.
మహారాష్ట్రలోని పుణెలో జూన్ 18న జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 20 ఏళ్ల సియా గోయల్‌కు, కేతన్ అగర్వాల్‌తో పెద్దలు అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేశారు. కానీ, అప్పటికే మరొకరితో డేటింగ్‌లో ఉన్న సియా, ఆ పెళ్లిని కాదనే ధైర్యం చేయలేక.. చివరకు కాబోయే భర్తనే ప్రియుడితోకలిసి హత్య చేసింది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నా, ఈ ఘటన సమాజంలో ఉన్న ఓ భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది… “పేరెంట్స్ పరువు కోసం, పిల్లలు ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు!”
పెళ్లి వద్దని చెబితే తల్లిదండ్రుల పరువు పోతుందని భయపడిన సియా.. ఏకంగా కాబోయే భర్త ప్రాణం తీయడానికే మొగ్గుచూపిందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ తనదైన శైలిలో కొన్ని నిక్కచ్చి ప్రశ్నలు సంధించాడు. ఆయన ఏమంటున్నాడంటే..?
Ads
1. ‘మాట వినే పిల్లలు’.. ఇదో స్టేటస్ సింబల్!
మన దేశంలో, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపార కుటుంబాల్లో తల్లిదండ్రుల కంట్రోల్ ఒక ‘వ్యాధి’లా మారింది. పిల్లలు ఏం తినాలి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి.. అన్నీ వాళ్లే నిర్ణయిస్తారు. తమ పిల్లలు చెప్పిన మాట వింటే అది వాళ్లకు పెద్ద ‘స్టేటస్ సింబల్’. సియా కేసులో కూడా అదే జరిగింది. ఆమెకు వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని గానీ, 19 ఏళ్లకే పెళ్లి ఇష్టం లేదని గానీ ఆ కుటుంబాలకు పట్టలేదు. వారి దృష్టిలో ‘వంశ గౌరవం’ ముఖ్యం, పిల్లల మనసు కాదు.
2. బిజినెస్ అంటే ఇన్నోవేషన్ కాదు.. డెస్టినేషన్ వెడ్డింగ్స్!
కోట్ల టర్నోవర్ ఉండే బిజినెస్ ఫ్యామిలీలు, తమ కంపెనీలలో కొత్త టెక్నాలజీకో, రీసెర్చ్‌కో ఖర్చు పెట్టరు. కానీ, ఊరిలో పరువు కోసం మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో వందల కోట్లు తగలేస్తారు. చైనా వంటి దేశాలు రోబోటిక్స్, టెక్నాలజీలో దూసుకుపోతుంటే, మనవాళ్లు మాత్రం ఉదయ్‌పూర్‌లో పెళ్లిళ్లు చేసుకుంటూ ‘గొప్ప’ అనిపించుకోవడానికి ఆరాటపడతారు. వ్యక్తిగత స్వేచ్ఛ కంటే ఇమేజ్‌కే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత!
3. తప్పు ఎవరిది? పేరెంట్స్‌దా? జెన్-జీ (Gen Z)దా?
ఇక్కడ కేవలం పేరెంట్స్‌దే తప్పు అని అనలేం. పాతకాలపు పద్ధతులను ఎదిరించే ‘ధైర్యం’ నేటి యువతలో లోపిస్తోంది. పెళ్లి ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పే సత్తా లేకపోవడం, ఫైనాన్షియల్‌గా ఎదగకుండా ఇప్పటికీ ‘డాడీ మనీ’ మీద ఆధారపడటమే అసలు సమస్య.
చేతన్ భగత్ ఇస్తున్న క్లారిటీ ఇదే:
“మీరు ఆర్థికంగా స్వతంత్రులు కానంత వరకు, మీకు భావోద్వేగ స్వేచ్ఛ రాదు. మీ బిల్లులు మీ పేరెంట్స్ కడుతున్నంత కాలం, వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. ‘మై సపోర్ట్ సిస్టమ్’ అనే ముసుగులో కంఫర్ట్ జోన్‌లో బతకడం మానేయండి. మీకు నచ్చని విషయాలకు ధైర్యంగా ‘నో’ చెప్పడం నేర్చుకోండి. పరువు అనే ముసుగును తొలగించి, మీ కాళ్ల మీద మీరు నిలబడండి. అప్పుడే ఇలాంటి దారుణాలు ఆగుతాయి!”
మన ముచ్చట: తల్లిదండ్రులైనా, పిల్లలైనా.. మనిషి జీవితం కంటే విలువైనది ఏదీ లేదు. ‘గౌరవం’ పేరుతో ఒకరి స్వేచ్ఛను హరించడం, ఆ ఒత్తిడిలో బలి కావడం రెండూ ప్రమాదమే.
Share this Article