Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…

April 22, 2026 by Rishi

పూర్వ తిరుగుబాటు ముఖ్యమంత్రి
నాదెండ్ల భాస్కరరావు కనుమూత

  • రేపు సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు

“తెలుగుదేశం పార్టీ నాది, నేనే పెట్టించా. ఎన్టీఆర్ హీరో కాబట్టి జనం ముందు ఆయన్ని నిలబెట్టా. నా ఆలోచనలతోనే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చా. మూర్ఖుడు ఎన్టీఆర్, అతని దుందుడుకు చర్యలతో రాష్ట్రం బేజారైపోతే నేను ముఖ్యమంత్రి అయ్యాను. టైమ్ నాతో సహకరించలేదు. ప్రాంతీయ పార్టీ పెట్టి తప్పు చేశాను మీకు మనవి చేస్తున్న “…

ఇవి నాతో నాదెండ్ల భాస్కరరావు మనసుతో మాటాడిన మాటలు! చిన్న వారైనా పెద్దవారైనా ఒదిగిపోయి “మనవి చేస్తున్న” అంటూ మాట్లాడటం ఆయన నైజం! జీవితాంతం “ఎన్టీఆర్ కు వెన్నుపోటు” అనే మచ్చను మూట గట్టుకుని అత్యున్నత ముఖ్యమంత్రి పదవి అధిరోహించి కూడా రాజకీయంగా తృప్తి లేని జీవితం గడిపి, అదే ముద్రతో చివరి వరకు కొనసాగి ఇవాళ ఏప్రిల్ 22 ఉదయం వెళ్లిపోయారు. 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన రోజునే మీడియా చనిపోయారని వదంతులు పుట్టిస్తే ఆయన నాకు ఫోన్ చేశారు. “అయ్యా నేను బతికే వున్నా, మీ మాటగా మీడియాకు చెప్పండి” అన్నారు. ఆరోజు కాంటినెంటల్ ఆసుపత్రిలో ఉండి కూడా, “ఇంట్లోనే ఉన్నానని చెప్పండి” అన్నారు. నేను అదే ఆరోజు రాశాను. ఇవాళ “ఇక సెలవు” అని కనుమూశారు. వారి వయసు 90 సంవత్సరాలు.

Ads

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నాదెండ్ల భాస్కరరావు నెంబర్ టు స్థానంలో వుండే వారు. కీలక విషయాల్లో నాదెండ్ల భాస్కరరావు సూచనలే ఎన్టీఆర్ తీసుకునే వారు! అయితే రాను రాను కొద్ది రోజుల్లోనే నాదెండ్ల భాస్కరరావు “అంతా నాఇష్టం” అనే స్థాయికి వెళ్లారు! ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా టెక్సాస్ వెళ్లారు! ఆ సమయంలో నాదెండ్లకు సర్వం అప్పగించారు. ఎన్టీఆర్ ఫ్లైట్ ఎక్కడం ఆలస్యం ఇక నాదెండ్ల మనసులో దుర్బుద్ధి పుట్టింది!

ఏ రోజుకారోజు ఎన్టీఆర్ కు రిపోర్ట్ ఇవ్వాల్సిన భాస్కరరావు ఫోన్ కూడా చేయలేదు! దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు 1984 ఆగస్టు 14న తిరిగి వచ్చిన ఎన్టీఆర్ కు బేగంపేట్ విమానాశ్రయంలో నాదెండ్ల భాస్కరరావు స్వాగతం పలికారు. అక్కడ నాదెండ్ల మొఖం కూడా చూడకుండా ఎన్టీఆర్ నేరుగా సెక్రటేరియేట్ చేరుకుని నాదెండ్ల భాస్కరరావును మంత్రి వర్గం నుంచి తొలగించారు. అంతే ఆగస్టు 15 తెలుగుదేశంలో సంక్షోభం మొదలైంది.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గవర్నర్ రాంలాల్ కు ఫోన్ చేయడం, కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి వాదులను కలుపుకుని తనకు 111 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నాదెండ్ల భాస్కరరావు గవర్నర్ రాంలాల్ ను కలసి విజ్ఞప్తి చేయడం జరిగిపోయాయి. అప్పటికే ఇందిరాగాంధీ చెప్పి ఉండటంతో గవర్నర్ ఆయనకే వత్తాసు పలికారు. తనకు 158 మంది మద్దతు ఉందని ఎన్టీఆర్ ఎమ్మెల్యేల పేర్లతో సహా ఇచ్చినా పక్కన పెట్టేశారు. 16వ తేదీ ఉదయం నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేశారు. జీవన్ రెడ్డి, నన్నపనేని లాంటి వారితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ నెల రోజులు గడువు ఇచ్చారు. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయిపోయారు.

