.
Subramanyam Dogiparthi … Man vs Woman !? సృష్టిలో ఎవరు గొప్ప ? పురుషుడా స్త్రీయా ?! నిస్సందేహంగా స్త్రీయే గొప్ప . Woman is a multi-tasker . పురుషుడు ఏదయినా ఒక పని మాత్రమే చేయగలడు . ఈ కాన్సెప్ట్ మీద తీయబడిన సినిమా ఈ మిస్టర్ పెళ్ళాం . ఇలాంటి కాన్సెప్టు తోనే 2005 లో బాపు దర్శకత్వంలోనే రాధా గోపాళం వచ్చింది . రెండు సినిమాలూ హిట్టయ్యాయి .
ఇంగ్లీషులో వచ్చిన Mr Mom స్ఫూర్తితో ముళ్ళపూడి వెంకట రమణ మన తెలుగు సినిమా కధను నేసారు . తదనుగుణంగా బిర్రయిన స్క్రీన్ ప్లేని కూడా ఆయనే తయారు చేసారు . ఈ సినిమాలో ఆయన మార్క్ డైలాగులు చాలానే ఉన్నాయి . ముఖ్యంగా ఏవియస్ అనే తుత్తి అనే మాట . ఈరోజుకీ చాలా పాపులర్ . ఆ తర్వాత ఆమనికి సివంగి అనే నిక్ నేం .
Ads
వైకుంఠంలో మొదలయి మళ్ళా వైకుంఠంలోనే ముగుస్తుంది సినిమా . క్లైమాక్సులో ఇద్దరూ ఒకటే అంటూనే మగవారు ఆడవారి కాళ్ళు లాగి పడేస్తారు . Men suffer from inferiority complex . భార్యలు తెలివయిన వారని ఒప్పుకోవటానికి పురుషాహంకారం అడ్డమొస్తుంది . ఇదే టూకీగా కధ .
కధ రొటీనే అయినా చెప్పేది బాపు- రమణలు కాబట్టి కళాత్మకంగా ఉంటుంది . ముఖ్యంగా ఆమని , ఆమె నటించిన ఝాన్సీ పాత్ర . అద్భుతంగా నటించింది ఆమని . ఆమెకు గొప్ప బ్రేక్ ఇచ్చిన సినిమా . బాపు సినిమాలు అయిన ఈ మిస్టర్ పెళ్ళాం కానివ్వండి లేదా ముత్యాల ముగ్గు , గోరంత దీపం , పెళ్ళి పుస్తకం , రాధా గోపాళం కానివ్వండి స్త్రీ ఔన్నత్యాన్ని గొప్పగా అవిష్కరించారు .
సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులు ఈరోజుకీ మరచిపోరు . ఉదాహరణకు అన్నపూర్ణ ఫుడ్ కార్పోరేషన్ బోర్డ్ మీటింగులో చైర్మనుకు ఆమని సలహాలను ఇచ్చే సీన్ . ప్రతీ ఫ్రేమూ బాపు కుంచె నుండి జలజలా జారిన పెయింటింగ్ లాగా ఉంటుంది .
జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయింది . తుత్తి అనే డైలాగుతో ప్రేక్షకుల బుర్రల్లో తిష్ట వేసుకున్న ఏవియస్ కు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది .
ప్రధాన పాత్రల్లో రాజేంద్రప్రసాద్ , ఆమని , గుండు సుదర్శన్ , యం బి కె వి ప్రసాదరావు , జెన్నీ , తనికెళ్ళ భరణి , ధర్మవరపు సుబ్రమణ్యం , పిల్లలుగా మాస్టర్ ఉదయ్ , బేబీ అనూరాధ తదితరులు నటించారు .
కీరవాణి సంగీత దర్శకత్వంలో ఆరుద్ర , వేటూరి వ్రాసిన పాటలకు బాలసుబ్రమణ్యం , చిత్ర చాలా శ్రావ్యంగా పాడారు . బాపు మార్క్ చిత్రీకరణ . అడగవయ్య అయ్య గారి ఎక్కువేమిటో అంటూ సాగే పాట వైకుంఠంలో రాజేంద్రప్రసాద్ , ఆమని మీద చాలా బాగుంటుంది .
రాదే చెలీ నమ్మరాదే చెలీ పాట ఆమని మీద అందంగా ఉంటుంది . బాపు సినిమాలో ఓ తోట పాట ఉండాల్సిందే కదా ! మాయదారి కృష్ణయ్య ఎంతటి వాడో చక్కగా ఉంటుంది . రాజేంద్రప్రసాద్ , ఆమని మీద డ్యూయెట్ సొగసు చూడతరమా రొమాంటిగ్గా ఉంటుంది . ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం మమ్మీ పోయి డాడీ వచ్చె ఢాం ఢాం ఢాం అంటూ సాగే పాట రాజేంద్రప్రసాద్ , పిల్లల మీద హుషారు హుషారుగా సాగుతుంది .
గవర పార్ధసారధి నిర్మాత . బాపు దర్శకత్వంలో 1993 సెప్టెంబరులో వచ్చిన ఈ సినిమా గొప్ప క్లాసిక్ గా నిలిచిపోయింది . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి . ఆల్రెడీ చూసి ఉన్నా సరే ఆ ఆమని కళ్ళ కోసం మళ్ళా చూడొచ్చు …
Share this Article