.
దేశం సాధించిన ఘనతంతా నాయకుడిదేనా? ఏళ్ల తరబడీ సాగిన డెవలప్మెంట్ క్రెడిట్ అంతా ఒక్క నాయకుడిదే దక్కాలా..? అంతర్జాతీయ ర్యాంకింగ్స్ వెనుక అసలు కథ!
ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌కు ఆసియాలో మూడో స్థానం ఇచ్చిందంటే అది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఇచ్చిన మూడో స్థానం అవుతుందా? ఒకవేళ భారత్‌కు పదో స్థానం వచ్చి ఉంటే అది మోదీ వైఫల్యమని తేల్చేయొచ్చా? అంతర్జాతీయ సర్వేలు, రేటింగులు, ర్యాంకింగ్స్‌ను అర్థం చేసుకునేటప్పుడు ఈ మౌలికమైన తేడాను గుర్తించాలి. దేశం వేరు, దేశాన్ని పాలించే ప్రభుత్వం వేరు, ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి వేరు.
Ads
ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2026 ఆసియా పవర్ ఇండెక్స్ ఇప్పుడు ఈ చర్చకు కారణమైంది. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ స్కోరు 40.5 కాగా, అమెరికా 78.9, చైనా 73.6 స్కోర్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ప్రాంతీయ నాయకత్వ ప్రభావం విషయంలో ప్రధాని మోదీకి కూడా ఈ నివేదిక రెండో స్థానం ఇచ్చింది. అయితే ఇవి రెండు వేర్వేరు అంచనాలు. ఒకటి దేశ శక్తిసామర్థ్యానికి సంబంధించినది, మరొకటి నాయకత్వ ప్రభావానికి సంబంధించినది.

అసలు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? వాటిని ఎందుకు పట్టించుకోవాలి? ఒక దేశం ప్రపంచంలో ఎక్కడ నిలబడింది? దాని ఆర్థిక బలం ఎంత? సైనిక సామర్థ్యం ఏమిటి? ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆ దేశం మాటకు ఎంత విలువ ఉంది? భవిష్యత్తులో దాని ఎదుగుదలకు అవకాశాలు ఏమిటి? ఇలాంటి అంశాలను వివిధ ప్రమాణాల ఆధారంగా అంచనా వేసే ప్రయత్నమే అంతర్జాతీయ సూచీలు.
లోవీ ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ ఒక్క ఆర్థిక వృద్ధిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోలేదు. 27 దేశాలు, ప్రాంతాలను 131 సూచికల ఆధారంగా పరిశీలించింది. ఆర్థిక సామర్థ్యం, సైనిక బలం, అంతర్గత స్థిరత్వం, భవిష్యత్ వనరులు, ఆర్థిక సంబంధాలు, రక్షణ భాగస్వామ్యాలు, దౌత్య ప్రభావం, సాంస్కృతిక ప్రభావం.. ఇలా ఎనిమిది ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
అంటే ఈ ర్యాంకింగ్‌లో భారత్ మూడో స్థానంలో ఉందంటే దేశానికి ఉన్న విస్తృతమైన సామర్థ్యాన్ని అంతర్జాతీయ కోణంలో గుర్తించినట్టే. ఇందులో ప్రస్తుత ప్రభుత్వ విధానాల ప్రభావం ఉండొచ్చు. ప్రధాని నాయకత్వం పాత్ర కూడా ఉండొచ్చు. కానీ దేశం సాధించిన మొత్తం పురోగతిని ఒక వ్యక్తి ఖాతాలో వేయడానికి ఈ ర్యాంకింగ్‌ను ఉపయోగించలేం.
