ఏపీలోని ఓ సెంటర్… కావలి… కొందరు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాలబెట్టారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు… ఫోటోలు దిగారు, సాక్షి వాళ్లు రాగానే ఆ పోరాటం ముగిసింది… ఆ వార్త సాక్షిలో మాత్రమే వస్తుందని వాళ్లకు తెలుసు… రావాలనేదే వాళ్ల ప్రయత్నం… సో, ఎపిసోడ్ ఖతం…
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మీద ఏ నెగెటివ్ కనిపించినా సాక్షి వదలదు కదా… బొంబాట్ చేయాలని అనుకుంటుంది… అదోరకం పాత్రికేయం… అఫ్కోర్స్, ఇప్పుడు పాత్రికేయం అంటేనే అది… ఇంతకీ ఎవరు వాళ్లు..? తెలుగు సమాజాన్ని ఉద్దరించాలని అహరహం ఆలోచించే, శ్రమించే, ప్రయాసపడే ఆ రాధాకృష్ణ మీద వాళ్ల కోపం ఏమిటి…? యాంటీ- తెలుగుదేశం వాళ్లా..? వైసీపీ వాళ్లా..?
అబ్బే, మీరు తప్పులో కాలేశారు… వాళ్లు కూడా రాధాకృష్ణలాగే తెలుగుదేశం క్యాంపే… కాకపోతే వాళ్లు నందమూరి బాలకృష్ణ అభిమానులు… నో, నో, సినిమాల పరంగా అభిమానులు కారు… రాజకీయంగా అభిమానులు… మరి సేమ్ క్యాంప్ అయి ఉండీ ఈ నిరసనలు ఏమిటి..? తమవాడే అయిన రాధాకృష్ణపై ఈ ఆగ్రహం ఏమిటి..? అసలు పత్రిక ప్రతులు దహనం చేయాలన్నంత కోపం దేనికి..?
Ads
సింపుల్… ఇద్దరూ చంద్రబాబు క్యాంపే అయినా… ఎందుకో బాలయ్య అంటే రాధాకృష్ణకు పడదు… పడినవాళ్ల ఉనికిని తను సహించడు… అలాంటిది తనకు కవరేజీ ఇస్తాడా..? ఇవ్వడు… బాలయ్య బాబు అల్లుడు లోకేష్ సాగించిన పాదయాత్ర ముగింపు సభ బాపతు వార్తల్లో, ఫోటోల్లో ఎక్కడా బాలకృష్ణ ఊసే లేదట… అదీ తన అభిమానుల కోపం…
ఎవడో సాక్షి వాళ్లు బాలయ్య ఫోటో వేయలేదంటే, పేరు రాయలేదంటే అర్థముంది… కానీ మనవాడే అయిన రాధాకృష్ణ అలా చేయడం సబబు కాదు కదా… అందుకని ఆ ఆగ్రహం ఇంకా ఎక్కువ ఉంది… తమకు సాక్షి నచ్చకపోయినా ఈ వార్త ఇంకెవరూ పబ్లిష్ చేయరు కాబట్టి సాక్షిలో తమ ఆగ్రహం వార్త రావాలని కోరుకున్నారు… అదీ సంగతి…
నిజానికి ఎవర్ని అడిగినా ఎవరూ సరైన కారణం చెప్పరు… నిజంగానే బాలయ్య అంటే రాధాకృష్ణకు ఎందుకంత కోఫం..? తన ఫోటోలు రావు, పేరు రాయరు… ఏమిటీ నిషేధం…? అఫ్కోర్స్, తన పత్రిక తన ఇష్టం… రాయలని లేదు, ఆ ఫోటోలు వేయాలని లేదు… కానీ ఎందుకు అనేదే ప్రశ్న… చివరకు చంద్రబాబు, లోకేష్ కూడా వాళ్ల నడుమ అగాధాన్ని పూడ్చటానికి ప్రయత్నించి ఫెయిలయ్యారట… అవును, బాలయ్య ఆ ఎన్టీయార్ కొడుకే, సో వాట్ అంటాడు రాధాకృష్ణ…
జస్ట్, ఊరకే ఓ ప్రశ్న… ఒకవేళ ఇదే బాలయ్య గొప్ప రికార్డులు సృష్టిస్తే…? ఏదేని అనుకోని పరిస్థితుల్లో బాలయ్యే తెలుగుదేశం పగ్గాలు చేపట్టి, ఏమో, అదృష్టం మరీ బీభత్సంగా వెంటపడి ముఖ్యమంత్రి పదవి వరిస్తే… అప్పుడేం చేస్తాడు రాధాకృష్ణ..? తన పేరు రాయాల్సి వస్తుందనీ, తన ఫోటో వేయాల్సి వస్తుందనీ ఏపీ ఎడిషన్నే మూసేస్తాడా..? ఏమో… చెప్పలేం…!! #nbk, #andhrajhothy, #ajradhakrishna,
Share this Article