.
Prabhakar Jaini …. సహనం+ ఓపిక+ నమ్మకం= సంజూ సాంసన్ … ఒక వైపు గల్ఫ్ వార్ తో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే, ప్రాణాలు, సంఖ్యల్లోనే, మిగిలిపోతుంటే, ఇటువంటి పోస్ట్ పెట్టడం సమంజసమా? అని అనిపించింది.
కానీ, ఎప్పటి భావోద్వేగాలను అప్పుడే పంచుకోవాలి కదా?
ఇక్కడ నేను సంజూ సాంసన్ ను ఒక క్రికెటరుగా కన్నా, ఒక వ్యక్తిగా విశ్లేషిస్తున్నా!
అరే, ఏం మనిషండీ? ఎంత ఓపిక, సహనం?
ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని ఛీత్కారాలు ఎదురైనా చిరునవ్వుతో స్వీకరించిన ఆటగాడిని ఈమధ్యలో చూసారా?
Ads
ప్రతిసారీ టీములో తీసుకుంటారు. కానీ, ఆడనివ్వరు. ఆట మధ్యలో మంచి నీళ్ళ బాటిల్స్ అందించడానికి మాత్రం పంపిస్తారు. లేదా ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానంలో ఆడడానికి పంపిస్తారు.
వరల్డ్ కప్ డే వన్ నాడు, ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచులో అతనికి తుది జట్టులో స్థానం లభించ లేదు. అందుకే అతన్ని రోహిత్ శర్మ ఓదారుస్తూ, ”ఏం బాధ పడకు. చాలా పెద్ద టోర్నమెంట్. ఎప్పుడైనా అవకాశం రావొచ్చు.” అని భుజం తట్టినప్పుడు కూడా అదే చిరునవ్వుతో కనిపించాడు.
అర్థమయిన వాళ్ళకు అది చిరునవ్వులా అనిపించదు. గుండెల్లో రగులుతున్న దుఃఖ మేఘాలను ఆర్పడానికి తనే సృష్టించుకున్న చిరుజల్లులా అనిపిస్తుంది. ఈ దృక్కోణంలో, ఆ చిరునవ్వును చూడండి. గుండెలు కోసేసే బాధను అణుచుకుని, స్థితప్రఙ్ఞుడిలా, కనిపిస్తాడు సంజూ సాంసన్.
అలాగే, లీగ్ దశలో, కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను, సంజూ సాంసన్ను ఎందుకు ఆడించడం లేదని విలేఖర్లు ప్రశ్నించినప్పుడు,
వెకిలిగా నవ్వుతూ,
“ఎవరి స్థానంలో ఆడించమంటారు? అభిషేక్ శర్మ స్థానంలోనా? లేక తిలక్ వర్మ స్థానంలోనా? ఏం మాట్లాడతారండీ?” అని చులకనగా కొట్టిపడేసినప్పుడు, ఆ వీడియో కూడా అతను చూసే ఉంటాడు. మనమే చూడగలిగివప్పుడు తనెందుకు చూడకుంటా ఉంటాడు.
ఒక ప్లేయరును తీసుకోవడం, తీసుకోకపోవడం, జట్టు అవసరాలననుసరించి, అది కేప్టెన్ నిర్ణయాధికారం. దాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ, ఇతర ప్లేయర్లతో పోల్చి సంజూని అవమానించడం ఎంత వరకు సమంజసం?
అతని మనసెంత నొచ్చుకుందో? అప్పుడు కూడా ఇలాగే ఒక విషాదపు నవ్వు నవ్వే ఉంటాడు.
ఇది సూర్యకుమార్ యాదవ్ అహంభావానికి చిహ్నం. సూర్యకుమార్ యాదవ్ తో పాటు, ఆయన చెప్పిన మిగిలిన ఇద్దరు ప్లేయర్ల నిర్వాకం, టోర్నమెంటంతా మనం చూసాం కదాండీ?
