.
ఒక కథనం కనిపించింది… అది సూపర్ స్టార్ కృష్ణ తొలినాళ్లలో చేసిన సాహసాలు, కష్టాల గురించి..! తను సాహసి, తన టెంపర్‌మెంట్‌కు దీటైన స్టార్ తెలుగులో లేడు… అది నిజం… ఐతే ఆ కథనంలో బాగా నచ్చిన పేరా ఒకటుంది… కథనం మధ్యలో వస్తుం అది, మొత్తం చదవండి… తను డెయిలీ పేపర్లు తీసుకొచ్చే ఓ కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి వెళ్లడం గురించి!!
అల్లూరి సీతారామరాజు’ వంటి సంచలన విజయం తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో ఊహించని మలుపు ఎదురైంది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌లో వరుసగా సినిమాలు చేసినా, ఏ ఒక్కటీ బాక్సాఫీస్ వద్ద నిలవలేదు. అన్నీ అల్లూరి తరహాలో తీయలేరు, కానీ పోలిక వస్తుంది… అదుగో అలా… సరిగ్గా 1975 నాటికి పరిస్థితి ఎలా మారిందంటే… అప్పటివరకు ఏడాదికి 15 సినిమాలు, రోజుకు మూడు షిఫ్టులతో తీరిక లేకుండా గడిపిన కృష్ణ చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఇంచుమించు 15 సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో, ఏ ఒక్క నిర్మాత కూడా ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అదొక కష్టకాలం తనకు…
Ads
చేతిలో ఉన్న ఏకైక సినిమా ‘రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్’ షూటింగ్ చాలా నత్తనడకన సాగుతోంది. 1975 ద్వితీయార్ధంలో పూర్తిగా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి.
ఆ సంకట సమయంలో ‘పాడిపంటలు’ ప్లాన్!
ఇక తన కోసం తనే ఒక సినిమా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న కృష్ణ, తన సొంత బ్యానర్ ‘పద్మాలయ’ పై సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. దర్శకుడు పి.సి.రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో, ప్రముఖ రచయిత ఆత్రేయను పిలిచి స్క్రిప్ట్ వర్క్ అప్పగించారు. అయితే, నెల రోజులు శ్రమించిన తర్వాత ఆత్రేయ మధ్యలోనే బయటకు వెళ్లిపోతూ… “ఇందులో పాడీ లేదు, పంటా లేదు” అని తేల్చిచెప్పేశారు!
అప్పుడు మహారథిని రంగంలోకి దించారు. పి.సి.రెడ్డి, మహారథి, కృష్ణ ముగ్గురూ కలిసి కూర్చుని చక్కటి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మహారథి రాసిన మాటలు కృష్ణను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విజయవాడలో షూటింగ్… వెంటాడుతున్న విషాదాలు
విజయవాడ, గుడివాడ మధ్య ఉన్న మానికొండ గ్రామంలోని ఒక మోతుబరి రైతు ఇంట బేస్ చేసుకుని, 1975 అక్టోబర్ 1న లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
మొదటి రోజు షూటింగ్ ముగించుకుని రాత్రి పది గంటలకు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మద్రాసు నుండి ఒక చేదు వార్త అందింది. కృష్ణకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన గురువు ఆదుర్తి సుబ్బారావు కన్నుమూశారు. ఆ సమయంలో రాత్రిపూట ప్రయాణించడానికి రైళ్లు లేవు, కార్లో వెళ్తే అంత్యక్రియలకు సమయానికి చేరుకోవడం కష్టం.
- అయితే, ఆ సమయంలో చెన్నై నుండి విజయవాడ వచ్చి, పేపర్లు దించుకుని మళ్లీ వెళ్లే ‘ది హిందూ’ పేపర్ ఫ్లైట్ గురించి కృష్ణకు ఒక ఆలోచనొచ్చింది. తనకున్న పరపతిని ఉపయోగించి, ఆ కార్గో ఫ్లైట్లోనే విజయనిర్మలతో కలిసి మద్రాసుకు పయనమయ్యారు. ఆదుర్తి అంత్యక్రియలలో పాల్గొని, రెండు రోజులకు తిరిగి మానికొండ షూటింగ్‌కు చేరుకున్నారు.
