Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…

April 19, 2026 by M S R

.

ఒక హీరో… ఒక అక్క… ఆమెకేమో హింస నచ్చదు… హీరోకు హింస తప్ప మరో మార్గం తెలియదు… మార్కెట్‌లో నడుచుకుంటూ వెళ్తుంటారు… రౌడీలు ఎటాక్ చేయబోతారు… తెలుగు సినిమా హీరో కదా, వెంటనే కనిపెడతాడు… కానీ ఆమెకు గొడవలు నచ్చవు కదా… సో, ఆమెకు తెలియకుండా ఒక్కొక్కడినీ ఆమె దృష్టికి రాకుండా దంచి కొడతాడు… పాపం, తెలుగు రౌడీలు కదా, చచ్చినట్టు భరించాల్సిందే, నోరు మూసుకుని..!

అరె, 16 ఏళ్ల క్రితం ‘డార్లింగ్’ సినిమాలో ప్రభాస్ ఇలాంటి ఫైటే చేశాడు కదా అంటారా…? అవును, అదే కొత్తగా వచ్చిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే సినిమాలో నాగశౌర్య కూడా సేమ్ సేమ్… దాన్ని యథాతథంగా కాపీ కొడితే ప్రేక్షకుడు ఛీకొట్టడా అంటారా..? భలేవారే, అంత ఆలోచిస్తే అది నాగశౌర్య సినిమా ఎందుకవుతుంది..? మన తెలుగు సినిమాలే అలా ఏడుస్తున్నాయి కదా చాలావరకు…

Ads

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మేకర్స్ ఏ కాలంలో ఉన్నారో తెలియదు గానీ ‘బ్యాడ్ బాయ్’ ఔట్ డేట్ ఫీలింగ్ కలిగించడంలో ఈ ఒక్క ఫైటుకే పరిమితం కాలేదు… తొలి నిమిషం నుంచి చివరి వరకు ఆ ‘ఔట్ డేటెడ్’ వాసనలు గుప్పుమని కొడుతూనే ఉంటాయి… ఓసారి గట్టిగా మరోసారి అనుకొండి, సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… పదే పదే…

ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని పర్లేదనే సినిమాలిచ్చిన కథానాయకుడు నాగశౌర్య… హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లయింది… ‘రంగబలి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు… ఇంత గ్యాప్ తరువాత ఏదైనా కాస్త ‘తెలివైన’ సినిమా ఏదో చేస్తాడని అనుకుంటాం కదా.,. నో, నేను మారను, నేనింతే అన్నట్టుగా ఉంది సినిమా… కథలోకి వెళ్దాం అంటారా..? సరే…

కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం… తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు… తెర వెనుక ఉండి ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు… అలాంటిది తన అక్కను ఎవరో చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి… వాళ్ల సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతాడు కార్తీక్…

కదిరికి వస్తాడు… ఆ ప్రాంత నాయకుడు గోవిందప్ప అక్కను టార్గెట్ చేశాడని తెెలుసుకుని, అతణ్ని కస్తూరి కళ్ల ముందే చంపేస్తాడు కార్తీక్… ఐతే నాయకుడు వరదా రెడ్డి రూపంలో కస్తూరికి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని తెలుసుకుంటాడు… అసలు వాళ్లతో అక్క పంచాయితీ ఏమిటి..? హీరో ఏం ఉద్దరించాడు అనేదే కథ…

సినిమా చూస్తుంటే నాగశౌర్య అప్పుడెప్పుడో ఈ సినిమా అంగీకరించాడనీ, హడావుడిగా చకచకా చుట్టేసి ప్రేక్షకులకు మీదకు ‘మీ ఖర్మరా భయ్’ అన్నట్టు వదిలారని అర్థమవుతూనే ఉంటుంది… తను కూడా ఏదో చేశానులే అన్నట్టు నడిపించేశాడు… దర్శకుడు కూడా పెద్ద రిస్క్ తీసుకోలేదు, మైండ్ అప్లయ్ చేయడం కూడా వేస్ట్ అనుకున్నాడు… టాలీవుడ్ మాస్ హీరోలు దశాబ్దాల ముందు చేసిన యాక్షన్ విన్యాసాలను అతను ఇందులో ట్రై చేశాడు…

‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్ లాగా ముఖానికి పసుపు రాసుకుని విలన్ తల నరికాడు… ‘మిర్చి’లో ప్రభాస్ మాదిరి ముఖానికి గుడ్డ చుట్టుకుని రౌడీల మీద మెరుపు దాడి చేశాడు… అందులోలాగే విలన్‌ కు ముఖం చూపించకుండా వెనుక నుంచి పట్టుకుని అతడికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు… ఇలా తనకు ఏమాత్రం నప్పని ఎన్నెన్నో మాస్-యాక్షన్ విన్యాసాలు చేశాడు శౌర్య… ఎక్కడా ఒరిజినాలిటీ అన్నదే కనిపించదు…

మీరు శౌర్యను ఇష్టపడతారా..? మీరు కూడా సినిమా చూస్తే హఠాత్తుగా తనను పాపం అని జాలిపడటం స్టార్ట్ చేస్తారు… హారిస్ జైరాజ్ లాంటి లెజెండరీ సంగీత దర్శకుడు కూడా చాలా మొక్కుబడిగా పాటలు… బీజీఎం లాగించేశాడంటే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఎంత బ్యాడ్ మూవీనో అర్థం చేసుకోవచ్చు… ఏదో డబ్బు తీసుకున్నామా, చేశామా అన్నట్టుగా…

1. నాగశౌర్యకు ఈ మాస్ పోకడ అస్సలు నప్పదు… 2. హీరోయిన్ విధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… (విధివశాత్తూ)… అందంగానూ లేదు… అభినయమూ ఆకట్టుకోదు… ఆమెతో పోలిస్తే హీరో అక్క పాత్రలో కనిపించిన శ్రీదేవి విజయ్ కుమార్ బెటర్… 3. పేరున్న నటులు చాలామంది ఉన్నారు కానీ… ఎవరికీ సరైన పాత్ర పడలేదు… 4. దర్శకుడిగా రమేష్ అని పేరు వేశారు కానీ… మధ్యలో చిరాకెత్తి వదిలేస్తే ఇంకెవరో సినిమాను పూర్తి చేసినట్లుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?
  • సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…
  • పాపం ప్రతాప్… పాపం ప్రేక్షకుడు… టైటిల్ జస్టిఫికేషన్ ఎవరికి..?!
  • రాహుల్ గాంధీ పోటీ చేయలేడా ఇక…? పౌరసత్వానికే ముప్పుందా..?
  • ఈ ఇద్దరు… మొన్న బ్లాక్ బస్టర్స్… నిన్న ఫ్లాప్ షో…
  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!
  • ఇప్పుడైతే శోభన మోహన్‌బాబును మూడు చెరువుల నీళ్లు తాగించేది..!!
  • ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…
  • బీహార్ ‘సామ్రాట్’ చౌదరి – అబ్బో, నువ్వు మామూలోడివి కాదు బాసూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions