుకుంటే బులపాటాలా?” అంటూ పడుచు వయసులోని సిగ్గును, ఆరాటాన్ని గుండెకు హత్తుకునేలా రాశారు. ఈ పాట పల్లవించడమంటే… ముద్దుకే పొద్దు పొడిచినట్టు ఉంటుంది! శృంగారం ఎక్కడా శ్రుతి మించకుండా, ప్రకృతితో ముడిపెట్టి వేటూరి కురిపించిన అక్షరాల జల్లు ఇది.

స్వరాల లయ…ఇళయరాజా మాయ

ఈ సాహిత్యానికి ‘మ్యూజిక్ మేస్ట్రో’ ఇళయరాజా అందించిన రాగాలు… తామర మొగ్గలై ప్రతి పదంలోనూ విచ్చుకుంటాయి. ఈ పాటలో ఎలాంటి వెస్ట్రన్ హంగులు లేవు, కృత్రిమ శబ్దాలు లేవు. కేవలం మన మట్టి వాసన, పల్లెటూరి కొలనులో తామరలమీద పడే నీటి బిందువులు మాత్రమే వినిపిస్తాయి.

గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గళంలోని వెచ్చదనం, వాణీ జయరాం ఆలాపన… మనసు కొలనులో అమృతాన్ని కురిపిస్తాయి. ముఖ్యంగా “లా ల లా…” అని వాణీ జయరాం అంటుంటే, గిలిగింతలతో, పులకింతలతో ఒళ్లు మరచిపోవాల్సిందే. మండే ఎండలను కూడా అందమైన రంగవల్లులుగా, పూలజల్లులుగా మార్చిన సంగీతమిది.

కేన్వాస్‌పై భారతీరాజా గీసిన పల్లెచిత్రం

సాహిత్యం, సంగీతం ఒక ఎత్తైతే… ఈ అద్భుతమైన పాటను వెండితెరపై సజీవంగా నిలిపింది మాత్రం… భారతీరాజా ‘దృశ్య విన్యాసం’. సినిమా అంటే నాలుగు గోడల మధ్య, స్టూడియో లైట్ల మధ్య షూటింగ్ చేయడం కాదు… ప్రకృతి మధ్యలోనే సినిమా ప్రాణం ఉంటుందని నమ్మిన క్రియేటర్ ఆయన.

ఈ పాటలో యాక్షన్ అంటే… నటీనటుల కళ్లలోని భావాలు. కంటి కోలాటాలు, జంట పేరంటాలు చేసుకునేలా… హీరో హీరోయిన్ల చూపుల్ని, నవ్వుల్ని చాలా నేచురల్‌గా కెమెరాలో బంధించారు.
ఎగిరే రామచిలుకలు
పచ్చని ప్రేమమొలకలు
తోడుండే గోరింకలు
ఎగసిపడే కెరటాలు…
ఇవన్నీ చూస్తుంటే మనంకూడా ఆ పల్లెటూరి తామర కొలనులో మునిగితేలుతూ ఉంటాం.

పాట ముగిసినా… ఆ పల్లెటూరి జ్ఞాపకాలు, ఆ అలల సవ్వడి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సినిమాను మట్టికి, మనసులకు అంత దగ్గరగా తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ భారతీరాజా మేధస్సుకు, వేటూరి అక్షర శిల్పానికి, ఇళయరాజా స్వరజ్ఞానానికి, బాలు- వాణీజయరాం గాత్రానికి మన పులకింతలే వేనవేల కృతఙ్ఞతలు. ఈ ‘మిన్నేటి సూరీడు’ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు… ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటాడు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…
  • వెంటాడే ‘మిన్నేటి సూరీడు’ భారతీరాజా… ఏదో తెలియని మత్తు…
  • తమిళ రాజకీయ నేతలకు కర్ణాటక అమ్మవార్లే ఎందుకు ప్రత్యేకం?
  • ప్రిపెయిడ్..! తనెవరికీ ఏమీ కాడు, తనకెవరూ మిగల్లేదు… ఫిక్సయ్యాడు..!!
  • M6… ఆరు నగరాలు… భారత భవిష్యత్తు… రేవంత్‌రెడ్డి భేషైన ప్రతిపాదన…
  • ఆ బెంచీ..! ఎన్ని జ్ఞాపకాల నెమరివేత..? ఎన్ని కన్నీళ్లు ఇంకిన వేదిక..!!
  • తెలంగాణలో ‘సర్’… 88 లక్షల వోట్లు డౌట్‌ఫుల్… కథ మొదలైంది…
  • FIFA … 39 రోజులపాటు భూభ్రమణం ఓ బంతి చుట్టూ… హైఫీవర్ షురూ…
  • బీజేపీ బిగ్ గేమ్..! ఇండి కూటమి కకావికలు… టార్గెట్ 2028…!!
  • సుప్రీం కోర్టు ఆ తీర్పు… మీనాక్షి నటరాజన్ కేసులో కీలకం..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions