.
శ్రీదేవి వస్తోంది… కానీ వెండితెరపైకి వస్తుందా? శ్రీదేవి… ఈ పేరు వినగానే ఒక తరం ప్రేక్షకుల జ్ఞాపకాలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చేస్తాయి. ‘చందినీ’ చిరునవ్వు నుంచి ‘మిస్టర్ ఇండియా’లోని హవా హవాయి వరకు… ‘చాల్‌బాజ్’ అల్లరి నుంచి ‘సద్మా’లోని విషాదం వరకు… ఒకే నటిలో ఇన్ని భిన్నమైన కోణాలను చూసిన ప్రేక్షకులు చాలా అరుదు.
శ్రీదేవి మన మధ్య లేకపోయినా… ఆమె మాత్రం తెర మీద నుంచి, మన మనస్సుల నుంచి ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఇప్పుడు ఆమె జయంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పెట్టిన ఓ పోస్టు మరోసారి శ్రీదేవి పేరును వార్తల్లోకి తెచ్చింది.
Ads
‘Empress – The Definitive Biography of Sridevi’ పుస్తక కవర్‌ను షేర్ చేస్తూ… ‘‘మీరు ఎంతో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది’’ అంటూ ఆమె రాసింది. ఇంతవరకు అంతా సాధారణమే. కానీ…

‘శ్రీదేవి త్వరలో వస్తోంది’ అనే మాటే అసలు ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే ఆ పోస్టును బోనీ కపూర్ కూడా రీపోస్ట్ చేయడంతో… సినీ వర్గాల్లో సహజంగానే ఊహాగానాలు మొదలయ్యాయి.
శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం వస్తోంది అన్నది మాత్రం కొత్త విషయం కాదు. ‘Empress’ పుస్తకాన్ని 2023లోనే ప్రకటించారు. ఇప్పుడు అది మళ్లీ తెరపైకి రావడంతో ప్రియాంక పోస్టు ఒక ప్రచార కార్యక్రమంలో భాగమే కావచ్చు. కానీ ఆమె ఎంచుకున్న పదజాలం మాత్రం ఊహలకు తలుపు తీసింది.
పుస్తకంగా శ్రీదేవి వస్తోంది… మరి సినిమాగా కూడా వస్తుందా?
ఇక్కడే అసలు ప్రశ్న. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. 2024లోనే బోనీ కపూర్ శ్రీదేవి బయోపిక్‌పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. శ్రీదేవి చాలా ప్రైవేట్ వ్యక్తి అని, ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలని, తాను బతికున్నంతకాలం ఆమె జీవితంపై బయోపిక్‌ను అనుమతించబోనని స్పష్టంగా చెప్పారు.
అందువల్ల ఇప్పుడు ప్రియాంక పోస్టును చూసి ‘శ్రీదేవి బయోపిక్ ఖాయం’ అని చెప్పడం తొందరపాటు. కానీ… ఇండస్ట్రీలో ఓ విషయం ఉంది. అక్కడ గడ్డి పరక కదిలినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని చెబుతారు. ప్రియాంక చోప్రాను కూడా అంత తేలిగ్గా అండర్ ఎస్టిమేట్ చేయలేం. అయితే నిజంగా శ్రీదేవి బయోపిక్ వస్తే… అది మరో ప్రశ్నను తెస్తుంది.
శ్రీదేవి జీవితం ఒక సినిమాకు సరిపడే కథేనా?
సావిత్రి జీవితాన్ని తీసుకుంటే కథలో సహజంగానే ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. బాలనటిగా ఎదగడం, మహానటిగా అవతరించడం, వ్యక్తిగత జీవితంలోని మలుపులు, సంబంధాల్లోని సంక్లిష్టత, చివరికి విషాదాంతం… అక్కడ సినిమా కోసం కావాల్సిన ‘కాన్‌ఫ్లిక్ట్’ దొరుకుతుంది. శ్రీదేవి విషయంలో కథ వేరుగా ఉంటుంది.
నాలుగేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన బాలనటి… దక్షిణాది సినిమాల్లో స్టార్‌గా ఎదిగి… హిందీ చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్‌గా మారి… ఒక దశలో హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న స్థాయికి చేరి… పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై… సంవత్సరాల తర్వాత ‘ఇంగ్లీష్ వింగ్లిష్’తో తిరిగి వచ్చి తన స్టార్‌డమ్ ఇంకా చెక్కుచెదరలేదని నిరూపించి… ‘మామ్’తో మరో అద్భుతమైన నటన ఇచ్చి వెళ్లిపోయిన నటి.
ఇది గొప్ప ప్రయాణమే. కానీ గొప్ప ప్రయాణం అంటే తప్పనిసరిగా గొప్ప బయోపిక్ అవుతుందని కాదు. శ్రీదేవి జీవితంలో ఆసక్తికరమైన వ్యక్తిగత అంశాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాలు ఉన్నాయి. బోనీ కపూర్‌తో ఆమె వివాహం ఉంది. కెరీర్‌లో వచ్చిన ఎత్తుపల్లాలు ఉన్నాయి. తల్లి మరణం తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రావడం ఉంది.
