Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…

July 22, 2026 by M S R

.

Maram Dilip Kumar … ❎ ముట్టడి పోరాటాలు అన్నీ మైలేజీ పోరాటాలే ❎

నేను 2003 నుండి 2007 వరకు CPM విద్యార్థి విభాగం SFI లో చాలా hyper active గా పనిచేశాను.. ఆయేషా మీరా హత్య కేసు, శ్రీలక్ష్మి హత్య – మనోహర్ లాంటి ఎన్నో కేసుల్లో రోడ్ల మీద ధర్నా ప్రదర్శనలు చేసి, పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాను..

Ads

విజయవాడ నగరంలో ఎక్కడ CM ప్రోగ్రాం జరిగినా, వీడు బయట ఉంటే ఆ ప్రోగ్రామ్ లను డిస్టర్బ్ చేస్తాడని.. పోలీసులు నా కాలేజీకి వచ్చి, క్లాస్ నుండి తీసుకువెళ్లి, సాయంత్రం దాకా మాచవరం పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు.. రోజూ సాయంత్రం ఇప్పుడు MBVK (మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం) ఉన్న స్థానంలో.. అప్పుడు ఉన్న CPM ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీసు మా అడ్డాగా ఉండేది..

2006 లో.. SFI సంక్షేమ హాస్టళ్ల సమస్యల మీద ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించింది.. రాష్ట్రం మొత్తంలో సైకిల్ యాత్ర చేస్తూ.. రోజుకి ఒక SC/ST/BC సంక్షేమ హాస్టల్ సందర్శించి అందులో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను record చేసుకుంటూ, మా observation లు అన్నీ ప్రభుత్వానికి విజ్ఞాపన రూపంలో సమర్పించాలి.. అనేది ప్రోగ్రామ్..

3, 4 నెలలు అందరం కష్టపడి, వారివారికి నిర్దేశించిన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి, పిల్లలతో మాట్లాడి, అక్కడే భోజనం చేసి, అక్కడే నిద్ర చేసి.. ఒక సమగ్రమైన report తయారు చేసుకున్నాం..
SC మాల కులంలో పుట్టినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కావడంతో.. నాకు అప్పటి దాకా సంక్షేమ హాస్టల్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు.. విద్యార్థులకు సమస్యలు ఉంటాయి అనేది కూడా తెలియదు..

  • కింద పడుకుంటే ఎలుకలు వచ్చి కాలి వేళ్ళను కొరుక్కు తినడం, కాక్రోచ్ లు చెవుల్లో దూరడం, పిల్లల వస్తువులు పెట్టుకునే ట్రంక్ పెట్టెల వెనకాల పాములు చేరి, దగ్గరకు వెళ్ళిన పిల్లలను కాటేయడం, పిల్లలు అందరూ గజ్జి తామర లాంటి అంటువ్యాధులతో బాధపడుతూ ఉండడం, పురుగులు పట్టిన అన్నం, నీళ్ళ పప్పుచారులు, కుళ్ళిపోయిన గుడ్లు, పుచ్చిపోయిన కూరగాయలతో కూరలు, తలుపులు లేని అమ్మాయిల హాస్టళ్ల బాత్రూములు, పిల్లలే కడుక్కునే లాటిన్లు.. లైంగిక వేధింపులకు పాల్పడే వార్డెన్లు, హాస్టల్ ఉద్యోగులు.. ఇవన్నీ నా ఊహకు కూడా అందనివి..

ఎన్నో సందర్భాల్లో కళ్లలో నీళ్లు తిరిగేవి.. ఆ బాధ నుండి ఆవేశం పుట్టేది.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం ఎంత పెద్ద పోరాటం అయినా చేయాలి అనే కసి ఉండేది.. నాలో ఆ కసి నన్ను CPM పార్టీ పెద్దలకు చాలా దగ్గర చేసింది.. వాళ్ల నిజస్వరూపాలను బాగా దగ్గర నుండి చూసే అవకాశం నాకు కలిగించింది..

👉 ఇక ఆరోజు రానే వచ్చింది.. 2006 డిసెంబర్ 13..
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి.. ట్యాంక్ బండ్ దాకా ప్రదర్శన.. ఆ తర్వాత ముఖ్య నాయకులు CM రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి విజ్ఞాపన పత్రం అందించాలి.. అనేది ముందుగా అనుకున్న ప్లాన్..

విజయవాడ నుండి, మేము సందర్శించిన హాస్టళ్ల నుండి వందల మంది విద్యార్థులను (8,9,10 తరగతి చిన్నపిల్లలను) తీసుకుని, ట్రైన్ ఎక్కించి హైదరాబాద్ SVK చేరుకున్నాం.. వేల మంది విద్యార్థులు పోగయ్యారు.. వారితో కలిసి బయల్దేరి ప్రదర్శనగా నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నాం..

