.
Subramanyam Dogiparthi ….. చిరంజీవి నట చరిత్రలో మరో క్లాసిక్ 1992 లో వచ్చిన ఈ ఆపద్బాంధవుడు . కొన్ని సినిమాలకు కనక వర్షం కురవకపోయినా ప్రశంసల వర్షం , అవార్డుల వర్షం కురుస్తాయి . ఆ నటుడి నట ప్రస్థానంలో ఒక మైలురాయిలాగా నిలుస్తాయి . అలాంటి సినిమాయే ఈ అపద్బాంధవుడు . శుభలేఖ , స్వయంకృషి సినిమాల తర్వాత చిరంజీవి విశ్వనాథ్ తో కలిసి పనిచేసిన సినిమా . ఈ సినిమాకు కూడా చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డుని పొందారు .
చిరంజీవి అద్భుతంగా నటించారు . మొదట్లో గోపాలుడిగా తర్వాత తనను ఆదరించి పెద్దవాడిని చేసిన కుటుంబానికి పాలకుడిగా , సంరక్షకుడిగా , అపద్బాంధవుడుగా గొప్పగా నటించారు . ముఖ్యంగా లేని పిచ్చిని తగిలించుకుని పిచ్చివాడిగా పిచ్చాసుపత్రిలో చేరి మీనాక్షి శేషాద్రిని బాగు చేసుకునే పాత్రలో చాలా గొప్పగా నటించారు .
Ads
ప్రముఖ రచయిత , దర్శకుడు జంధ్యాల నటించిన ఏకైక సినిమా కూడా ఇది . శంకర శాస్త్రిగారి లాగానే ఆత్మాభిమానం మెండుగా ఉండే పాత్ర . తన రచనలను చిరంజీవికి అప్పచెప్పే సీనులో చాలా గొప్పగా నటించారు . చిరంజీవిని కౌగిలించుకుని అతని చేతులలోనే మరణిస్తుంది ఆ పాత్ర . ఎంతో ఆర్ద్రతతో నిండిన సన్నివేశం .
శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తన పూర్ణోదయా బేనరుపై నిర్మించిన ఈ సినిమాకు కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం కళాతపస్వి కె విశ్వనాథునివే . అయిదు నంది అవార్డులు వరించాయి . మూడవ ఉత్తమ చిత్రం , ఉత్తమ నటుడు , ఉత్తమ రచయిత (జంధ్యాల) , ఉత్తమ కళా దర్శకుడు (చలం & అరుణ్ డి గోడ్కొవంకర్) , ఉత్తమ కొరియోగ్రాఫర్ (భూషణ్ లఖాండ్రీ) . రెండు ఫిలిం ఫేర్ అవార్డులు . ఉత్తమ నటుడు , ఉత్తమ దర్శకుడు (విశ్వనాథ్) .
ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవటానికి మరి కొన్ని కారణాలలో ఒకటి సంగీతం . కీరవాణి సంగీతం , సిరివెన్నెల , సి నారాయణరెడ్డి , భువనచంద్ర , మాడుగుల నాగ ఫణి శర్మ సాహిత్యం , బాలసుబ్రమణ్యం , చిత్ర మధుర గాత్రం , భూషణ్ లఖాండ్రీ , ప్రభుదేవా , సుచిత్ర నృత్య దర్శకత్వం ప్రాధాన పాత్ర వహించాయని చెప్పుకోవచ్చు .
చిరంజీవి నృత్యించే రెండు నృత్య నాటకాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి . మరీ ముఖ్యంగా దక్షయజ్ఞం నృత్య నాటకం . చిరంజీవి , మీనాక్షి శేషాద్రి తమ నృత్య విశ్వరూపాన్నే చూపారు . ఇంక ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా పాట . సిరివెన్నెల వారి కలం నండి జాలువారిన కవితా ముత్యాలు . ఈ పాటలో కూడా చిరంజీవి , మీనాక్షి శేషాద్రి నృత్య కౌశల్యం అభినందనీయం .
పిచ్చాసుపత్రిలో హీరోయిన్ని వినోదింపచేయటానికి చిరంజీవి నృత్యిస్తూ పాడే పాట ఓనమాలొప్పా శివాయప్పా . మేరా నామ్ జోకర్లో మహానటుడు రాజ్ కపూర్ గుర్తుకొస్తాడు . అంత గొప్పగా నృత్యించాడు . మరో అందమైన గ్రూప్ డాన్స్ పువ్వు నవ్వె గువ్వ నవ్వె . చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ శ్రావ్యంగా ఉంటుంది .
ఇతర ప్రధాన పాత్రల్లో గీత , అరుణ్ కుమార్ , శరత్ బాబు , అల్లు రామలింగయ్య , డబ్బింగ్ జానకి , బ్రహ్మానందం , నిర్మలమ్మ , శిల్ప , కల్పనారాయ్ , సుత్తి వేలు , సత్యనారాయణ , విజయ చందర్ , ఫణి , ముక్కు రాజు , కృష్ణవేణి , తదితరులు నటించారు . తూర్పు గోదావరి జిల్లా లోని పూడిపల్లి గ్రామం , చుట్టుపక్కల ఔట్ డోర్ షూటింగ్ జరుపుకుంది .
It’s a classic and an unmissable movie . ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు . ఆ తర్వాత విశ్వనాథ్ , మీనాక్షి శేషాద్రి , జంధ్యాల అభిమానులకు . అప్పుడప్పుడు టివిలో వస్తూ ఉంటుంది . యూట్యూబులో ఉంది . ఎన్ని సార్లయినా చూడతగ్గ క్లాసిక్ .
Share this Article