Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…

June 3, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala……. వి… విలయ రాజా…. సంగీత సాగరాన్ని మధించి గీతామృతాన్ని ప్రపంచానికి పంచిన స్వర తపస్వి ఇళయరాజా.

మ్యూజికల్ వర్డ్స్ తో … రాసే … పాటకు ఓ వాతావరణం సృష్టించడం వేటూరి లక్షణం. ఈ ఇద్దరి కాంబినేషన్ వర్ధిల్లిన ఎనభై, తొంభై దశకాల తెలుగు సినిమా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మన స్మృతి పథం నుంచి చెరిగిపోవు.

Ads

కళాతపస్వి విశ్వనాథ్ తో శంకరాభరణం తర్వాత పూర్ణోదయా సంస్ధ నిర్మించిన చిత్రం సాగరసంగమం.
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన అంటారు వేటూరి, ఇళయరాజాలు.

క్లిష్టమైన సన్నివేశం….
జీవితానురక్తి లేని కథానాయకుడు పాడుకునే మనో ధర్మ గీతం. అతని కోసం తల్లడిల్లే కథానాయిక హృదయవేదననూ పాటలో పట్టివ్వాలి.
అలాంటి పీట్స్ చేయడం అంటే ఇళయరాజాకు మహా ఇష్టం. అలాంటి సన్నివేశం దొరికినప్పుడు కదా… మన సార్ధకత అనుకుంటారాయన.

సురేష్ మూవీస్ కమల్ తో తీసిన ఇంద్రుడు చంద్రుడు కోసం…ఇళయరాజా వేటూరి అల్లిన అందమైన డ్యూయట్ సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో….
డ్యూయట్లను సీరియస్ గా పట్టించుకోం గానీ అందులోనూ అద్భుతమైన అర్ధవంతమైన సాహిత్యాన్ని సంగీతాన్ని అందించిన కారణజన్ములు ఇద్దరూ.

స్వీట్ నథింగ్స్ నే…. అందమైన స్వరంలో చెప్పగలగడం ఇళయరాజా స్పెషాలిటీ. ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పే గీతమే ఇది. ఎటో వెళ్లిపోయింది మనసు…
ఈ తరం మీదనూ… ఇళయరాజా సంగీత మాయాజాలాన్ని చలాయించిన మూవీ.
ఇళయరాజా బాణీ నేరుగా హృదయాలను తాకుతుంది. కవ్విస్తుంది… మురిపిస్తుంది… బాదిస్తుంది…. లాలిస్తుంది… .అనుభూతిని కలిగించడమే…
ఉత్తమ సంగీత లక్షణం.

ఆయన విషాద గీతం చేస్తే జన హృదయాలు బాధగా మూలుగుతాయి.
ఆయన హుషారైన పాట కంపోజ్ చేస్తే మనసులు లేడి పిల్లల్లా చెంగున ఎగురుతూంటాయి.
అందుకు… ఆయన పాటలే సాక్షం.
ప్రపంచాన్ని చూడలేని కవిత …
నిజం చూడదు…

ఇసుకలోన తల దూర్చిన ఉష్ట్రపక్షి బాపతు అన్నాడు శ్రీశ్రీ.
దాన్ని వివరించే ప్రయత్నమే సింధుభైరవిలో పాడలేను పల్లవైన గీతం.
శాస్త్రీయ సంగీత కచేరీ జరుగుతున్న చోటకు వచ్చి కళ కళ కోసమేనా?
అని ప్రశ్నించే ఓ ఆడపిల్ల.

ఇటీవలే కన్నుమూసిన దర్శక దిగ్గజం బాలచందర్ అపూర్వ సృష్టి సింధుభైరవిలో చిత్ర గళంలో వినిపించిన పాడలేను పల్లవైన…
కవీ ఓ కళాకారుడా ప్రజల వైపా? ప్రభుత్వం వైపా
అని గోర్కీ సంధించిన ప్రశ్న నేపధ్యంలో సాగే కథాంశంతో నిర్మించిన చిత్రం రుద్రవీణ.
తండ్రి ఆలోచనా సరళిని మార్చాలనుకునే కొడుకు…
తండ్రి నుంచి బిళహరి రాగాన్ని లాగేసుకున్న దాష్టీకం మీద చేసిన తిరుగుబాటు ఈ గీతం.

