తండ్రి ఓ మర్చంట్ నేవీ ఆఫీసర్… తల్లి ఆర్బీఐలో మేనేజర్… తను డాక్టరీ చదివింది… తాత పేరుమోసిన సామాజిక కార్యకర్త… తల్లి బదిలీతో ముంబైకి మకాం మార్చారు… చదివింది డాక్టరీ అయినా మోడల్‌గా, నటిగానే ఇంట్రస్టు… మలయాళం, కన్నడం, పంజాబీ, హిందీ భాషల్లో నటించింది… ఓ తెలుగు సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది, తరువాత ఏమైందో తెలియదు…
2021లో ఓ హోటల్‌లో జిందాల్ స్టీల్స్ సీఎండీ సజ్జన్ జిందాల్ తన మీద లైంగిక దాడి చేసినట్టు 2023లో కేసు పెట్టింది… ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు… చివరకు డిసెంబరులో బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… ఆయన వయస్సు 64 ఏళ్లు… భారతీయ పారిశ్రామికవేత్తల్లో ప్రముఖంగా పేరు…
తరువాత ఏమైంది..? సరే, ఈనాడు- ఆంధ్రజ్యోతి వార్తల ప్రకారం చెప్పుకుందాం… సదరు సజ్జన్ జిందాల్ జగన్‌కు సన్నిహితుడు… అప్రోచయ్యాడు… ఓస్, ఇదెంత పని అనేసి తన పోలీసులకు సెటిల్మెంట్ పని పురమాయించాడు… వాళ్లు జగన్‌కు సన్నిహితంగా ఉండే విద్యాసాగర్ అనే నాయకుడి ద్వారా ఓ కంప్లయింట్ చేయించారు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో… ఏమని..?
Ads
సదరు ముంబై నటి తనను బ్లాక్‌మెయిల్ చేసి, సంతకాలు పెట్టించుకుందని ఆ ఫిర్యాదు… ఇంకేం..? ఓ గ్రూపు పోలీసులు నేరుగా ముంబై వెళ్లి నటిని, ఆమె తల్లిదండ్రులను లిఫ్ట్ చేశారు… 18 రోజులపాటు వీటీపీఎస్ గెస్ట్ హౌజులో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు… అందమైన నటి కదా, ఓ ఎస్సయి మరీ దారుణంగా బిహేవ్ చేశాడుట… చివరకు భరించలేక ఆమె లైంగికదాడి కేసు విత్‌డ్రాకు అంగీకరించాక వదిలేశారుట… మరి ఏపీ పోలీసులా మజాకా..? జగన్ పాలనా మజాకా..? ఇదీ ఈనాడు-ఆంధ్రజ్యోతి కథనాల సారాంశం…
నిజంగానే చదువుతుంటే ఒక్కసారిగా మెదడు మొద్దుబారినంత ఫీలింగ్… అంటే, ఏపీ పోలీసులు రేప్పొద్దున తలుచుకుంటే ఏదో తప్పుడు కేసు పెట్టేసి అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, ఆలియా భట్ వంటి స్టార్లను కూడా లిఫ్ట్ చేస్తారా..? ఇక్కడ కొన్ని సందేహాలు…
ఆమె తల్లిదండ్రులు సొసైటీలో పలుకుబడి ఉన్నవాళ్లు కదా, పైగా గుజరాత్ బ్యాచ్ కదా… కేంద్ర పెద్దలను కలిసే రూట్ దొరకలేదా..? నిజంగా కేంద్రంలోని గుజరాత్ పెద్దతలలు ఎంటరై ఉంటే కథ వేరే ఉండేదేమో… కానీ వాళ్లకూ ఈ ఆఫ్టరాల్ బాలీవుడ్ పిల్ల అక్కర్లేదు కదా, అనేక కంపెనీల, పలు రంగాల వ్యాపారి జిందాల్‌ను కాపాడటమే పరమావధి అనుకుని వదిలేశారా..?
