Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

DMK + AIDMK…! ఇదే జరిగితే తమిళ రాజకీయాల్లో చరిత్రాత్మకం..!!

May 7, 2026 by M S R

.

తమిళ రాజకీయాలు గంటగంటకూ అనుకోని మలుపులు తిరుగుతూ… హీరో విజయ్ సినిమాకన్నా ఉత్కంఠభరితంగా రక్తికడుతున్నాయి కదా… ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారనేది కాదు, నెంబర్ గేమ్… ఏం చేసినా తనకు మెజారిటీ లభించేట్టు లేదు… సరైన మెజారిటీ మార్గాలేమిటో, నిరూపణ ఏమిటో చూపించనిదే నేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించను అని భీష్మించాడు గవర్నర్… ఈ స్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పక్కన పడేసి… రెండు ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా..? దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న ప్రశ్న ఇది… సరే, ఓ పాత సందర్భం చెప్పుకుందాం మొదట…

తమిళ రాజకీయాల్లో ఆనాటి ఓ ఘట్టం ఒక అద్భుతమైన “What If” సినారియో… 1972లో ఎంజీఆర్ (MGR) డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే స్థాపించిన తర్వాత, ద్రవిడ ఓటు బ్యాంక్ రెండుగా చీలిపోయింది… దీనిని గమనించిన ఒడిశా నాయక దిగ్గజం బిజూ పట్నాయక్, 1979 సెప్టెంబర్ – అక్టోబర్ మధ్యలో వీరిద్దరినీ కలిపేందుకు గట్టి ప్రయత్నం చేశాడు…

Ads

1) బిజూ పట్నాయక్ ప్రతిపాదించిన ‘యూనిటీ ఫార్ములా’ ప్రకారం…

  • పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి…: డీఎంకే సంస్థాగత నిర్మాణం, క్యాడర్ మీద పట్టు ఉన్న కరుణానిధి పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి…

  • ముఖ్యమంత్రిగా ఎంజీఆర్…: అపారమైన ప్రజాదరణ ఉన్న ఎంజీఆర్ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలి…

  • లక్ష్యం…: అప్పట్లో కేంద్రంలో బలంగా ఉన్న ఇందిరా గాంధీ (కాంగ్రెస్) ప్రభావాన్ని తమిళనాడులో అడ్డుకోవడం…

2. అంకెలు ఎందుకు కీలకం అయ్యాయి?

1977 ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే, ఈ విలీనం ఎంత శక్తివంతంగా ఉండేదో అర్థమవుతుంది… AIADMK: 131 స్థానాలు (30% ఓట్లు), DMK: 48 స్థానాలు (25% ఓట్లు)… వీరిద్దరూ కలిస్తే సుమారు 55% ఓటు బ్యాంక్, 180 కి పైగా సీట్లు ఒకే గొడుగు కిందకు వచ్చేవి…. ఇది కాంగ్రెస్‌ను తమిళనాడులో నామరూపాలు లేకుండా చేసే భారీ వ్యూహం…

3. చివరి నిమిషంలో ఎందుకు విఫలమైంది?

అన్నీ సవ్యంగా సాగుతున్నాయి అనుకున్న తరుణంలో, మద్రాస్ (చెన్నై) విమానాశ్రయంలో ఒకే కారులో ప్రయాణించిన ఎంజీఆర్, కరుణానిధి విలీన పత్రాలపై సంతకం చేస్తారని అందరూ ఆశించారు… కానీ… రెండు పార్టీల్లోని ముఖ్య నేతలు (ముఖ్యంగా అన్నాడీఎంకేలోని నంజిల్‌ మనోహరన్‌ వంటి వారు) తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడి ఎంజీఆర్‌ను వెనక్కి లాగారు…

1972 నాటి విభేదాలు ఇంకా పచ్చిగానే ఉండటం వల్ల, కరుణానిధి పట్టున్న పార్టీ యంత్రాంగం తన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని ఎంజీఆర్ అనుమానించాడు… ఈ విలీనం జరిగితే తమ ఉనికి దెబ్బతింటుందని గ్రహించిన జాతీయ పార్టీలు తెర వెనుక రాజకీయాలు నడిపాయి… కానీ మెజారిటీ ఉంది కదా, అన్నాడీఎంకే డీఎంకేతో ఎందుకు కలవాలి..? ఇదే కదా సందేహం…

1977 ఎన్నికల తర్వాత ఎంజీఆర్ (MGR) నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోనే ఉంది… 131 స్థానాలతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు… అయితే, 1979లో బిజూ పట్నాయక్ ఈ విలీన ప్రయత్నాలు చేయడానికి ఒక బలమైన రాజకీయ కారణం ఉంది… అది కేవలం సంఖ్యాబలం కోసం కాదు, మారుతున్న కేంద్ర రాజకీయాల ప్రభావం వల్ల వచ్చింది…

1979లో కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయింది… చరణ్ సింగ్ ప్రధాని అయ్యాడు… ఆ సమయంలో కేంద్ర కేబినెట్‌లో అన్నాడీఎంకే కూడా భాగస్వామిగా ఉండేది… కానీ రాజకీయాలు వేగంగా మారుతుండటంతో, ఇందిరా గాంధీ మళ్ళీ పుంజుకుంటుందని అందరికీ అర్థమైంది…

అప్పట్లో కేంద్రంలో ఉన్న పార్టీలు, రాష్ట్రాల్లో తమకు నచ్చని ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఉపయోగించి బర్తరఫ్ చేసేవి… డీఎంకే, అన్నాడీఎంకే విడివిడిగా ఉంటే, ఇందిరా గాంధీ ఏదో ఒక పార్టీతో చేతులు కలిపి రెండో పార్టీని దెబ్బతీస్తారని బిజూ పట్నాయక్ భావించాడు… అందుకే, ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ… భవిష్యత్తులో ద్రవిడ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం కాకూడదని ఆయన ఈ విలీన ప్రతిపాదన తెచ్చారు…

ఈ విలీన ప్రయత్నం విఫలమయ్యాక, 1980లో ఊహించినట్లుగానే కేంద్రంలో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చింది… వెంటనే ఆమె ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది… ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కలిసినా, ఎంజీఆర్ తన ఒంటరి పోరాటంతో మళ్ళీ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకున్నాడు, అది వేరే కథ…


ప్రస్తుతానికి ఇది ఎలా వర్తిస్తుంది?