- ఉదాహరణకు హైదరాబాద్ అభివృద్ధినే తీసుకుందాం. హైదరాబాద్‌ను ఐటీ, ఫార్మా, అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మార్చడంలో అనేక దశల్లో వివిధ ప్రభుత్వాల పాత్ర ఉంది. ఒక ప్రభుత్వం ఐటీ రంగానికి పునాదులు వేస్తే, మరో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను విస్తరించి ఉండొచ్చు. ఇంకో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించి ఉండొచ్చు. వీటన్నింటికీ తోడు హైదరాబాద్ భౌగోళిక అనుకూలతలు, విద్యావంతులైన యువత, ప్రైవేటు రంగం, అంతర్జాతీయ సంస్థల నిర్ణయాలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ ఫొటో పెట్టేయలేం కదా! అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి అనేక శక్తులు, అనేక నిర్ణయాలు, అనేక కాలాల కృషి తోడవుతాయి. దేశాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
భారత్ విషయంలోనూ స్వాతంత్య్రానంతర పారిశ్రామిక పునాదులు, శాస్త్రసాంకేతిక రంగంలో సాధించిన పురోగతి, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఐటీ విప్లవం, ఆర్థిక సంస్కరణలు, రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనలు.. ఇలా దశాబ్దాల కృషి ఉంది. వివిధ ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాయి. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కూడా దేశ ప్రస్థానంలో భాగమే. ఒక దశలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు మరో దశలో కనిపిస్తాయి. వాటి మధ్య గీత గీసి మొత్తం ఘనతను ఒక్కరి ఖాతాలో వేయడం సాధ్యం కాదు.
అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకూడదా? అంటే అదీ కాదు. ఒక దేశం తన సామర్థ్యాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటోంది? అంతర్జాతీయంగా తన ప్రయోజనాలను ఎంతవరకు సాధించుకుంటోంది? విదేశాంగ విధానం, రక్షణ సంబంధాలు, ఆర్థిక విధానాల్లో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? అన్నది కూడా ముఖ్యం. అక్కడ ప్రభుత్వ పనితీరును విడిగా అంచనా వేయాలి.
ఇదే నివేదికలో భారత్ ఆర్థిక సామర్థ్యానికి సంబంధించిన స్కోరు 26.4గా నమోదైంది. దౌత్య ప్రభావం మాత్రం 70.3 స్కోరుతో బలమైన అంశంగా నిలిచింది. అంటే ఒక దేశం మొత్తం శక్తి సామర్థ్యం, దానిలోని ఒక్కో రంగం పనితీరు ఒకేలా ఉండవని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఒక రంగంలో పురోగతి ఉంటే మరో రంగంలో బలహీనత ఉండొచ్చు. అందుకే ఒకే ర్యాంకింగ్ ఆధారంగా ప్రభుత్వ పనితీరుపై సంపూర్ణ తీర్పు ఇవ్వడం సరికాదు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. అంతర్జాతీయ సర్వేలు, రేటింగులు అనేవి ఏవో తిరుగులేని అంతిమ సత్యాలు కావు. వాటి వెనుక ఒక నిర్దిష్టమైన పరిశోధనా పద్ధతి ఉంటుంది. ఏ అంశానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ గణాంకాలను తీసుకోవాలి? ఏ దేశాలను పోల్చాలి? అన్న నిర్ణయాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. లోవీ ఇన్స్టిట్యూట్ కూడా తన పద్ధతిలో నిపుణుల నిర్ణయాలు, వివిధ సూచికలకు ఇచ్చిన వెయిటేజీలను ఉపయోగించింది. కాబట్టి ఆ సంస్థకు ఉన్న పరిశోధనా ప్రాధాన్యతను గుర్తిస్తూనే, దాని ఫలితాలను విమర్శనాత్మకంగా కూడా చూడాలి.
దేశం ఎదుగుదల అనేది ఒక వ్యక్తి పదవీకాలంతో మొదలై, ఆయన పదవీకాలంతో ముగిసిపోయే వ్యవహారం కాదు. తరతరాల కృషి, ప్రభుత్వాల విధానాలు, ప్రజల భాగస్వామ్యం, సంస్థల పనితీరు, అంతర్జాతీయ పరిస్థితులు కలిసి నిర్మించే ప్రయాణం…
Share this Article