మరీ అంత వయస్సున్న ఆ ‘సజ్జను’డిపై ఆమె ఆ కేసు ఎందుకు పెట్టింది..? ముంబై పోలీసులు ఇప్పుడు చెబుతున్నట్టు… అతన్ని తప్పుడు కేసులో ఫ్రేమ్ చేసి, ఇంకేదో భారీ ఫాయిదా ఆశించిందా..? సరే, ఇలాంటి సెటిల్మెంట్లు ముంబై పోలీసులకు చాలా సులభ వ్యవహారం… పైగా అక్కడి కేసు… సజ్జనుడికి డబ్బుకూ కొదువ లేదు… అలాంటిది, ఆ సజ్జనుడు ఇక్కడ జగనుడి సాయం ఎందుకు కోరాల్సి వచ్చింది… ఆమెను టాకిల్ చేయడానికి ఇంత పెద్ద స్కెచ్ అవసరమా..? నడుమ విద్యాసాగరుడు ఎందుకు ఇన్వాల్వయ్యాడు…?
నిన్నటి ఆంధ్రజ్యోతి కథనం (నిన్న ఈనాడులో ఏమొచ్చిందో చదవలేదు) అసలు ఈ సాగర్, ఆ నటి నడుమ లవ్వో గివ్వో నడిచిందనీ, ఆ పెళ్లి ఇష్టం లేని సాగరుడి పెద్దలు కావాలని విజయవాడ పోలీసులను పట్టుకుని ఈ కథంతా నడిపించారని…! తీరా ఈరోజు కథనంలో భారీ ట్విస్టు… నాడు సజ్జన జిందాలుడిపై పెట్టబడిన లైంగిక దాడి కేసు ఉపసంహరణ కోసమేనని తాజా వేడి వేడి కథనం… ఇది ఈనాడులో కూడా వచ్చింది… (కాకపోతే జ్యోతి వార్త ధమ్ బిర్యానీలా ఉంటే, ఈనాడు వార్త రచన శైలిలో దమ్ములేదు)… బహుశా సోర్స్, రాయమని ప్రేరేపించిన సోర్స్ ఒకటే అయి ఉంటుంది ఇద్దరికీ… లేదా ఈ కథనాల్లో రాసిందంతా నిజమే ఐఉంటుంది…
ఆమె కేసు విత్‌డ్రాకు అంగీకరించాక… సదరు జిందాలుడిపై కేసు ఆల్రెడీ పెట్టబడిన బాంద్రా కోర్టులో బీకేసీ పోలీసులు ‘ఆమె తప్పుడు కేసు పెట్టిందనీ, ఆ వ్యాపారిని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించిందని’ విన్నవించారుట… కేసు క్లోజ్ అయిపోయిందట… ఇండియాటుడే అప్పట్లో రాసిన వార్త ఇది… అంటే కేసు విత్‌డ్రా విషయంలో ఏపీ, ముంబై పోలీసులు పరస్పర సహకారం అందించుకున్నారా..? ఆమెను లిఫ్ట్ చేయడానికి కూడా వోకే అన్నారా..?
ఏమో… అసలు ఇలాంటి ‘సెటిల్మెంట్ కేసు’ల్లో సాధారణంగా ముంబై పోలీసులు ఇంకెవరినీ ఇన్వాల్వ్ కానివ్వరు… మరి నిజమేమిటి అంటారా..? ఏమో, రేపు ఆంధ్రజ్యోతి మరో కథనంలో క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం..!! మరి అంతటి పెద్ద తలకాయపై తప్పుడు కేసు పెట్టినందుకు కోర్టు సదరు నటికి ఏమైనా శిక్ష వేసిందా..? తెలియదు… ఈ మొత్తం కథలాగే ఆ విషయంలోనూ క్లారిటీ లేదు..!! అవునూ, ఆమె లైంగిక దాడి బాధితురాలు కాదు, నిందితురాలు అని తేల్చేశారు కదా అందరూ… అంటే ఆమె పేరు వెల్లడించొచ్చా..? ఫోటో వాడుకోవచ్చా..? అబ్బే, ఎందుకులెండి…! బ్లర్ చేసేద్దాం…!!
ఈ నటి కేసు విషయంలో ఓవరాక్షన్ ప్రదర్శించిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు సహా, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదట… అంటే… ఇది చాలా ఎపిసోడ్లుగా సాగే టీవీ సీరియల్ అన్నమాట… కానివ్వండి… జ్యోతి కథనం లింక్ ఇదుగో…
https://www.andhrajyothy.com/2024/andhra-pradesh/sajjan-bachgaya-1302564.html
Share this Article