.
మొన్న ఏమన్నాడు విశాల్..? దయచేసి ఎవరూ కొత్తగా ఇండస్ట్రీలోకి రాకండి, డబ్బు నష్టపోకండి, వీలైతే రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకొండి అని కదా…
నిజం… తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు దారుణంగా దెబ్బతిన్నయ్ గత ఏడాది… పెద్ద పెద్ద హీరోల వందల కోట్ల భారీ సినిమాలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి… కథలుకాకరకాయ దేనికి..? హీరో కనిపిస్తే చాలు, డబ్బులేడబ్బులు అనే తిక్క కూతలు కూసిన నిర్మాతలకు ఇదొక గుణపాఠం… ఈ నేపథ్యంలో విశాల్ చెప్పిన మాటలు కరెక్టు…
Ads
కానీ తన మనసులో ఉన్నది వేరే కావచ్చు బహుశా… ఎప్పుడో 2012లో మొదలు పెట్టి, కళేబరంలా మారిన మదగజరాజా సినిమాకు పుష్కరకాలం తరువాత కాస్త మాంసం అతికించి, రంగులు పూసి, కొత్త దుస్తులు తొడిగి ప్రవేశపెట్టాల్సి వచ్చిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అలా అన్నాడేమో…
ఏమో… తన ఆరోగ్యం దెబ్బ తిన్నది… ప్రిరిలీజు మీడియా మీట్లలో కూడా చేతులు వణుకుతూ, మాటలే కష్టమైపోయాయి… ఇంత పెద్ద హీరోను అయి ఉండీ, కోలీవుడ్ నటుల అసోసియేషన్ లీడ్ చేసి, చారిటీ కార్యక్రమాలు చేసీ చివరకు ఇలా మిగిలిపోయాను అనే డిప్రెషన్ కూడా కావచ్చేమో…
అవును, మదగజరాజా సినిమా పుష్కరకాలం క్రితందే… హఠాత్తుగా దాన్ని చెవులు పట్టుకుని ఈకాలంలోకి లాక్కురాలేరు కదా ఎవరైనా… అదే జరిగింది… పైగా సినిమాలో అడుగడుగునా లాజిక్ రాహిత్యం… అరవ మార్కు అతి… ప్రేక్షకులు ఎడ్డోళ్లు అనే భావనతో సినిమాను చుట్టేశారు…
నిజానికి ఎప్పుడో షూట్ అయిపోయిన ఫీడ్ అంతా స్క్రాప్… కానీ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఏదో మేకప్పులు వేసి రిలీజ్ చేశారు… తమిళులకు అది పర్లేదు, వసూళ్లు బాగానే వచ్చాయి మొన్న పొంగల్ రిలీజుకు… దాన్నే ఆలస్యంగా ఇక్కడ రిలీజ్ చేశారు… మరీ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకూ మహారాజ్ నడుమ దీన్ని రిలీజ్ చేస్తే నలిగిపోతామని భయపడ్డారేమో…
కానీ ఆ అతి కామెడీ మనవాళ్లకు పెద్దగా కనెక్ట్ కాదు… అత్తాఅల్లుళ్ల సంభాషణల్లో మరీ అతి… తెలుగు నటులు ఉన్నా సరే, వేరే గొంతులతో డబ్బింగ్… హీరోయిన్ల పాత్రలకు అస్సలు ప్రాధాన్యం లేదు… అంజలి, వరలక్ష్మి జస్ట్ ఫర్ గ్లామర్ టచ్… ఏదో తాతలకాలం నాటి కథ… పాటల గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ…
అతి అయినా సరే భరించగలం అనుకునే ప్రేక్షకులకు సంతానం, మనోబాల కామెడీ కాస్త రిలీఫ్ ఈ సినిమాలో… నిజానికి ఇప్పుడు మార్కెట్లో సంక్రాంతికి వస్తున్నాం అనే పెద్ద సినిమా మరేదీ చెప్పుకోదగ్గ సినిమా లేదు… ఈ స్థితి ఈ సినిమాకు పాజిటివ్ కావాలి కానీ, ప్చ్… కష్టమే… విశాల్, నువ్వు చెప్పినట్టు ఇలాంటి సినిమాల్ని జనంలోకి వదలడంకన్నా ఇండస్ట్రీ ముఖ్యులు వేరే వ్యాపారాల్ని చూసుకోవడమే బెటర్..!!
Share this Article