వ్యక్తులను కాదు, ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది…
వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్‌కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, చేరదీసి, పెంచిన అన్నా హజారే కూడా కేజ్రీని బలంగా వ్యతిరేకిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు…
ఇదే కేజ్రీని వ్యతిరేకిస్తూ మొదట తనతో కలిసి పనిచేసిన చాలామంది తనను వదిలి వెళ్లిపోయారు… మొదట్లో ఓ కొత్త తరహా రాజకీయాన్ని తనను ఆశించిన ప్రజలు కూడా క్రమేపీ తన ఒరిజినల్ కలర్ బయటపడుతూ వ్యతిరేకించడం మొదలుపెట్టారు… తను తెలివిగా ఖలిస్థాన్ శక్తులతో చేతులు కలిపాడు…
Ads
ఢిల్లీలో ఆడింది ఆటగా మారింది వాళ్లకు… తన ఎంపీలు, తన మంత్రులు జైలుపాలు… చివరకు తను కూడా… కానీ సుప్రీంకోర్టుకు ఎందుకు తనపై అంత స్పెషల్ అటెన్షన్ అని అమిత్ షా విమర్శించాడు… సుప్రీం తీర్పు మీద ఈ దేశ హోం మంత్రి స్వయంగా కామెంట్ చేశాడంటే అసలు ఢిల్లీలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు…
హోంమంత్రి ఇలా వ్యాఖ్యానించాడు అంటే, విశ్లేషణల పట్ల అభ్యంతరం లేదూ అంటోంది… ఇండి కూటమి గెలిస్తే మళ్లీ జైలుకు పోను అని కేజ్రీ చెబుతున్నాడు కదా అంటే, అది తన ఊహ అంటోంది… తను ముఖ్యమంత్రి, ప్రచారం చేసుకోవాలి, నిజమే, కానీ పాపం హేమంత్ సోరెన్ కూడా సీఎంగా ఉన్నప్పుడే కదా అరెస్టు చేసింది, మరి తనూ ప్రచారం చేసుకోవాలి కదా… జైలులో ఉన్న కవిత తదితరులు కూడా చేసుకోవాలి కదా, ఆమె స్టార్ క్యాంపెయినర్ కదా…
సరే, అవన్నీ లీగల్ విషయాలు, ఆ చర్చ వేరు… కానీ తన కళ్ల ముందే తన పార్టీకి చెందిన ప్రముఖురాలిని, తన పీఏ సాక్షాత్తూ తన ముందే కొడుతుంటే, వారించలేదు సరికదా కేజ్రీవాల్ ఈరోజుకూ ఆ దాడి మీద మాట్లాడలేదు… అక్కడ కేజ్రీవాల్ మీద ఏమూలో ఉన్న కాస్త పాజిటివిటీ కూడా ఎగిరిపోయింది… అన్నింటిెకన్నా దరిద్రం ఏమిటంటే..? ఆమెను బీజేపీ పంపించింది అనే చిల్లర ముద్ర వేయడం…
సరే, రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి, బీజేపీయే పంపించింది అనుకుందాం… అయితే కడుపులో, ఛాతీ మీద, ఎక్కడ పడితే అక్కడ తన్నడం, కొట్టడమేనా..? అదీ తన నివాసంలోనే..! తన పీఏ… ఆమె రాజ్యసభ ఎంపీ… సరే, రాజకీయాలకు వద్దాం…
మోడీ ప్రధానిగా తప్పుకుని, తరువాత అమిత్ షాకు చాన్స్ ఇస్తాడు అని ఓ విమర్శ… సో వాట్, తప్పేముంది..? జైలుపాలైనా సరే, సీఎం కిరీటాన్ని వదలని అనైతికతకన్నా బేకార్ పనా అదేమైనా..? మోడీ సరే గానీ, అమిత్ షా వస్తే ఇంకా డేంజర్ అని చెబుతున్నట్టా..? మోడీ కాస్త పర్లేదు అని చెబుతున్నట్టా..? ఐనా అది బీజేపీ అంతర్గత వ్యవహారం కదా…
అంతేకాదు, తనకు మస్తు మైండ్ గేమ్ చేతనైనట్టు… మోడీ మళ్లీ గెలిస్తే యోగిని సీఎంగా పీకిపారేస్తారు అని మరో విమర్శ… అంటే యోగి పర్లేదు, తను గాకుండా వేరే వస్తారు సుమా అని యూపీ ప్రజలను అలర్ట్ చేస్తున్నట్టా..? పోనీ, యోగిని పీకిపారేస్తారే అనుకుందాం, సో వాట్, అలా జరిగితే ఏం చేయాలో తెలియనంత నోట్లో వేలు బాపతు సీఎం కాదు కదా, అసలే బుల్‌డోజర్ సీఎం తను… పైగా ఆప్ సీఎం వంటి భ్రష్టాచార్ అసలే కాదు కదా… ప్చ్, ఎలాంటి పేరున్న కేజ్రీవాల్ చివరకు ఎలా జారిపోయాడు..!!
Share this Article