పేరు లేక పేద దౌనా? మోగుతున్న రాగవీణ అంటూ సాగే సీతారామశాస్త్రి సాహిత్యానికి ఇళయరాజా చేసిన స్వరాలంకారం వినితీరవలసినదే.
చెబితే తప్ప తెలియని డబ్బింగ్ గీతం రానేలా వసంతాలే…
దక్షిణ భారత దర్శక అద్భుతం బాలచందర్ రూపకల్పనలో వచ్చిన డాన్స్ మాస్టర్ మూవీలోదీ పాట.

పహాడి రాగంలో ఇళయరాజా చేసిన ఈ వేటూరి గీతం నిజంగానే ఓ అందమైన ప్రేమలేఖలా సాగుతుంది.
దేవేంద్రుని కుమార్తె భూలోకం చూడాలని వచ్చిన సందర్భానికి వేటూరి రాసిన గీతం అందాలలో అహో మహోదయం….
ఇళయరాజా అద్భుతరసంలో స్వరపరచిన ఈ గీతం వింటుంటేనే కళ్లెదుట సుందరలోకాలు పురుడు పోసుకుంటాయి.

మరి మనమూ… ఓ సారి ఆ అందాల లోకాల్లో అతిలోకసుందరి… జగదేకవీరులతో కలసి విహారము చేసెదమా?
వంశీ ఇళయరాజా… ఈ కాంబినేషన్ అంటే తెలుగోళ్లకు యమక్రేజు.
సితారతో మొదలైన ఈ ఇద్దరి స్వరసాంగత్యం వెన్నెలా గోదావరిలా అలా కొనసాగుతూనే ఉంది.

రాజా నుంచి టిపికల్ ట్యూన్లు రాబట్టడంలో వంశీ స్పెషలిస్టు. అలా వచ్చిన బాణీ ఆలాపన చిత్రంలో వినిపిస్తుంది…. ప్రియతమా తమా అంటూ సాగే ఇళయరాజా మార్క్ గీతాన్ని వినండి.
హీరోయిన్ పేరు లలిత.
తన పేరు చెప్పకుండా కథానాయకుణ్ణి తికమక పెట్టేస్తుంటుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఆ కథానాయకుడికి తన పేరేమిటో తెలుసుకోమని ఆలాపన చేస్తుంది.
హీరో అర్ధం చేసుకుంటాడు.

తనకెంతో నచ్చిన లలిత రాగంలో ఆనందాన్ని పంచుకుంటాడు. రుద్రవీణ చిత్రం నుంచి… లలిత ప్రియకమలం… చూడండి.
తానాలే చేసాను నేను నీ స్నేహంలో….
పాణాలే దాచావు.. నీవు నా మోహంలో….
జైల్లో మగ్గిపోతున్న ఓ హృదయ వేదన ఈ గీతం.
పాట వింటున్నంత సేపూ ఓ చిన్న పెయిన్… మనసుల్ని మెలితిప్పుతూ ఉంటుంది.

ఇళయరాజా సంగీతంలో ఉండే గొప్పతనమే అది.
రాజా సంగీతంలో కలగలసిన ఆత్రేయ సాహిత్యం వినండి.
కమర్షియల్ సినిమానే అయినా…
క్రియేటివ్ గా తీయాలనే తపనున్న ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు.

ఆ తపనే… అభిలాషే…. ఇళయరాజాతో తొలి స్ట్రెయిట్ చిత్రానికి సంగీతం అందించేలా చేసింది.
ఇళయరాజా, వేటూరి, లోక్ సింగ్, చిరంజీవి అనే ఆ నలుగురు కల్సి పంచిన సంగీతామృతం… కరగిపోయాను కర్పూర వీణలా…..

కీరవాణి రాగంలో ఇళయరాజా వంశీ కలసి చేసిన సుస్వర విందు…. అన్వేషణలోని కీరవాణీ అంటూ సాగే గీతం. వేటూరి… ఇళయరాజా… వంశీ… త్రివేణీ సంగమం.
ఈ పూలలో అందమై… ఈ గాలిలో గంధమై…. వినేయండి…. మాటలకందని మాధుర్యం….

ఇళయరాజా సంగీతం… ఏసుదాసు గానం… కళ్లముందు సాయిని సాక్షాత్కరింపచేసే గీతం… సాయి శరణం… బాబా శరణం.
సాయి చరణం గంగా యమున సంగమ సమానం… నిజంగానే… ఆత్రేయ… ఇళయరాజాల సంగమం కూడా గంగా యమున సంగమ సమానమే.