ఇదే సూర్యకుమార్ యాదవ్ బౌలింగులో పిచ్చి ప్రయోగాలు చేసి, ప్రపంచ నెంబర్ బౌలర్ బూమ్రాను పక్కన పెట్టి, స్థిరంగా ఆడుతూ, క్రమంగా వికెట్లు తీస్తున్న వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి, శివం దూబే తో బౌలింగ్ చేయించాడు. బూమ్రా వెస్ట్ ఇండీస్ మ్యాచులో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయకపోతే, మ్యాచ్ స్వరూపమే మారి, మనం ఇంట్లో కూచునే వాళ్ళం.
దూబే, శ్రీలంకతో మ్యాచులో, అదీ సూపర్ 8 మ్యాచులో, రెండు ఓవర్లలో నలభై ఆరు పరుగులిచ్చాడు. వెస్ట్ ఇండీస్ మ్యాచులో అభిషేక్ శర్మ పది పరుగులు చేసి ఔటవ్వడమే కాకుండా, క్యాచులు, బౌండరీలు వదిలి కావలసినంత నష్టం చేకూర్చాడు. సూర్యకుమార్ యాదవ్ కు ఒక స్ట్రాటజీ లేదు, తోటి ఆటగాడి పైన గౌరవం, మర్యాద లేదు.
క్రికెట్టు టీములోని ఇద్దరు ప్రపంచ స్థాయి ఆటగాళ్ళను, జడేజాను బయటికి పంపి, ప్రాంతీయ విభేదాలు మనసులో పెట్టుకుని, కొంత మంది తెల్లతోలు గాళ్ళను పాంపర్ చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది, నాకైతే.
విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కూడా సంజూ ముఖంలో అదే ప్రశాంతత. అదే నిబ్బరం, అదే చిరునవ్వు. అతను ఒక మతానికి చెందిన వాడైనా, మూడు మతాలకూ సమానంగా, కృతఙ్ఞత తెలియచేసుకున్నాడు.
మ్యాచిని గెలిపించిన చర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్, టోపీ తీసి అభినందిస్తున్నప్పుడూ, సంజూ అదే చిరునవ్వుతో ఉన్నాడు. అప్పుడది విషాదపు నవ్వు కాదు. విజయగర్వంతో కూడిన నవ్వు. కానీ, ఆ గర్వం బయటకు కనపడదు.
YES, I AM ARRIVED అని ఒక ప్రకటన చేసినట్టుగా ఉంది అతని నవ్వు.
ఆటల్లో ప్రతీసారీ గెలవాలని లేదు. కొన్ని చీకటి రోజులు, బ్యాడ్ ఫేజ్ లు ఉంటాయి. కానీ, ఇతర ఆటగాళ్ళకు లభించిన సహానుభూతి, సంజూ పట్ల, పదకొండేళ్ళుగా ఎందుకు లేదన్నదే నా బాధ.
ఈ విజయంతో, అతని భార్య, తల్లి కూడా సంతోషించారు. ఇంత వరకూ ఎప్పుడూ టీవీల్లో వాళ్ళను చూపించలేదు. ఎంత సేపూ హై క్లాస్ గర్ల్ ఫ్రెండ్స్ ను మాత్రమే చూపించారు.
సంజూ శ్రీమతి ఒక మాటన్నారు.
“ఇప్పటి వరకు మీరంతా సంజయ్ ఆటను చూసి ఆనందించారు. ఇప్పుడు మాత్రం, రెండు సెకన్ల టైం తీసుకుని అతన్ని అభినందించండి”
నేను కూడా అదే అంటాను.
అతని వ్యక్తిత్వానికీ, అతని సహనానికీ, అతని క్రీడానైపుణ్యానికి…
హ్యాట్సాఫ్ సంజూ…. మై డియర్!
ప్రభాకర్ జైనీ
Share this Article