.
కామెడీ కథలోనో, సంభాషణల్లోనో, కథనంలోనో, దృశ్యంగానో ఉండొచ్చు… కానీ మిస్టర్ మిడిల్ క్లాస్ చాలా డిఫరెంట్… ఎంత అంటే… మరీ బక్కపలుచని ధనరాజ్ యముడి వేషం వేయడం! పోనీలే, దర్శకుడు అలాగైనా నవ్వించాడు, ఆ వేషంలో ధనరాజ్‌ను చూస్తుంటేనే నవ్వొచ్చింది…
నిజానికి రాజేంద్రప్రసాద్ వెంకటేశ్వరస్వామి పాత్రలో అస్సలు ఫిట్ కాలేదు… సేమ్, శ్రీకాంత్… ఇక్కడ లయ గురించీ చెప్పుకోవాలి… ఒక పాత నటి, రీఎంట్రీ తరువాత ఒకేరోజు రెండు సినిమాల రిలీజు అంటే విశేషమే… కానీ రెండూ రాంగ్ చాయిస్… ఈ సినిమా కూడా ఆమెకు అక్కరకొచ్చేది కాదు, ఆమెకు కాస్త మంచి ఇమేజ్ ఉంది, దీంతో అదీ పోతుంది, రీఎంట్రీ ఇచ్చినంతసేపు పట్టదు తిరిగి వెళ్లిపోవడానికి ఇలాగే పాత్రలు ఎంచుకుంటే..!
Ads
సినిమా విషయానికి వస్తే… ఒక మంచి సినిమా గొప్ప కథతో కాదు, ఆ కథను ఎంత నమ్మి చెబుతుందనే దానితో నిలబడుతుంది. మిస్టర్ మిడిల్ క్లాస్ చూసిన తర్వాత కలిగే మొదటి భావన ఇదే. మధ్యతరగతి మనిషి జీవితాన్ని, అతని బాధలను, దేవుడితో అతని సంఘర్షణను కేంద్రంగా పెట్టుకున్న ఈ కథ నిజానికి చాలా పాత స్టోరీలైన్…
చాలామంది చాలా సినిమాలు తీశారు… కానీ ఈ పాత కథనే కొత్తగా ఎలా చెబుతావు అనేదే అసలు ప్రశ్న… కానీ ఇక్కడ దర్శకుడు అదే పాత కథను, అదే పాత కథనం స్టయిల్‌లో, అదే పాత నటులతో లాక్కొచ్చాడు… చివరకు ఏం చేయాలో తనకే అర్థం గాకుండా మరీ చీప్ కామెడీ వైపు వెళ్లిపోయి బోల్తాపడ్డాడు…
బొచ్చెడు మంది కమెడియన్లు- కానీ గందరగోళం… అంతమందిని సమర్థంగా వాడుకునే అవకాశాలను దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు…
దేవుడు నిజంగానే మనిషి జీవితంలో జోక్యం చేసుకుంటే ఏమవుతుంది? కష్టాల్లో ఉన్న ఒక మధ్యతరగతి వ్యక్తి దేవుడిని నిలదీస్తే దేవుడు ఏమి సమాధానం చెబుతాడు..? ఈ రెండు ప్రశ్నల చుట్టూ కథను నడిపి ఉంటే ఆసక్తికరమైన డ్రామా అయ్యేది… కానీ దర్శకుడు ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్‌ను పక్కనబెట్టి, పాతకాలపు కామెడీ ట్రాక్‌లతో కథను దారి మళ్లించాడు…
వెంకటరమణ (శ్రీకాంత్) ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అప్పులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన అతను తనను పట్టించుకోని దేవుడిపైనే కోపం పెంచుకుంటాడు. చివరకు దేవుడి ఫోటోను అటకపై పడేస్తాడు. అదే సమయంలో అతనికి ఒక ఆలయంలో సెక్యూరిటీ ఉద్యోగం రావడం, అక్కడ జరిగిన పరిణామాలతో దేవుడు అతని జీవితంలోకి ప్రవేశించడం, ‘మహిమల పుస్తకం’ చుట్టూ కథ తిరగడం సినిమా ప్రధాన కథాంశం…
ఈ సినిమా అసలు సమస్య కథలో లేదు. కథను చెప్పిన విధానంలో ఉంది. మధ్యతరగతి జీవితంలోని బాధలను ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేయాల్సిన చోట, పాత్రలను సరైన రీతిలో నిర్మించలేదు. వెంకటరమణ ఎదుర్కొనే సమస్యలు మనసును కదిలించాల్సింది పోయి, టీవీ సీరియల్ సన్నివేశాల్లా కనిపిస్తాయి. పాత్రల ప్రయాణానికి సరైన ఎస్టాబ్లిష్‌మెంట్ లేకపోవడంతో ప్రేక్షకుడు వాటితో కనెక్ట్ కాలేడు.