విరహ గీతాలు రాయాలన్నా… విషాదాన్ని పలికించాలన్నా… ఆత్రేయే రావాలి….
ఈ నమ్మకాన్ని నిలబెట్టిన గీతాల్లో ఒకటి అభినందన చిత్రంలో వినిపిస్తుంది.
ఆత్రేయ మనసెరిగి ఇళయరాజా కూర్చిన స్వరం అది. ప్రేమలేదని… ప్రేమించరాదని…. వినండి….

దర్శకుడు గీతాకృష్ణకూ ఇళయరాజా అంటే భక్తి. తన చిత్రాలకు కుదిరితే ఇళయరాజాతోనే సంగీతం చేయించుకోడానికి ప్రయత్నించేవాడు.
ఆ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కీచురాళ్లు.
పాప్ సింగర్స్ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ఉషాఊతుప్ తో పాడించారు ఇళయరాజా.

ఆత్రేయ, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన తెలుగువారి హృదయాలు దోచుకున్న మరో విషాద గీతం ప్రియతమా నా హృదయమా.
సురేష్ కృష్ణ డైరక్ట్ చేసిన వెంకటేశ్ చిత్రం ప్రేమ.
ప్రేమనగర్ లో మహదేవన్ ఆత్రేయ ఫార్ములా ఎలా వర్కౌట్ అయ్యిందో…
ప్రేమ విషయంలోనూ రాజా ఆత్రేయ ఫార్ములా వర్కౌట్ అయ్యింది.
కావాలంటే ఆ సిన్మా పాట విని మీరే చెప్పండి.

గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రతి మండపంలోనూ … ఆ తొమ్మిదిరోజులూ మోగే పాట దండాలయ్యా ఉండ్రాలయ్యా. అలా సీతారామకళ్యాణం పాట కంపోజ్ చేసిన గాలి పెంచల లాగానే ఇళయరాజా కూడా కృతార్థులయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన జైజైజై జై గణేశ జైజైజై వినేద్దామా?

ఎనభై దశకంలో దక్షిణాది చిత్ర సీమలోకి కొత్త ఆలోచనలతో అడుగు పెడుతున్న యువ దర్శకులకు ఉన్న ఒకే ఒక భరోసా ఇళయరాజా. కొత్త దర్శకుల ఆలోచనలను ఆకళింపు చేసుకుని తదనుగుణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూర్చడంలోనూ…
గీతాలను అల్లడంలోనూ తనదైన ముద్ర చూపించేవారు ఇళయరాజా.

మణిరత్నం అగ్నినక్షత్రియం అనే పేరుతో తీసిన ఘర్షణ తెలుగు పాటలు ఆ జనరేషన్ ను ఓ ఊపు ఊపాయి.
వాటిలో రోజాలో లేత వన్నెలో కూడా ఒకటి.

కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త రాగం మాయామాళవగౌళ రాగం. ఈ రాగంలో ఇళయరాజా ఓ సూపర్ మాస్ హిట్ కంపోజ్ చేశారంటే నమ్మగలరా?
సీతారామస్వామీ నే చేసిన నేరములేమి అంటూ రామదాసు కీర్తన ఈ రాగంలో వినిపిస్తుంది.
అయితే సినిమా పాటలకు సంబంధించి జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో యమహో నీ యమా యమా అందం…పాటను ఆ రాగ ఛ్చాయల్లో కూర్చడం విశేషం.

తొంభై దశకం ప్రారంభంలో ఇళయరాజా చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాల ఆడియో దుమ్ముదులిపేసింది. అందులో రెండోది జగదేకవీరుడు అతిలోక సుందరి.
మొదటిది కొండవీటి దొంగ.
మాస్ మనసులు గెల్చుకోడానికి పాటలను మోతెక్కించనక్కర్లేదని చాటి చెప్పిన గీతం అది.
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో… లాంటి వేటూరి మార్క్ చమక్కులతో ఎవర్ గ్రీన్ హిట్.
ఎలక్రానిక్ గిటార్ , డ్రమ్స్ వాడేస్తే…అదేదో మోడ్రన్ గీతంలే అనుకుంటారంతా…

కానీ అక్కడ ఇళయరాజా.
ఆధునిక శాస్త్రీయ సంగీతాల మధ్య అద్భుతమైన మేళవింపు ఆయన సంగీతం.
మోహన రాగంలో ఆదితాళంలో స్వరపరచిన నిను కోరీ వర్ణం… రాజా అందించిన గీతాల్లో ప్రత్యేకమైనది.
గీతాంజలికి ముందు చిత్రం కనుక ఘర్షణకు రాజశ్రీతో రాయించుకున్నారు మణిరత్నం.
అమల నర్తించిన నినుకోరీ వర్ణం వినేయండి….

