.
నా చిన్నతనంలో సినిమాల్లో “నృత్యాలు-సలీం”అని టైటిల్ కార్డ్ పడగానే చప్పట్లు మ్రోగేవి.
అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలందరికీ డాన్స్ కంపోజ్ చేస్తూ నెంబర్‌వన్ డాన్స్‌మాస్టర్‌గా వెలిగారాయన.
నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన కొత్తల్లో ఆయన చిన్నా,పెద్దా అందరితోనూ చాలా కలివిడిగా వుండేవారు ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో.
“చుట్టాలబ్బాయి” పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు సలీంగారే అంతకుముందు కంపోజ్ చేసిన ఓ సినిమాలో కృష్ణ గారి స్టెప్స్‌ని ఫాన్స్ భలే ఎంజాయ్ చేశారని చెబితే అప్పటికప్పుడు “సూపర్‌స్టార్” తో అలాంటి స్టెప్పులే వేయించి ఓకేనా అన్నట్లు మావైపు చూసి నవ్వారు.
Ads
పాటల చిత్రీకరణ అయిపోయాక ఆయన అసిస్టెంట్ ఆఫీస్‌కి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి, మేనేజర్స్‌కి మంచి షర్ట్ క్లాత్‌లు ఇచ్చి “మాస్టర్ గారు గిఫ్ట్ గా పంపారు మీకు” అని చెప్పాడు. ఆయన చేసే అన్ని సినిమాలకూ అలాగే పంపుతారు అని చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది.
ఆ తర్వాత కొద్దిరోజులకు, ఏదో గొడవలో క్షణికావేశంలో ఆయన చేసిన పని వల్ల ఆయనపైన క్రిమినల్ కేసులయ్యాయనీ, వాటి నుండి బైట పడటానికి ఆస్థులన్నీ హరించుకుపోయాయనీ, కుటుంబానికి కూడా దూరమయ్యారనీ చెప్పుకుంటుంటే విని బాధపడేవాళ్ళం. నిజమేమిటో మాకు తెలియదు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు…
నేను కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్న “మా ఆవిడ కలెక్టర్” అనే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు “మహాభారత్ గెస్ట్‌హౌస్’ దగ్గర ఆయన కనిపించి చెన్నైలో ఉండలేక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాననీ, ఎవరూ ఇక్కడ పెద్దగా అవకాశాలు ఇవ్వటం లేదనీ చెప్పారు. బాధనిపించింది.
అప్పటికి హైదరాబాద్‌లోనే మా సినిమాలో సిల్క్ స్మిత పాట ఒకటి షూట్ చెయ్యవలసి వుండటంతో ఆ పాట సలీం మాస్టర్ గారు చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారిని,ప్రొడ్యూసర్ కాస్ట్యూం కృష్ణ గారిని కన్విన్స్ చేసి ఒప్పించాం.
(అప్పటికే ఆయన తాగుడికి బానిస అయి సరిగా చేయలేకపోతున్నారని వారికి ఎవరో చెప్పారట)
అదే నిజమైంది.
పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఆయన బాగా తాగి పని చేయటంవల్ల, సిల్క్ స్మిత గారిని ఆయనేదో అన్నారని, ఆమె అలగటం వల్ల, పాట సంతృప్తిగా రాకపోవటం వల్ల , అక్షింతలు మాకు పడ్డాయి. దానికంటే ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గొప్పమాస్టర్ తన వృత్తిపైన తాను పట్టుకోల్పోవటమే కలుక్కుమనిపించింది.
“క్షణికావేశం” ఆయన విలువైన జీవితాన్ని దెబ్బకొట్టింది.
“తాగుడు వ్యసనం” ఆయన మహోన్నతమైన కళని దెబ్బతీసింది.
“కనికరం లేని కాలం” ఆ మంచి మనిషిని తనలో కలిపేసుకుంది.
(ఫోటోలో సలీం గారి పక్కన ఉన్న బక్క పలుచ తెల్ల చొక్కా అబ్బాయిని నేనే) ________ దేవీప్రసాద్.
Share this Article