స్క్రీన్‌ప్లే కూడా ఎక్కడా స్థిరంగా ముందుకు సాగదు. ఒకవైపు భక్తి, మరోవైపు ఫాంటసీ, మధ్యలో కామెడీ… ఇలా సినిమా తన జానర్‌ను తానే నిర్ణయించుకోలేక గందరగోళంలో పడుతుంది.
జి. నాగేశ్వరరెడ్డి సినిమాల్లో ఒకప్పుడు పనిచేసిన కామెడీ ఫార్ములా ఇప్పుడు మాత్రం పూర్తిగా పాతబడిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులు, మహిళా పాత్రలను తక్కువ చేసి చూపించే సన్నివేశాలు, బలవంతంగా ఇరికించిన వెకిలి కామెడీ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్.
దేవుడి చుట్టూ తిరిగే కథకు అవసరమైన హుందాతనం కనిపించదు. భక్తి, హాస్యం కలిసి నడవొచ్చు. కానీ వాటి మధ్య సమతుల్యత అవసరం. ఈ సినిమాలో అదే పూర్తిగా మిస్ అయింది.
శ్రీకాంత్ తన పాత్రను నిజాయితీగా చేయడానికి ప్రయత్నించాడు… లయ కూడా తనకు ఇచ్చిన పాత్ర పరిధిలో బాగానే నటించింది. రాజేంద్రప్రసాద్ అనుభవం కనిపిస్తుంది… వెన్నెల కిషోర్ పర్లేదు…
సినిమా టేకింగ్ కూడా పాతతరహాలోనే సాగుతుంది. విజువల్‌గా కొత్తదనం కనిపించదు. సన్నివేశాల నిర్మాణం, ఎడిటింగ్, కథనం అన్నీ కలిపి టీవీ సీరియల్‌ను గుర్తు చేస్తాయి. ఫాంటసీ అంశాలు కూడా నమ్మించేలా కాకుండా, యాంత్రికంగా అనిపిస్తాయి.
ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం దేవుడు మనిషి జీవితాన్ని మార్చగలడా అనే ప్రశ్న. కానీ దానికి బదులుగా మహిమలు, మంత్రాలు, మాయాజాలం వైపు కథ వెళ్లిపోయింది.
దేవుడు ప్రత్యక్షమైనా వ్యవస్థలోని అవినీతి, మధ్యతరగతి మనిషి ఆర్థిక సంక్షోభం, సామాజిక అసమానతలను మార్చడం అంత సులభం కాదనే వాస్తవాన్ని కథగా మలిచి ఉంటే ఈ సినిమా గుర్తుండిపోయేదేమో. కానీ ఆ అవకాశాన్ని దర్శకుడు వదిలేశారు.
మిస్టర్ మిడిల్ క్లాస్ పూర్తిగా చెడ్డ సినిమా కాదు. కానీ మంచి సినిమా అయ్యే అన్ని అవకాశాలను తనే చేతులారా వదులుకున్న సినిమా… “దేవుడు కథలోకి దిగొచ్చాడు… కానీ దర్శకుడు మాత్రం కాలంతో పాటు దిగిరాలేదు. అందుకే ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మంచి కాన్సెప్ట్‌గా మిగిలిపోయింది… మంచి సినిమాగా కాదు…”
Share this Article