మాకు కేవలం ప్రదర్శన ర్యాలీ అని మాత్రమే చెప్పారు.. కానీ అక్కడ నాయకులు మధ్యలో “అసెంబ్లీ ముట్టడి” అని ప్రకటించారు.. Lower ట్యాంక్ బండ్ నుండి వేల మంది విద్యార్థులను అసెంబ్లీ వైపు నడిపించారు.. దారిలో పోలీసులు అడ్డగించారు.. ముందు వరసలో ఉన్న నాయకులు ప్రతిఘటించారు.. తోపులాటలకు దిగారు..

వెనక ఉన్న మాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. ముందు వరసలో ఉన్న నాయకులను లాక్కుని ఎత్తుకుని తీసుకెళ్లి పోలీసు వ్యాన్ లలో కూర్చోబెట్టారు.. వెనుక ఉన్న మా మీద మాత్రం ఘోరంగా లాఠీ ఛార్జ్ చేశారు.. చిన్న పిల్లలు గాయపడ్డారు.. ఎటు దొరికితే అటు పరుగులు తీశారు.. కింద పడి రోడ్డు దెబ్బలు తగిలాయి.. చాలా మంది పిల్లలు పోలీసులు వేసిన ఇనుప కంచెల్లో చిక్కుకుని, ఒళ్ళు మొత్తం గాయాలపాలు అయ్యారు…

ఎలాగోలా.. మళ్ళీ మనం బాధ్యత వహించి తీసుకొచ్చిన పిల్లలను పోగు చేసుకుని, కాచిగూడ స్టేషన్ కు తీసుకుని వచ్చి, వొంటి నిండా గాయాలతో, చిరిగిపోయిన బట్టలతో రైలు ఎక్కాము.. శరీరం మొత్తం అలసి పోవడంతో ఆ పిల్లలు అంతా.. ప్రదర్శనకు వాడిన ఫ్లెక్సీలను కింద పరుచుకుని, పాపం ఆదమరిచి నిద్రపోయారు..

ప్రభుత్వాలకు.. ప్రతిపక్షాలకు మధ్యలో నలిగిపోయిన ఆ చిన్న పిల్లలను చూస్తే మనిషి అన్నవాడికి ఎవడికైనా గుండెలు బద్దలు అవ్వడం ఖాయం..

  • తర్వాత రోజు.. CPM నాయకుల సమావేశం.. మొత్తం ఆనందంలో ఉన్నారు.. ఆ ఆనందానికి కారణం.. మనం పోరాడిన సమస్య తీరిందని కాదు.. మంచి మైలేజ్ వచ్చింది అని.. పేపర్ కటింగుల్లో రక్తం ఓడుతున్న విద్యార్థులను పోలీసులు లాక్కెళ్ళడం, తరిమి కొట్టడం లాంటి ఫోటోలు చూసి మురిసిపోతున్నారు.. అయ్యో పిల్లలు ఘోరంగా బాధింపబడ్డారు.. సమస్య తీరలేదు.. తర్వాత ఏం చేయాలి.. అనే చర్చ లేనే లేదు.. అక్కడితో ఆ ఉద్యమం ఇక ముగిసిపోయినట్టు ప్రకటించారు..

నాకు ఏం జరుగుతుందో అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. వీళ్లకు విద్యార్థుల సమస్యలు తీర్చడం లక్ష్యం కానే కాదు.. వాటిని వాడుకుని, పార్టీకి మైలేజ్ పెంచుకోవడం మాత్రమే లక్ష్యం అని స్పష్టంగా అర్థం అయ్యింది.. మాములు ధర్నా ప్రదర్శన చేస్తే.. ఇంత జరిగేది కాదు.. పెద్దగా మైలేజ్ వచ్చేది కాదు..
కాబట్టే “అసెంబ్లీ ముట్టడి” అని ప్రకటించారు..