ఆమె మరణం కూడా ప్రేక్షక లోకాన్ని కుదిపేసిన ఘటన. కానీ బయోపిక్‌కు అవసరమైన సంఘర్షణను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదే అసలు సవాలు.
ఆమె అందం గురించి మాట్లాడొచ్చు. ఆమెపై వచ్చిన అందాల ఒత్తిడి గురించి మాట్లాడొచ్చు. ప్లాస్టిక్ సర్జరీల గురించి చర్చించొచ్చు. కానీ వాటిని కథకు ప్రధాన సంఘర్షణగా మార్చడం చాలా సున్నితమైన విషయం. అంతేకాదు, శ్రీదేవి తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకున్న వ్యక్తి. ఆమె గురించి ఇప్పటికే ఉన్న సమాచారం, జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు, సహచరుల మాటలు… ఇవన్నీ కలిపి ఒక కథనం తయారు చేయడం వేరు; రెండున్నర గంటల సినిమాకు కావాల్సిన నాటకీయ నిర్మాణం తయారు చేయడం వేరు.
అందుకే శ్రీదేవి బయోపిక్ అంటే… ‘ఎవరు శ్రీదేవిగా నటిస్తారు?’ కంటే ముందు ‘ఏ శ్రీదేవిని చూపిస్తారు?’ అన్న ప్రశ్న రావాలి. ఆమెను కేవలం అందమైన హీరోయిన్‌గా చూపిస్తే కథ చిన్నదైపోతుంది. ఆమెను కేవలం ‘భారతీయ సినీ చరిత్రలో తొలి మహిళా సూపర్‌స్టార్’గా చూపిస్తే అది డాక్యుమెంటరీలా మారిపోతుంది.
ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళితే… కుటుంబ అనుమతులు, వ్యక్తిగత గోప్యత, నిజాలు- ఊహాగానాల మధ్య గీత— ఇవన్నీ సమస్యలవుతాయి. ముఖ్యంగా బోనీ కపూర్ ఇంతకుముందు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుంటే ఈ బయోపిక్ ఊహాగానం మరింత ఆసక్తికరంగా మారుతుంది.
అయితే మరో కోణం కూడా ఉంది. శ్రీదేవిని ఎవరూ మరిపించలేరు. కానీ ఆమెను మళ్లీ తెరమీద ‘పూర్తిగా పునఃసృష్టించడం’ కూడా దాదాపు అసాధ్యం. ఎవరైనా ఆమె పాత్ర పోషించవచ్చు. కానీ శ్రీదేవి కాలేరు. ఆమె కళ్లలోని భావాన్ని, ఆ టైమింగ్‌ను, ఆ స్క్రీన్ ప్రెజెన్స్‌ను, ఒక్క క్షణంలో కామెడీ నుంచి విషాదానికి వెళ్లిపోయే ఆ నటనను కాపీ చేయడం అంత సులభం కాదు.
అందుకే ఒకవేళ ఎప్పుడైనా శ్రీదేవి బయోపిక్ వస్తే… అది శ్రీదేవిని ఇమిటేట్ చేసే సినిమా కాకుండా, శ్రీదేవి అనే అసాధారణ ప్రయాణాన్ని అర్థం చేసుకునే సినిమా కావాలి. ప్రియాంక చోప్రా పోస్టు ఇప్పటివరకు అంతకంటే ఎక్కువ చెప్పలేదు.
‘శ్రీదేవి త్వరలో వస్తోంది’ అనేది పుస్తకానికి సంబంధించిన మాట కావచ్చు. లేదా… ఎవరికి తెలుసు? బాలీవుడ్‌లో కొన్ని ప్రకటనలు ముందుగా రావు. ముందుగా చిన్న క్లూ వస్తుంది. తర్వాత ఓ పోస్టర్. ఆ తర్వాత ఓ ప్రకటన. చివరికి సినిమా.
కాబట్టి ప్రియాంక చోప్రా పోస్టును కేవలం పుస్తక ప్రచారంగా కొట్టిపారేయలేం. అదే సమయంలో దాన్ని బయోపిక్ ప్రకటనగా కూడా ఇప్పుడే ముద్ర వేయలేం. ఒక విషయం మాత్రం నిజం. శ్రీదేవి పేరుకు ఇప్పటికీ మార్కెట్ ఉంది.
ఆమెను మరిపించడం ఎవరి వల్లా కాదు. ఆమెను మళ్లీ తెరపైకి తీసుకురావడం మాత్రం ఎవరి వల్ల సాధ్యమవుతుందో చూడాలి. ప్రియాంక చోప్రా వేసిన ఆ చిన్న క్లూ నిజంగా ఏదైనా పెద్ద కథకు ముందుమాట అయితే… ‘శ్రీదేవి వస్తోంది’ అన్న మాటకు అసలు అర్థం ఏమిటో త్వరలో తెలుస్తుంది..!!
Share this Article