Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జంపాలజిస్టు… కప్పగెంతుల శాస్త్రం… నాయకులు జన్మతః నిపుణులు…

November 7, 2023 by M S R

Our Language- Our Wish:

విలేఖరి:-
అన్నా! మీరు ఊపిరి ఉన్నంతవరకు ఆ పార్టీని వీడను అన్నారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. మీ ఊపిరి ఉంది కదా?

నాయకుడు:-
తమ్మీ! ఎన్నికల ప్రచారం లౌడ్ స్పీకర్ల హోరులో నువ్ సరిగ్గా విన్నట్లు లేవు. “ఊపిరి ఉన్నంతవరకు నేను పార్టీని వీడను” అన్నానే కానీ...”ఫలానా పార్టీని వీడను” అని అననే లేదు. కావాలంటే రికార్డులు పరిశీలించండి. నీకు చిన్నప్పుడు బళ్లో తెలుగు టీచర్ చెప్పిన వ్యాకరణంలో నామవాచకాలు, సర్వనామాలు, అర్థాన్వయాలు, అంతరార్థాలు, పిండితార్థాలు, ధ్వని సరిగ్గా బుర్రకెక్కినట్లు లేదు. లేదా మీ బళ్లో అవి చెప్పలేదేమో! పిదపకాలం చదువులు! పిదపకాలం బుద్ధులు!

Ads

వి:-
వద్దులే అన్నా! కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. మా తెలుగు సార్ ఊపిరి ఉన్నంతవరకు మాకు గట్టిగానే చెప్పారు. మాక్కూడా తెలుగు పాఠాలు బాగానే వంటబట్టాయి. “సాధారణ భాషా వ్యాకరణ సూత్రాలు రాజకీయ భాషకు వర్తించవు…రాజకీయం దానికదిగా ఒక ప్రత్యేక భాష. ఒక్కో నాయకుడిది ఒక్కో వ్యాకరణం. దానికి అజ్ఞానమే తప్ప…తరగతి గది జ్ఞానం వర్తించదు” అని కూడా ఆనాడే మా తెలుగు సార్ నెత్తీ నోరు కొట్టుకుని చెప్తే…ఏమో అనుకున్నా. ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా చూస్తున్నా.

నా:-
నిజమే తమ్మీ! నేను లిక్కర్ షాపులు నడిపినప్పుడు చుక్కల వ్యాకరణం కనుగొన్నాను. ఇసుక దందా చేసేప్పుడు తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు పద్యానికి ప్రతిపదార్థం చెప్పాను. రియలెస్టేట్ వ్యాపారాల్లోకి దిగినప్పుడు బెదిరింపు భాషా శాస్త్ర వ్యాకరణం అంతు చూశాను. ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినప్పుడు సాంకేతిక పారిభాషిక వ్యాకరణం కనుగొన్నాను. మెడికల్ కాలేజీ పెట్టినప్పుడు నానారోగ కార్య కారణ పాఠాల్లో డబ్బులు పిండుకునే నవీన భాషా సిద్ధాంతాలను ఆవిష్కరించాను. ఇప్పుడు నా కొడుకులు- కోడళ్లు; కూతుళ్లు- అల్లుళ్లు నా విరచిత వ్యాకరణసూత్రాల దారిలో దారి తప్పకుండా పయనిస్తున్నారు. అందువల్ల నేను ప్రజాసేవ చేయక తప్పడం లేదు.

వి:-
మరి ఈరోజు పొద్దున కూడా ఆ పార్టీ అధినేత దేవుడన్నారు? ఇప్పుడేమో దయ్యమంటున్నారు?

నా:-
నాకు టికెట్టు ఇచ్చినవాడే దేవుడు. ఇవ్వనివాడు దయ్యం- అన్నదే నా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపత్రయ సిద్ధాంతం.

వి:-
అన్నా! మీరు చాగంటికి, గరికపాటికి కూడా పురాణ ప్రవచనం చెప్పేలా ఉన్నారే!

నా:-
ఊకో తమ్మీ! ఎందుకో ఈమధ్య అందరూ అదే మాటంటున్నారు. ఈ ఎలెక్షన్ దందా అయిపోయిన తరువాత పెరేడ్ గ్రవుండ్లో చాతుర్మాస్య దీక్షా మహిమ గురించి ముప్పయ్ రోజులు పురాణ ప్రవచనం చెబుదామని అనుకుంటున్నా. జనానికి అర్ధమయ్యే భాషలో ఈ పండితులు చెప్పలేకపోతున్నారని…పరమ భక్తాగ్రేసరురాలు అయిన నా భార్యామణి బాధపడుతోంది.

విలేఖరి స్వగతంలో:-
హతవిధీ! సాధారణ భాషకే కాక ఇక ఆధ్యాత్మిక భాషకు కూడా గ్రహణం పట్టబోతోందా! దేవుడున్నాడా? ఉంటే…ఈ ఘోరాన్ని ఆపలేడా?

తాజాకలం:-
ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగానే ఈ నాయకుడు తాజాగా చేరిన పార్టీ ఈయనకు టికెట్ నిరాకరించినట్లు తాజాగా తెలియడంతో…మరో పార్టీలో చేరి వచ్చే వరకు…వచ్చిన విలేఖరులు ఎక్కడికీ వెళ్లకూడదని మైకులో అనౌన్స్ చేశారు!

తాజాగా మార్చుకున్న కండువాతో వచ్చే నాయకుడు ఏమి చెబుతాడో తెలిసిన విలేఖరులు ముందుగానే వార్తలు రాసి…డెస్కులకు పంపి…ఎప్పటికీ రాని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో కట్టే ఇళ్ల గురించి కలలు కనే పనిలో పడ్డారు!…. – పమిడికాల్వ మధుసూదన్    9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions