జగన్ మీద రాయితో దాడి జరిగింది… నుదుటి మీద గాయం కనిపిస్తోంది… దాని తీవ్రత ఎంతో తేల్చడానికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నారు… ఒకరోజు ప్రచారసభలు ఆపేసింది వైసీపీ… ఇవన్నీ వార్తలు… ఒక ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరగడం అనేది తీవ్ర విషయమే… ఐతే…
పొలిటికల్ సీజన్ కదా… ఎక్కడ జగన్‌కు సానుభూతి మైలేజీ వస్తుందేమో అనుకుని టీడీపీ ఠారెత్తింది… ఎహె, ఇదంతా చేయించుకున్న దాడి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు… వోకే, అది పొలిటికల్ అవసరం అనుకుందాం… ఏపీ పాలిటిక్స్‌లో హుందాతనం ఆశించడం మూర్ఖత్వం కాబట్టి దాన్నలా వదిలేద్దాం…
గతంలో కోడికత్తి దాడి జగన్ చేయించుకున్నదే అని టీడీపీ ఆరోపించింది… అంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడించిన డ్రామా అనీ విమర్శించింది… ఎకసక్కేలాడింది… సరే, దాన్నీ అలా వదిలేద్దాం… తను ముఖ్యమంత్రి అయ్యీ మరి ఆ కోడికత్తి దాడి అంతు తేల్చి, అసలు కారణాలను జనానికి ఎందుకు వెల్లడించలేకపోయాడు అనేదీ పక్కన పెడదాం…
Ads
మరి ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోరుడు జగన్ వెంట లేడు, జగన్ గెలవడూ అంటున్నాడు, చంద్రబాబు పంచన చేరాడు, టీడీపీ కోసం పనిచేస్తున్నాడు… మరి ఈ రాయిదాడి ఎవరి వ్యూహం అంటావు అచ్చెన్నాయుడూ..? లోకేషులు, పవన్ కల్యాణులు, చంద్రబాబులు, పురంధేశ్వరిలు ఈ కథనం రాసే సమయానికి స్పందించినట్టు లేరు… అవీ కాసేపు వదిలేద్దాం…
జగన్ సొంత చెల్లెలు షర్మిల స్పందన చాలా నీచంగా అనిపించింది… ఈ వ్యాఖ్య ఆమె అభిమానులను బాధపెట్టినా సరే… ఒకసారి ఆ ట్వీట్ చూడండి…
‘‘దురదృష్టకరం, ఇది ప్రమాదవశాత్తు అయ్యిందని అనుకుంటున్నాం, అలా కాకుండా ఇది ఎవరైనా చేసి ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే’’… ఇదీ ఆమె స్పందన… ఐతే టీడీపీ కూటమి భాషలో అది జగన్ చేయించుకున్నదే, సానుభూతికోసం డ్రామా అనెయ్… కాదంటే జరిగిన దాడిని ఖండించు, అంతేగానీ ఈ ప్రమాదవశాత్తూ కారణం ఎక్కడి నుంచి వచ్చింది..?
ఒక సోషల్ నెటిజన్ వ్యంగ్యంగా పోస్టాడు ఇలా… ‘‘బాగా ఆకలితో ఉన్న రాయి, తిండి గింజల కోసం అలా ఎగురుకుంటూ వస్తుండగా, జగన్ గారు ఆకస్మాతుగా అడ్డు రావడంతో, ఎటూ తిరిగేదానికి సమయం లేక అలా ప్రమాదవశాత్తు నుదుట భాగానికి తగలడం జరిగింది… కరెక్ట్ గా చెప్పా కదా sister…?’’
వ్యంగ్యమే అయినా సూటిగా, సరిగ్గానే ఉంది… కేవలం బాబాయ్ హత్య, అన్నపై కోపం అనే ఎజెండాతో మాత్రమే ప్రచారం చేసుకుంటున్న ఆమె ఏపీ కాంగ్రెస్‌కు సారథ్యం వహించడం ఏమిటో… ఇదుగో ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలు చేయడం ఏమిటో… అసలు ఆమె తెలంగాణ పార్టీ, విలీనం, ఏపీకి జంప్ అనే నిర్ణయాలే హాస్యాస్పదం అంటుంటే… చివరకు ఏపీ పాలిటిక్సులో కూడా ఇలా వ్యవహరిస్తూ… జగన్ అసలు ప్రత్యర్థిని నేనే అన్నంత బిల్డప్ ఇచ్చే తీరు నిజంగా నవ్వు పుట్టించేలాగే ఉంది… ఐతే జగనన్న అనలేదు, పోనీ, జగన్మోహన్‌రెడ్డీ అనలేదు, జగన్ గారు అనే సంబోధన ఏమిటో..!!
Share this Article