(నిజమే, అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర ముఖ్య నగరాలకు హిందూ పేపర్లను డకోటా ఫ్లయిట్లలో పంపించేవారట…)
షూటింగ్ కొనసాగుతుండగానే మరో దిగ్భ్రాంతికర వార్త. పరిశ్రమలో కృష్ణ పెద్దదిక్కుగా భావించే, ఆయన ఎంతో ఇష్టపడే చక్రపాణి కూడా తుదిశ్వాస విడిచారు. తాము నటిస్తున్న, నిర్మిస్తున్న సినిమాలు విడుదల కాకముందే ఆ ఇద్దరు దిగ్గజాలు కన్నుమూయడం కృష్ణను తీవ్ర వేదనకు గురిచేసింది. చక్రపాణి నిర్మాతగా ఉన్న ‘రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్’, ఆదుర్తి దర్శకత్వంలో చేసిన చివరి చిత్రం ‘గాజుల కిష్టయ్య’ అప్పటికీ విడుదల కాలేదు.
నవయుగ చంద్రశేఖర్ రావు హెచ్చరిక… కృష్ణ తెగింపు!
ఇన్ని మానసిక క్షోభల మధ్యే ‘పాడిపంటలు’ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని పగలు, రాత్రి కష్టపడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. పద్మాలయ సంస్థ నుంచి ‘పాడిపంటలు’ సంక్రాంతికి విడుదల అని ప్రకటన వెలువడింది.
అది చూసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, కృష్ణ శ్రేయోభిలాషి నవయుగ చంద్రశేఖర్ రావు కృష్ణ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
- “నువ్వు ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నావు. అటు ఎన్టీఆర్ ‘వేములవాడ భీమకవి’, ఇటు శోభన్ బాబు ‘పిచ్చిమారాజు’, నాగేశ్వరరావు అమెరికా నుంచి తిరిగొచ్చాక చేస్తున్న ‘మహాకవి క్షేత్రయ్య’ కూడా సంక్రాంతికే వస్తున్నాయి. వాళ్ళంతా ఫామ్‌లో ఉన్నారు, నువ్వు రిస్క్ వద్దు… సినిమాను ఫిబ్రవరికి పోస్ట్‌పోన్ చెయ్యి” అని గట్టిగా చెప్పారు.
అన్ని వైపుల నుంచి హెచ్చరికలు వస్తున్నా కృష్ణ వెనకడుగు వేయలేదు. “నా నిర్ణయంలో మార్పు లేదు” అని స్పష్టం చేశారు. దాంతో చంద్రశేఖర్ రావు విసుగ్గా “అయితే నీ ఖర్మ” అని చెప్పి వెళ్లిపోయారు. కృష్ణ అంటే అంతే, తను ఒకసారి ఫిక్స్ అయిపోతే, తన మాట తనే వినడు…
అంచనాలను తలకిందులు చేసిన విజయం!
అనుకున్న ప్రకారమే 1976 జనవరి 14న ‘పాడిపంటలు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సంక్రాంతి బరిలో ‘వేములవాడ భీమకవి’, ‘పిచ్చిమారాజు’ సినిమాలు కూడా నిలిచాయి (ఆదుర్తి మరణంతో ‘మహాకవి క్షేత్రయ్య’ వాయిదా పడింది).
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘పాడిపంటలు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కృష్ణ నమ్మకం నిజమైంది!
ఈ సినిమా విజయంతో కృష్ణ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ చిత్ర విజయోత్సాహంలో భాగంగానే మంగళగిరి సమీపంలో ఒక స్టూడియో నిర్మించాలని తొలుత స్థలం కూడా పరిశీలించారు కృష్ణ. కానీ చివరకు హైదరాబాద్‌లోనే స్టూడియో నిర్మించడం ఉత్తమమని భావించి అక్కడే పద్మాలయ స్టూడియోకు శ్రీకారం చుట్టారు.
‘పాడిపంటలు’ తెచ్చిపెట్టిన ఆ అఖండ విజయం తర్వాత, సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు తెరపై వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు!
Share this Article