.
“1984లో దేశ ప్రధాని ఇందిరకే పూరీ జగన్నాథ ఆలయ ద్వారాలు తెరుచుకోలేదు… కారణం, ఆమె పార్శీ మతస్తుడిని పెళ్లిచేసుకుంది… అక్కడి ఆగమం ప్రకారం గుడిలోకి హిందూయేతరులకు దేవాలయ ప్రవేశం లేదు… అంతటి శక్తివంతమైన నాయకురాలు కూడా ఆ నిర్ణయానికి తలవంచింది…’’
’’తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మీనాక్షి అమ్మవారిని దర్శించుకునే ముందు అవసరమైన అంగీకార పత్రంపై సంతకం చేశాడు… ఆలయ నిబంధనను అక్షరాలా పాటించాడు…’’ ఈ రెండు ఉదాహరణలకు పూర్తి భిన్నంగా… గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి అవసరమైన పత్రంపై సంతకం చేయడానికి నానా యాగీ చేశారు వైసీపీ నాయకులు…
Ads
….. ఇప్పుడు ఇవి చెప్పుకోవడానికి కారణం ఉంది… అన్యమతస్తులు ఆలయ ధ్వజస్థంభం దాటి ముందుకు వెళ్లడానికి వీల్లేదనీ, దర్శనం కావాలంటే ఆ దేవుడిపై విశ్వాసం, గౌరవం ఉన్నట్టు ఓ అంగీకారపత్రంపై సంతకం చేయాలని, ఈమేరకు ప్రతి గుడిలో ప్రముఖంగా బోర్డులు పెట్టి, తగు ఏర్పాట్లు చేయాలని మద్రాసు హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పింది…
మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ వార్త ఓ వార్తలా కనిపించలేదు… రాసిన ఒకటీరెండు పత్రికలు అసలు హైకోర్టు ఆ తీర్పు ఎందుకు చెప్పిందనే నేపథ్యాన్ని రాయలేదు సరిగ్గా… మద్రాసు హైకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది… విషయం ఏమిటంటే..?

మదురైకి చెందిన కె. తంగం వెంకటేశ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) ఈ తీర్పుకు కారణం… తమిళనాడు ఆలయ ప్రవేశ చట్టం, నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిపై విచారణ జరిపించి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆయన కోరాడు… ఈ పిటిషన్పై అక్టోబర్ 23న జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ పి. మురుగన్లతో కూడిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది…
ఇతర మతాల గుర్తులు ధరించి, దేవత పట్ల గౌరవాన్ని ప్రకటించని వ్యక్తులను ఆలయ ప్రాంగణంలోకి కూడా అనుమతించరాదని పేర్కొంది… అయితే, ఈ తీర్పు అన్ని మతాలవారిపైనా, అన్ని ఆలయాలపైనా సంపూర్ణ నిషేధం విధించినట్లు కాదు. ఆగమ సంప్రదాయాలను అనుసరించే తమిళనాడు ఆలయాల పరిధిలోనే ఈ తీర్పు వర్తిస్తుంది… అయ్యప్ప, షిర్డీ సాయిబాబా వంటి క్షేత్రాలకు వివిధ మతాలవారిలోనూ భక్తులు వెళ్లే విషయాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించారు…
మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి ఎన్నికల తర్వాత స్థానిక ఎమ్మెల్యే బద్రుద్దీన్ ప్రవేశించాడు… అదేమంటే… ఆలయంలో భక్తులకు సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అని పరిశీలించే హక్కు తనకు ఉందని దబాయించాడు… అంతటితో ఆగకుండా, ఆలయ కుంభాభిషేకం సందర్భంగా గోపురాలపైకి కూడా ఎక్కాడు… అదీ వివాదం… కోర్టు ఇవీ ప్రస్తావించింది…
గతంలో ఇదే ఎమ్మెల్యే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ప్రకటించి, మరోవైపు ఆ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆలయ గోపురంపైకి ఎక్కడం ఏమిటన్నది కోర్టు లేవనెత్తిన ప్రశ్నల్లో ఒకటి… కోర్టు మరికొన్నీ పేర్కొంది… తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరించే ఒక మంత్రి అవసరమైన అంగీకార పత్రం ఇవ్వకుండానే ప్రవేశించాడు…
ఎమ్మెల్యే లేదా మంత్రి అయితే ఆలయ మర్యాదలు, ఆగమ నిబంధనలకు అతీతమా..? ఇదీ కీలకప్రశ్న… ప్రజాప్రతినిధుల పేరిట అన్యమతస్తులు ఆగమాల్ని తుంగలో తొక్కితే… అధికారానికి భయపడి ఆలయ సిబ్బంది కళ్లప్పగించి చూడాల్సిన పని లేదని కోర్టు తీర్పు సారాంశం… సరే, ఇక్కడ మరో ప్రశ్న (కోర్టు వేయలేదు)… తన మంత్రి, తన ఎమ్మెల్యే ఇలా హిందూ మతవిశ్వాసాల్ని, ఆలయమర్యాదల్ని భంగపరిస్తే… తమిళనాడు సీఎం, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ వారి ప్రవర్తనపై తీసుకున్న చర్య ఏమిటి…!?
శబరిమల గుడిలోకి రుతుమహిళల్ని బలవంతంగా ప్రవేశపెట్టిన ధూర్తానికి పాల్పడినందుకు ఎల్డీఎఫ్ భాగస్వామ్య పార్టీ సీపీఐ లెంపలేసుకుంది, సీపీఎం మూల్యం చెల్లించుకుంది… తిరుమల అక్రమాలకు జగన్ మూల్యం చెల్లించుకున్నాడు… విజయ్ బహుపరాక్..!!
Share this Article