  • అసెంబ్లీనీ, పార్లమెంటుని ముట్టడిస్తాము అని ఎవడు వెళ్ళినా పోలీసులు కొట్టి తీరతారు.. మన దేశంలో కాబట్టి పోలీసులు లాఠీ ఛార్జ్ తో వదిలేస్తారు.. అదే ఈ కమ్యూనిస్టుల కలల రాజ్యం అయిన చైనాలో అయితే.. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తారు.. చైనా Tiananmen Square లో ప్రదర్శనకు వచ్చిన విద్యార్థుల మీద చైనా మిలటరీ కాల్పులు జరిపి వందల మందిని చంపడం తెలిసిందే కదా…

👉 తర్వాత పలు సందర్భాల్లో నేను గమనించాను.. కమ్యూనిస్టులను ప్రజలు మర్చిపోతున్నారు.. అన్నప్పుడల్లా.. ఇలా విద్యార్థుల సమస్యలు, మునిసిపల్ కార్మికుల సమస్యల మీద కార్యక్రమం అని చెప్పి, దాన్ని అసెంబ్లీ ముట్టడి, కలెక్టరేట్ ముట్టడి, పేరుతో పోలీసులను రెచ్చగొట్టి, లాఠీ ఛార్జ్ లు చేయించుకోవడం.. ఆ రక్తశిక్త గాయాలతో పోలీసులు ఈడ్చుకెళ్లే ఫోటోలు చూసి, మైలేజ్ వచ్చేసింది అని మురిసిపోవడం.. ఇదే తంతు.. కమ్యూనిస్టుల ఈ మోసపూరిత బుద్ధి చూసాక నాకు విరక్తి కలిగింది..

  • 👉 ఇక ముదిగొండలొ రైతుల ధర్నా పేరుతో కమ్యూనిస్టు పార్టీలు CPI, CPM, CPI-ML అన్నీ కలిసి ఉమ్మడి కార్యక్రమం చేశాయి.. దాని మీద పోలీసుల కాల్పులు జరిగినపుడు.. ప్రదర్శన జరుగుతున్న చోట చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా తూటాలకు బలయ్యాడు.. అతను మా పార్టీ వాడు అంటే.. కాదు మా పార్టీ వాడు అని.. పోటాపోటీగా పార్టీ జండాలు ఆ శవం మీద కప్పుతూ.. కాట్ల కుక్కలలాగా పోట్లాడుకున్నారు కమ్యూనిస్టు నాయకులు.. ఎక్కువ మంది ఏ పార్టీ వాళ్ళు చనిపోతే వాళ్ళకే ఎక్కువ మైలేజ్ వస్తుంది కాబట్టి.. శవాలను claim చేసుకోవడానికి అన్నమాట… ఇది చూసాక నాకు కమ్యూనిస్టులు అంటేనే అసహ్యం కలిగింది..

✅ అప్పటి నుండి.. ఎవడైనా అసెంబ్లీ ముట్టడి, పార్లమెంటు ముట్టడి అంటున్నాడు.. అంటే.. వాడి ఉద్దేశం ఏంటి.. అనే అంశంలో నాకు చాలా క్లారిటీ ఉంది.. పోలీసులను రెచ్చగొట్టాలి.. తన్నులు తినాలి.. మైలేజ్ పెంచుకుని.. నాయకులుగా ఎదగాలి.. అంతే.. ఈ ముట్టడులు అనేవి సమస్యకు ఏ విధంగా పరిష్కారం కాదు..

అసలు అసెంబ్లీ, పార్లమెంటు దాకా చేరుకునే అవకాశం లేదు అనేది కూడా ప్రతీ నాయకుడికి తెలుసు.. అసెంబ్లీ, పార్లమెంటుని ముట్టడించడం అంటే.. దేశ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ స్థాయిలో అవమానించడమే కాబట్టి.. ఏ దేశం అయినా.. ఏ ప్రభుత్వం అయినా చట్టసభల ముట్టడి అడ్డుకుని తీరుతుంది.. అనేది ప్రతీ నాయకుడికీ తెలుసు..

కానీ వాళ్ళు అదే చేస్తారు.. వాళ్ళు నిజంగా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు.. అనుకునే అమాయకులు మాత్రం వెర్రివాళ్ళు.. ప్రజల కష్టాలు చూసి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చూసి, ఉడుకురక్తం ఉప్పొంగి ఈ సమాజాన్ని మార్చాలి అని తపన, ఆవేశం కలిగిన.. అప్పట్లో నాలాంటి యువకులే.. వాళ్ళ మైలేజ్ ఉద్యమాలకు సమిధలు..
చైతన్య కుర్రపాటి

అందుకే రంగనాయకమ్మ గారు ఒక మాట అంటారు. ” కమ్యునిష్టు పార్టీలన్నీ రివిజనిష్టు పార్టీలే” అని…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్
  • అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
  • ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!
  • డొల్ల మాటల వ్యాపారి..! మళ్లీ తెలంగాణ యాసపై అదే ఏడుపు !!
  • ఢిల్లీ అల్లర్ల వైఫల్యానికి, కల్లోలానికి ఎవరు అసలు బాధ్యులు..?
  • అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions