.
సందర్భం… ఢిల్లీలో జరిగిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) 75వ వార్షికోత్సవ వేడుక… దీనికి ఒలింపిక్ షూటర్, ఇండియన్ ప్రైడ్ మనూ భాకర్ ముఖ్య అతిథి… కార్యక్రమంలో భాగంగానో, తరువాతో మీడియా మీట్… ఆమె అడ్రెస్ చేస్తోంది… సరే, అసందర్భ, అసంగత, అవివేక, అప్రాచ్యపు ప్రశ్నలు అడగడంలో మన ఫిలిమ్ జర్నలిస్టులవి చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం కదా గతంలో… సేమ్, అక్కడ స్పోర్ట్స్ జర్నలిస్టులు కూడా మేమేం తక్కువ అన్నట్టుగా ఆమెకు ఓ పిచ్చి ప్రశ్న సంధించారు…
ఐపీఎల్‌లో రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఆటపై మీ అభిప్రాయం ఏమిటి..? ఇదీ ప్రశ్న… పక్కా అసందర్భపు ప్రశ్న… అక్కడ జరుగుతున్నది రైఫిల్ అసోసియేషన్, షూటింగ్ క్రీడకు సంబంధించిన కార్యక్రమం… పైగా మీడియాను ఫేస్ చేస్తున్నది ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ప్రతిభాశీలి… అక్కడ క్రికెట్‌కు సంబంధించిన, అదీ ఓ కుర్ర క్రికెటర్ గురించిన ప్రశ్న ఎందుకు..?
Ads
ఉత్త నాన్సెన్స్ ప్రశ్న, అవివేకం అని నెటిజనం తమ విమర్శలతో ఈడ్చికొట్టారు ఆ ప్రశ్నల తీరును… నిజానికి ఒక ఒలింపిక్ ఛాంపియన్‌ను ఆమె క్రీడకు సంబంధం లేని విషయంపై, అది కూడా ఒక వర్ధమాన క్రికెటర్ గురించి అభిప్రాయం అడగడం ఆమె ఘనతను అక్కడ తక్కువ చేయడమేనని క్రీడాభిమానులు మండిపడ్డారు…
అసలే ఈ దేశానికి క్రికెట్ పిచ్చి… దాంతో ఇతర ఆటలకు ప్రాచుర్యం ఉండదు, ఎవరెన్ని ఘనతలు సాధించినా గుర్తింపూ ఉండదు, మరీ ఒలింపిక్స్ దాకా వెళ్తే కాస్త గుర్తింపు… కొద్దిగా బ్యాడ్మింటన్, టెన్నిస్… అంతే… కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ… ‘‘ఆమె ఒక ఒలింపిక్ మెడలిస్ట్… ఆమెను వైభవ్ గురించి అడగడం ఆమె విజయాలను అవమానించడమే… కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలాంటి ప్రశ్నలు అడగకండి…” అన్నాడు… అంతేకాదు, మీకు “ధైర్యం ఉంటే ఎప్పుడైనా వైభవ్ సూర్యవంశీని మనూ భాకర్ గురించి అడగండి, అప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం… అసలు మనూ భాకర్ పేరు విన్నాడా తను..?” అంటూ మీడియా తీరును తప్పుబట్టాడు… కాదు, తూర్పారపట్టాడు…
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న అతి విపరీతమైన క్రేజ్ వల్ల ఇతర క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి పతకాలు తెచ్చిన వారిని కూడా క్రికెట్ గురించే ప్రశ్నలు అడగడంపై నెటిజన్లు “క్రికెట్ అస్థిత్వం మిగతా క్రీడలను మింగేస్తోంది” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు… ఇదంతా సరే, మనూ భాకర్ ఆ ప్రశ్నను ఏమాత్రం నెగెటివ్‌గా తీసుకోలేదు… పక్కా పరిణతితో, హుందాగా స్వీకరించి, భలే సమాధానం చెప్పింది…
‘‘సరైన గైడెన్స్, మంచి వ్యక్తుల తోడు ఉంటే వయసు అనేది కేవలం అంకె మాత్రమే… ప్రతిభకు వయసుతో పనిలేదు… 6 ఏళ్ల వయసులో అద్భుతాలు చేసేవారున్నారు, 60 ఏళ్లలోనూ చేసేవారున్నారు… సరైన మార్గదర్శకత్వం లభిస్తే వైభవ్ కచ్చితంగా ఇండియన్ క్రికెట్‌లో తదుపరి బిగ్ స్టార్ అవుతాడు…” ఎంత పద్ధతిగా బదులిచ్చిందో కదా…! షూటర్ కదా…, గురిచూసి, అక్యురేట్‌గా కొట్టడం అలవాటు కదా..!!
Share this Article