నిజంగానే తెలుగు ప్రేక్షకులు ఆ పాట విన్నప్పుడల్లా మళ్లీ మళ్లీ ఇది రాని రోజనే అనుకుంటారు.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో ఆ నలుగురు … ఇళయరాజా, వేటూరి, చిరంజీవి, లోక్ సింగులు చేసిన సూపర్ హిట్ చిత్రం రాక్షసుడు.
సంగీత సాహిత్య సమలంకృతం ఈ కమనీయ గీతం…. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు….

వర్షాన్ని మణిరత్నం ఉపయోగించుకున్నంతగా మరే దర్శకుడూ వాడుకోలేదేమో?
గీతాంజలిలో హీరోయిన్ పరిచయానికి వేదికగా వానపాటను ఎంచుకున్నారాయన. సంగీతం ఇళయరాజా.
ఇక పాట వింటుంటే… ప్రతి ఒక్కరికీ టీనేజ్ జ్నాపకాలు ముసురుకోక తప్పదు.
మట్టి నేలల్లో గట్టిగా జల్లుపడ్డప్పుడు … అలా అల్లుకుంటూ పోయే నీటి గీతల వయ్యారాలన్నీ తన ట్యూన్ లో పలికించేస్తారు ఇళయరాజా.
పాట వింటుంటే ఒక్కసారి వర్షంలో తడిస్తే బాగుణ్ణనిపించేలా సాగుతుంది ఇళయరాజా వరస.

సినిమా పాటల్లో చాలా వరకు…
ఒడ్డును తాకిన అలల్లా అలా స్మృతిపథం నుంచి వెళ్లిపోతాయి.
కొన్ని మాత్రమే హృదయానికి హత్తుకొని మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
కొన్ని పాటలైతే ఎన్ని సార్లు విన్నా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది.
అలా కలకాలం మన జ్నాపకాల్లో నిలిచిపోయే పాట రుద్రవీణ తరలిరాద తనే వసంతం… బిహళరి గణపతి శాస్త్రి గారి కొడుకు పనివాళ్లతో కలసి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆలపించే సందర్భంలో పనిముట్ల సంగీతంతో ప్రారంభించడం అనితరసాధ్యం.

పాట వింటుంటేనే… కళ్లముందు దృశ్యం సాక్షాత్కరించాలి. సంగీత దర్శకుడు స్వరాలతో శ్రోతల హృదయాల్లో ప్రతిష్టించే అక్షర చిత్రాలే పాటలు. మరో ప్రపంచమే… మరింత చేరువై… నివాళి కోరినా ఉగాది వేళలో… గతించిపోని గాధ నేననీ అంటూ మృత్యువు ముంగిట్లో వేకువ సంగీతం వినిపించే సందర్భాన్ని తన సంగీతంలో ఆవిష్కరించడం ఇళయరాజాకు తప్ప మరెవరికీ సాధ్యం కాదేమో?

పాట ప్రారంభంలో మంత్రాలతో కలసిపోయిన క్రైస్తవ సంగీతం వినిపించడం ద్వారా…
చెప్పబోతున్న విషయాన్ని హింట్ చేస్తారు ఇళయరాజా.
ప్రేక్షకుల్ని మూడ్ లోకి తీసుకుపోవడం అంటే ఇదే. సీతాకోకచిలుక
మాటే మంత్రమూ… మనసే బంధమూ… పాట.

నేను నీకై ఉన్నాను… అనే దానికి ప్రత్యేకించి పెద్ద తతంగం అవసరం లేదు…
మనం పరస్పరం చెప్పుకున్న మాటలే మంత్రాలు… కలసిన మనసులే బంధాలు అంతకు మించేం కావాలనే దర్శకుడి ఊహకు వేటూరితో కలసి ఇళయరాజా తీర్చిన పద చిత్రం ఈ పాట. ..
ఇవ్వాళ ఆ కుర్రాడి బర్త్ డే అంటేనూ కాస్త ఇలా చొక్కా చింపేసుకున్నా పాపం….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions