.
మనం చాలాసార్లు చూసిందే రాహుల్ గాంధీ అపరిపక్వ వ్యాఖ్యలు, విమర్శలు… దేశం, జాతి అనే ఆలోచన కూడా ఉండదు తనకు… క్షమించాలి, తను నమ్ముకున్న టీమ్‌కు… ఇప్పుడూ అంతే…
విషయం ఏమిటంటే..? మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఏదో పుస్తకం రాశాడు… దాన్ని మార్కెెట్లోకి అనుమతించడం మీద ప్రభుత్వం సందిగ్ధావస్థలో ఉంది… ఈలోపు రాహుల్ ఆ పుస్తకాన్ని పట్టుకొచ్చి… ఇందులో ఏముందో తెలుసా…
Ads
చైనా మన మీదకు దండెత్తుతున్న వేళ… ఆర్మీ దిక్కుతోచక… నిర్ణయమేమిటి పాలకా అనడిగితే…. మోడీ ఏమీ పట్టనట్టు వదిలేశాడట… మీ ఇష్టం వచ్చినట్టు చేయి అన్నాడట… దేశ భద్రతను గాలికి వదిలేశాడట… అదే నరవణే రాశాడట… ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, ఎంత చేతకానితనం, ఎంత పిరికితనం అని హైపిచ్‌లో ఏదో అంటున్నాడు…
ఆ రణగొణ ధ్వని తగ్గింది కదా… అసలు విషయాల్లోకి, నిజాల్లోకి, రాహుల్ గాంధీకి అర్థం కాని కొన్ని నిజాల్లోకి వెళ్దాం… ఎందుకంటే, తన వంశ మూలపురుషుడు నెహ్రూ చైనాకు 36 వేల చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్‌చిన్‌ను చేతులెత్తేసి ధారాదత్తం చేయడం కాదు, అబ్బే, అక్కడేమీ మొలవదు అని సమర్థించుకున్న రోజులు కావివి…
కశ్మీర్‌లో వేల చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకుని, అందులోనూ 5 వేల చదరపు కిలోమీటర్లను చైనాకు అప్పగించిన రోజులు కూడా కావివి… 90 వేల మంది పాకీ సైనికులు బందీలుగా దొరికినా, ఆ పాక్ ఆక్రమిత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని, భారతీయ సైనిక ఖైదీలను విడిపించుకునే సోయి కూడా నాటి ప్రధాని ఇందిరలో కనిపించని రోజులు కావివి…

ఇక్కడ సమస్య వ్యూహం (Strategy) కాదు, ఆ వ్యూహాన్ని రాజకీయం (Politics) చేయడం… నరవణే తన పుస్తకంలో ఏమన్నాడో ముందుగా చూద్దాం…
‘‘చైనా ట్యాంకులు సరిహద్దు వైపు దూసుకొస్తున్నాయి… మేం రెడీగానే ఉన్నాం… కానీ మేం కాల్పులు మొదలుపెడితే అది ఓ యుద్ధంలా మారే ప్రమాదం కనిపిస్తోంది… ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేక రాజనాథ్‌సింగ్‌కు ఫోన్ చేశాను, స్పందన లేదు… అర కిలోమీటర్ దూరంలోకి వచ్చేశాయి చైనా ట్యాంకులు… ప్రభుత్వం నుంచి నిర్ణయం రావడం లేదు… మళ్లీ చేశాను… నేను ప్రధానితో మాట్లాడాను, ‘‘ఏది సముచితమో అది చేయండి అన్నాడు అని రక్షణ మంత్రి నాకు చెప్పాడు…’’
అవును, అది 2020… గల్వాన్… అన్‌పబ్లిష్‌డ్ కాాదు, ఆ పుస్తకం పబ్లిష్‌డ్, ఇదుగో మోడీ దేశభద్రతను గాలికి వదిలేశాడని సాక్షాత్తూ ఓ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అంటూ ఆ పుస్తకాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ వీరంగం నిన్నామొన్నా..!
నిజానికి నరవణే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు… మోడీ తమకు ఆ సంక్లిష్ట సందర్భంలో ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చాడని..! మరెందుకు రాహుల్ గాయిగత్తర రేపుతున్నాడు… ఈ దేశ ఆర్మీ, భద్రతకు సంబంధించి తను పదే పదే అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు… సరే, నరవణే రాసిన రాతలకు ఏవో వక్రబాష్యాలు సరే… కానీ…
ఫ్రీ హ్యాండ్ అంటే ఏమిటి..? ఏది సముచితమో అది చేయండి అంటే ఏమిటి..? అది పాజిటివా..? నెగెటివా..? ఎలా అర్థం చేసుకోవాలి..? (నిజానికి ఆర్మీ చీఫ్ వంటి కీలక పోస్టుల్లో పనిచేసినవాళ్లు ఏదేదో పుస్తకం రాయడం మీదే చాలా అభ్యంతరాలు, సందేహాలు… నైతికత మీదే బోలెడు విమర్శలు వస్తుంటాయి…)
నిజానికి ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం రక్షణ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఒక ‘గైడ్’ లాగా ఉండాలి… కానీ దురదృష్టవశాత్తు, మన దేశంలో అది ఒక ‘రాజకీయ ఆయుధం’ (Political Tool) గా మారిపోతోంది… ‘కామన్ సెన్స్’ రాహిత్యం… పరిణత సమాజాల్లో ఇలాంటి పుస్తకాలు వోకే, కానీ ఇండియా వంటి రాజకీయ పంకిల దేశాల్లో ప్రమాదకరం… ఆ స్పృహ రచయితకు లేదు…
-
ఏది సరైనదనిపిస్తే అది చేయండి” అనే మాటను… ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుంది అనేది కువిమర్శ అవుతుంది… ఎందుకంటే..?