గుండె శస్త్ర చికిత్స చేసుకుని రెస్ట్ తీసుకోవాల్సిన ఎన్టీఆర్ మళ్ళీ చైతన్య రధం ఎక్కారు. ప్రజాస్వామ్య ద్రోహం, ప్రజాస్వామ్యం హత్య అంటూ జనంలోకి వచ్చారు. ఇందిరాగాంధీని, నాదెండ్లను మాటలతో చీల్చి చెండాడారు. జనం బ్రహ్మ రధం పట్టడం చూసి అటు ఇందిరాగాంధీ, ఇటు రాంలాల్ అవాక్కయ్యారు. అంతే నెల రోజుల తరువాత బలం నిరూపించుకోలేక ముందస్తు రాజీనామా చేసేశారు.

నెల రోజుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఎంపి అయినా ఎక్కువ కాలం వుండలేదు! పదేళ్ల క్రితం అమిత్ షా ను కలసి బిజెపి కండువా కప్పుకున్నా ఆయన మనసులో కోరుకున్నట్లుగా రాజ్యసభ సభ్యులు కాలేకపోయారు. ఆంతటితోనే భాస్కరరావు రాజకీయ జీవితం ముగిసిపోయింది!

జనం తిరస్కరించడంతో మెయిన్ మీడియా కూడా అప్పటి నుంచి దూరం పెట్టింది. ఆయన కూడా మౌనం అయిపోయారు. ఈమధ్య కాలంలో అడపా దడపా సోషల్ మీడియాలో యు ట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు తననే ఆయన సమర్థించుకున్నారు. జనం అర్ధం చేసుకోలేకపోయారని చెప్పారు. అప్పుడప్పుడు నేను కలసినప్పుడు అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకున్నారు.

నిజానికి ఆయన ఆత్మకథ రాయాలని నన్ను పిలుచుకున్నారు. మేము కూర్చున్న ప్రతిసారి సబ్జెక్ట్ ఎటేటో వెళుతుండేది! అలా వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో “నిజాలు తనతోనే అంతమైపోనీ” అన్నారు. మొత్తానికి అలాగే ఇవాళ తనతోనే చరిత్ర కాలగర్భంలో కలసిపోయింది!

నాదెండ్ల భాస్కరరావు బతికుండగానే కుటుంబ సభ్యులకు చెప్పుకున్నారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో సాగనంపొద్దు, పంజాగుట్ట స్మశాన వాటికలోనే తన అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. వారి కోరిక మేరకు రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్ మంత్రి వర్గంలో వివిధ శాఖలు నిర్వహించారు.1998లో ఖమ్మం నుంచి ఎంపిగా పోటీ చేసి గెలిచారు. అదే ఇక చివరి ఎన్నికలు! మహా రాజకీయ మేధావి భాస్కరరావు ఆరోజు రామారావుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా ఉండి ఉంటే, చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి ఉండేది కాదు.

నాదెండ్ల భాస్కరరావు అందరి సహకారంతో ముఖ్యమంత్రి అయి ఉండేవారు! భాస్కరరావు రాజకీయాల్లో చక్రం తిప్పుతూ బీష్మడుగా గొప్ప పేరు తెచ్చుకుని వుండే వారు! ఆయన చేసిన ఆ నెల రోజుల వివాదం వెంటాడింది. ఆతరువాత జీవితాంతం వివాదరహితుడిగా వున్నా జనం మాత్రం క్షమించలేక పోయారు. కుమారుడు మనోహర్ ను ఆదరించారు. ఆ మాయని మచ్చ తనపై పడకుండా వారసుడు నాదెండ్ల మనోహర్ మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి ఒక రాజకీయ శకం ముగిసిపోయింది! నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…… డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…
  • నేరగాడి ప్రేమ కథ… ఈ రోతగాడి జీవితంలో మరో ఇంట్రస్టింగ్ పార్శ్యం…
  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!
  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions