.
ఓలా, ర్యాపిడో, ఉబెర్ … టెక్నాలజీ, కమీషన్ల వ్యవస్థతో ఈ రైడ్ హెయిలింగ్ మొదట్లో ప్రయాణికులకు అంతులేని ఊరట… సరిగ్గా ఇంటి వద్ద నుంచి పికప్, ఇంటి వద్దకే డ్రాప్, రీజనబుల్ టారిఫ్… ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీల దోపిడీల నుంచి రక్షణ… అటు రాను, ఇటు రాను, ఎంత ఎక్కువిస్తవ్, మీటర్ వేయను… ఈ మాటలే కాదు, అసలు వికలాంగుల్ని, ముసలోళ్లను, రోగుల్ని ఇంటి నుంచి ఎటైనా తీసుకుపోవాలంటే నరకం…
ఇవి వచ్చాక బోలెడంత ‘సౌకర్యం- ఊరట’ అందుబాటులోకి వచ్చింది… పదేళ్లలో అదీ అనేక అవలక్షణాలను సంతరించుకుంది… వాటితో అవస్థలు ఏమిటో వాటిని యూజ్ చేసే అందరికీ తెలిసిందే… ఇక్కడ అవన్నీ ఏకరువు పెట్టదలుచుకోలేదు… అదేసమయంలో సొంత వాహనాలుండి, ఈ సిస్టంలో ఉన్న డ్రైవర్లకు కూడా సుఖమేమీ లేకుండా పోయింది…
Ads
ఆ కమీషన్ల ప్లాట్‌ఫారాలే అడ్డగోలుగా లాభపడ్డాయి… జవాబుదారీతనం లేదు వాటికి… డ్రైవర్లు, ఈ కమీషన్ వ్యవస్థలు చేసే తప్పులకు కూడా వినియోగదారుడినే శిక్షించే పరిస్థితి… గిరాకీ పెరిగినప్పుడు అడ్డగోలు చార్జీలు… కర్నాటక వంటి కొన్నిచోట్ల ఈ అడ్డగోలు కమీషన్ల బారి నుంచి రక్షణకు డ్రైవర్లే సొంతంగా ఓ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నారు, హైదరాబాదులో కూడా ఉంది, క్లిక్ కాలేదు, అదెవరికీ తెలియదు…
మరి ప్రయాణికుల రక్షణకు కేంద్రం ఏమీ చేయలేదానేది ప్రశ్న… కేంద్ర ప్రభుత్వం 2020లోనే మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను రూపొందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంది… రవాణా అనేది ‘స్టేట్ సబ్జెక్ట్’ కావడంతో, రాష్ట్రాలు కూడా కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది… అమలు చేయాల్సి ఉంది…
2025లో మహారాష్ట్ర, చండీగఢ్ వంటి రాష్ట్రాలు తెచ్చిన నూతన గైడ్‌లైన్స్, పతనావస్థకు చేరుకున్న ఈ రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక ‘సర్జికల్ స్ట్రైక్’ లాంటివి… కొత్త మార్గదర్శకాలు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్లు మాత్రమే కాదు, అవి డ్రైవర్ వృత్తికి గౌరవాన్ని, ప్రయాణికుడికి భద్రతను ఇచ్చే ప్రయత్నం…
-
ఆర్థిక కోణం…: ఛార్జీలో 80% వాటా డ్రైవర్‌కే చెందాలనే నిబంధన ఒక గేమ్ చేంజర్… ఆర్థిక స్థిరత్వం ఉన్న డ్రైవర్ ప్రశాంతంగా వాహనాన్ని నడపగలడు, ఇది రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది…
-
శిక్షణే ఆయుధం…: 30 గంటల ఇండక్షన్ శిక్షణ ద్వారా లింగ సమానత్వం, వికలాంగుల పట్ల మర్యాద వంటి అంశాలను నేర్పడం వల్ల ‘డ్రైవింగ్’ అనేది ఒక నైపుణ్యంతో కూడిన వృత్తిగా మారుతుంది…
-
సాంకేతిక భద్రత…: పానిక్ బటన్లు, జీపీఎస్ ట్రాకింగ్‌తో పాటు ప్రతి వాహనానికి 8- 9 ఏళ్ల వయోపరిమితి విధించడం వల్ల ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందుతాయి…
ప్రైవేట్ కంపెనీల లాభార్జన యావ ప్రజా అసౌకర్యానికి దారితీసినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అనివార్యం… సర్జ్ ప్రైసింగ్‌పై 1.5 రెట్ల పరిమితి, రద్దు జరిమానాల కఠినతరం వంటి చర్యలు గిగ్ ఎకానమీలో (Gig Economy) కార్మికుల హక్కులను కాపాడటమే కాకుండా, వినియోగదారుడిని ‘రాజు’గా గుర్తిస్తాయి…
రైడ్-హెయిలింగ్ రంగం ఇకపై కేవలం ఒక సాఫ్ట్‌వేర్ యాప్ కాదు…; అది ప్రజా రవాణా వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన భాగం… మరి తెలంగాణ ప్రభుత్వానికి ఈ సంస్కరణలు, కొత్త గైడ్ లైన్స్ ఎందుకు చేతకావడం లేదు..? అసలు ఇలాంటివి ప్రభుత్వ ముఖ్యులకు సలహా ఇచ్చేవాళ్లున్నారా..? షోరూముల్లోనే రిజిస్ట్రేషన్ అనే విధానం అమల్లోకి తీసుకురావడానికి బోలెడంత ఉద్దేశపూర్వక జాప్యం ప్రదర్శించిన రవాణా శాఖ ఈరోజుకూ దాన్ని సక్సెస్ చేయలేకపోయింది…
మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘పౌరసేవల ప్రక్షాళన, సంస్కరణ’పై దృష్టి పెట్టాలి… ఖర్చు లేకుండా, ఖజానాకు భారం లేకుండా జనం మెప్పుపొందే అనేక మార్గాలున్నాయి, అవసరం కూడా… ఐతే అధికారులు, రాజకీయ నాయకులు గాకుండా… ఇలాంటి పౌరసేవలపై ‘ప్రేమ’ ఉన్న వాళ్లతో తనకు ఓ టీమ్ అవసరం..!!
Share this Article