అది క్షేత్ర స్థాయిలో ఉన్న సైనిక కమాండర్‌కు ఇచ్చిన “పూర్తి స్వేచ్ఛ” (Operational Freedom) గానే సైనిక పరంగా పరిగణించబడుతుంది… క్షేత్రంలో పరిస్థితులు నిమిష నిమిషానికి మారిపోతుంటాయి… ఢిల్లీలో కూర్చుని ప్రతి చిన్న విషయానికి ఆదేశాలు ఇవ్వడం కంటే, అక్కడ ప్రత్యక్షంగా పరిస్థితిని చూస్తున్న జనరల్‌కు “మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం” అని చెప్పడం అంటే… ప్రభుత్వం ఆయన సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంచిందని అర్థం. ..ఇది సైన్యం యొక్క నైతిక బలాన్ని (Morale) పెంచుతుంది…

“మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అనే భరోసా ఆ మాటల్లో కనిపిస్తుంది… గతంలో కొన్ని సందర్భాల్లో సైన్యం నిర్ణయం తీసుకోవడానికి వెనకాడటానికి కారణం—తర్వాత ప్రభుత్వం తమను సమర్థిస్తుందో లేదో అన్న భయం… కానీ ఇక్కడ ప్రధాని ఆ బాధ్యతను తాను తీసుకుంటానని పరోక్షంగా చెప్పినట్లు అవుతుంది… అదీ రక్షణ మంత్రి ద్వారా చెప్పించడం, అంటే సరైన చానెల్‌లో చెప్పడం…
‘రోల్ క్లారిటీ’ (Role Clarity)… ఇదీ మనం గమనించాల్సింది… ఒక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రతి వ్యవస్థా తన పరిధిలో స్వతంత్రంగా, అదే సమయంలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది… ఈ సందర్భంలో…
-
ఆర్మీ (జనరల్ నరవణే)…: క్షేత్రస్థాయిలో శత్రువును అడ్డుకోవడం, భౌతిక భద్రతను పర్యవేక్షించడం తన రోల్, బాధ్యత… అందుకే వారికి ఆ సమయంలో “నిర్ణయాధికారం” (Operational Freedom) ఇవ్వడం అత్యవసరం…
-
జాతీయ భద్రతా సలహాదారు (అజిత్ దోవల్)..: అన్ని ఏజెన్సీల (ఇంటెలిజెన్స్, మిలిటరీ, పోలీస్) సమాచారాన్ని క్రోడీకరించి, వ్యూహాత్మక సలహాలు అందించడం తన పని… ఇది ఒక రకమైన ‘బ్యాక్-ఛానల్’ మేనేజ్‌మెంట్…
-
విదేశీ వ్యవహారాల శాఖ (జైశంకర్)..: సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉన్నా, ప్రపంచ వేదికలపై దౌత్యపరంగా దేశం వాదనను బలంగా వినిపించడం, చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించడం తన బాధ్యత…
- రక్షణ మంత్రిత్వ శాఖ (రాజనాథ్ సింగ్)… క్లిష్టమైన సందర్భాల్లో సైన్యానికి గైడ్, అవసరమైన ఆదేశాలను జారీ చేసే బాధ్యత… ప్రధానితో సమన్వయం…
-
ప్రధాని (PMO)…: అందరినీ సమన్వయం చేస్తూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతిమ రాజకీయ నిర్ణయం తీసుకోవడం… ఫలానా ట్యాంకుల్ని అటాక్ చేయండి, బోఫోర్స్ గనుల్ని ఆపరేట్ చేయండి అని ప్రతి దశలో వేళ్లు పెట్టకూడదు… అంతిమ నిర్ణయాధికారి తను…
ఆర్మీ చీఫ్ తన పరిధిలోని యుద్ధ తంత్రాల గురించి రాస్తే అది ఓకే… కానీ, ప్రధాని లేదా రక్షణ మంత్రితో జరిగిన ప్రైవేట్ సంభాషణలను బహిర్గతం చేయడం వల్ల, భవిష్యత్తులో ఇతర దేశాలతో జరిగే దౌత్య చర్చల్లో (Diplomatic Negotiations) మన పట్టు సడలే అవకాశం ఉంటుంది… అందుకే “అన్నీ కలగలిపేయకుండా”, ఎవరి పరిధిలో వారు ఉండి, దేశ రహస్యాలను కాపాడటమే అసలైన రాజనీతిజ్ఞత…
ఆ పుస్తకంలో అదే ఉందో, లేక ఉన్న పాయింట్లను రాజకీయ దురుద్దేశాలతో వక్రీకరించి, ప్రచారంలోకి తీసుకువస్తున్నారో… ఆ పుస్తకాన్ని తటస్థులు చదివితే గానీ క్లారిటీ రాదు… సాధారణంగా సైన్యం, ప్రభుత్వం మధ్య జరిగే చర్చలు అత్యంత రహస్యంగా ఉంటాయి… ఉండాలి… వాటిని బహిర్గతం చేయడం వల్ల వ్యవస్థల మధ్య ఉండాల్సిన ‘నమ్మకం’ (Trust) దెబ్బతింటుంది…
మన దురదృష్టం కొద్దీ ఏమాత్రం పక్వత, విజ్ఞత లేని రాజకీయ నాయకుడు, ప్రతిపక్షనేత ఈ జాతికి రాహుల్ రూపంలో దొరికాడు...!! కటువుగా ఉన్నా పదే పదే నిరూపితం అవుతున్న నిజం ఇది..!!
Share this Article