ఇప్పుడు 2026లో కూడా టీవీకే (విజయ్) రూపంలో ఒక కొత్త సవాలు ఎదురైనప్పుడు, మళ్లీ అదే “ద్రవిడ ఐక్యత” తెరపైకి రావడం గమనార్హం… విజయ్ మెజారిటీని అడ్డుకోవడానికి, జాతీయ పార్టీలను పక్కన పెట్టి డీఎంకే- అన్నాడీఎంకేలు చేతులు కలిపే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది…

చరిత్ర పునరావృతమవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరం… 1980లో మిస్ అయిన ఆ “యూనిటీ” ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నిజం కావచ్చు… కాకపోవచ్చు కూడా… ఒకవేళ డీఎంకే (59), అన్నాడీఎంకే (47) కలిస్తే… ఆ 106 స్థానాలకు తోడు పాత మిత్రపక్షాల మద్దతుతో టీవీకేకు అధికారం దక్కకుండా చెక్ పెట్టడం పక్కా ప్లాన్!

ప్రస్తుత అసెంబ్లీలో అంకెల లెక్క (మొత్తం స్థానాలు: 234)… ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్: 118… టీవీకే 108, డీఎంకే 59, ఎఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, పీఎంకే 4, లెఫ్ట్, వీసీకే, ముస్లిం లీగ్ కలిపి 10… బీజేపీ ఒకటి… 

విజయ్ పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం… కాంగ్రెస్ తన 5 సీట్లతో మద్దతు ఇస్తామన్నా, టీవీకే బలం 113 కి మాత్రమే చేరుతుంది… ఇంకా 5 సీట్ల కొరత ఉంది…

డీఎంకే కూటమిలోని లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు “విజయ్ సిద్ధాంతాలు స్పష్టంగా లేవు” అంటూ మద్దతును నిరాకరించాయి… దీంతో టీవీకేకు బయటి నుంచి మద్దతు లభించడం కష్టంగా మారింది… మెజారిటీ నిరూపించుకోలేని పక్షంలో ఎవరినీ ఆహ్వానించబోనని గవర్నర్ స్పష్టం చేయడంతో, విజయ్ ఇప్పుడు అదనపు ఎమ్మెల్యేల కోసం వెతకాల్సిన పరిస్థితి…

పళనిస్వామి (EPS) నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న సుమారు 30, 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం… మూడింట రెండొంతుల మంది బయటికి వస్తే తప్ప మద్దతు కుదరదు… లేకపోతే వాళ్లపై అనర్హత వేటు పడుతుంది…


 “ప్యూర్ ద్రవిడ” కూటమి – ఒక కొత్త ప్రయోగం… జాతీయ పార్టీల (BJP, Congress) ప్రమేయం లేకుండా ఉండాలని డీఎంకే – అన్నాడీఎంకే లోపాయికారీ ఒప్పందానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… డీఎంకే (59) + అన్నాడీఎంకే (47) కలిస్తే 106 అవుతాయి… వీరికి లెఫ్ట్, వీసీకే వంటి పాత మిత్రుల మద్దతు కలిపితే 116-118 అవుతుంది… విజయ్ అనే కొత్త శక్తిని అధికారానికి దూరం చేయడం లక్ష్యం… ఒకవేళ ఇద్దరు ద్రవిడ దిగ్గజాలు కలిస్తే, అది తమిళ రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు అవుతుంది..!! కానీ ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంత్రి సీతక్క ఝలక్… బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కోర్టు అక్షింతలు…
  • జనం సొమ్ము… నగలు, ఫ్యాషన్లు… వందల కోట్ల విలాస ప్రదర్శన…
  • మిన్మిని… ఓ మధుర స్వరం…! విషాదాలు, విషపు ఆంక్షలతో తెరమరుగు…!!
  • సుప్రీం చీఫ్ జస్టిస్ భలే ప్రశ్న… ఎందుకీ పిల్… నీకేం సంబంధం…
  • DMK + AIDMK…! ఇదే జరిగితే తమిళ రాజకీయాల్లో చరిత్రాత్మకం..!!
  • క్యాచ్ మిస్… మ్యాచ్ మిస్… దరిద్రపు ఫీల్డింగులో పంజాబ్ టాప్…
  • హైదరాబాద్… అల్ట్రా లగ్జరీ ఇళ్లకు అల్టిమేట్ డెస్టినేషన్…
  • బీజేపీ తమిళ తప్పుటడుగులు…! తత్వం తెలిసిందా మోటా భాయ్..?!
  • అప్పు చేయనివాడు గాడిద… ఇదొక అప్పానందలహరి…
  • అర్ధరాత్రి దాటింది… ఆ బస్టాపులో ఆమె ఒంటరిగా… ఏం జరిగింది..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions