.
‘ఆరోజు మనదై ఉండాలి’… అది జీవితమైనా సరే, ఐపీఎల్ క్రికెట్ అయినా సరే… ఏదో ముందస్తు స్క్రిప్ట్ రాసి ఉన్నట్టుగా జరగదు… అనామకం అకస్మాత్తుగా రెయిజ్ అవుతుంది, తోపులు షాకులు తింటారు… నిన్నామొన్నా ఐపీఎల్ మ్యాచులు ఓ ఉదాహరణ…
పంజాబ్ జట్టు… వరుసగా ఓటమి ఎరుగకుండా అన్ని జట్లనూ గెలుస్తూ వచ్చింది కదా… శ్రేయస్ అయ్యర్‌ను మబ్బుల్లో తిప్పింది కదా… సీన్ కట్ చేస్తే… వరుసగా రెండు పరాజయాలు… రాజస్థాన్ జట్టు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే నిన్న గుజరాత్ జట్టు కూడా ఇంకో షాక్ ఇచ్చింది…
Ads
పేరుకు పంజాబ్ జట్టు ఇప్పటికీ పాయింట్ల టేబుల్‌లో టాప్ వన్… కానీ అది ఓడించలేనంత బలమైన జట్టు ఏమీ కాదని రాజస్థాన్, గుజరాత్ జట్లు నిరూపించాయి… నిన్న జరిగిన మ్యాచులో గుజరాత్ బౌలర్లు హోల్డర్, రబడ, సిరాజ్ నిప్పులు చెరుగుతుంటే… బాల్‌కు బ్యాట్‌ను తాకించడానికి కూడా వణికారు పంజాబ్ బ్యాటర్లు… 47 రన్స్‌కే టాప్ ఆర్డర్ టాప్ లేచిపోయింది…
గుజరాత్ జట్టులో ఎప్పటిలాగే సాయి సుదర్శన్, హఠాత్తుగా వాషింగ్టన్ సుందర్ మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి గెలుపు అందించారు… శ్రేయస్ అయ్యర్‌కు వరుసగా రెండో ఓటమి… మరో ఉదాహరణకు వెళ్దాం…
వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు మీద ఎక్కడో పాయింట్ల టేబుల్‌లో దిగువన కొట్టుకుంటున్న అనామక కలకత్తా జట్టు విజయం సాధించింది… హైదరాబాద్ బ్యాటర్లు హెడ్, ఇషాన్ బాగానే ఆడినా, తరువాత వచ్చిన వాళ్లు వరుసగా బ్యాట్లు ఎత్తేయడంతో కేవలం 165 రన్స్ చేయగలిగారు… ఈరోజుల్లో 165 స్కోర్ డిఫెండ్ చేసుకోవడం ఎంత కష్టం..? అసలే 200 ప్లస్ టార్గెట్లను కూడా ఉఫ్ అని ఊదేస్తున్న రోజులు…
తరువాత బ్యాటింగుకు దిగిన కలకత్తా రహానే, ఫిన్ అలెన్, రఘువంశీ అలవోకగా ఛేదించేశారు… ఈ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు కూడా..!
సో, పంజాబ్, హైదరాబాద్ జట్లకు… పెద్దగా ఆడటం లేని గుజరాత్, కలకత్తా జట్ల ద్వారా పరాజయం… అంతకుముందు బెంగుళూరు సిట్యుయేషన్ కూడా అంతే కదా… టాప్ టూ ప్లేసులో ఉన్న బెంగుళూరు మీద ఇదే గుజరాత్ జట్టు గెలిచింది… (కలకత్తా, గుజరాత్ వరుసగా మూడేసి మ్యాచులు గెలిచి, ఫామ్‌లోకి వచ్చాయి)…
అసలు విషయం ఏమిటంటే..? నిన్నా మొన్నా బెట్టింగ్ రాయుళ్లు బాగా దెబ్బతిన్నారు… మాంచి గెలుపుల మీద ఉన్నాయి కదా హైదరాబాద్, పంజాబ్ అనుకుని పందేలు కాస్తే తీరా రివర్స్ కొట్టింది… ఏమో, బెట్టింగులే మ్యాచుల ఫలితాల్ని శాసిస్తున్నాయా..? తెలియదు..!!
Share this Article