.
దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, బీజేపీ తన ‘అఖండ భారత్’ వ్యూహంలో భాగంగా అధికారంలో లేని రాష్ట్రాలను చేజిక్కించుకోవడంలో ఎంత దూకుడుగా వెళ్తుందో చెప్పడానికి మొన్నటి పశ్చిమ బెంగాల్ ఫలితాలే నిదర్శనం. సగటు ఓటరు మూడ్ పసిగట్టడంలో విపక్షాలు విఫలం కావడం బీజేపీకి కలిసి వస్తోంది.
ప్రస్తుతం దేశంలోని పెద్ద రాష్ట్రాలలో కేవలం రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే అధికారంలో ఉన్నాయంటే ఓటరు నాడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ, మరొకటి కొత్తగా వచ్చిన టీవీకే (తమిళనాడు రాజకీయ పరిణామాల దృష్ట్యా). ఇవి కాకుండా ఆప్ (పంజాబ్), జేఎంఎం (జార్ఖండ్), నేషనల్ కాన్ఫరెన్స్ (జమ్మూ కాశ్మీర్), ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి.
Ads
బీజేపీ ఎన్నికల సమయంలో అనుసరించే వ్యూహాలు లేదా ప్రభుత్వ సంస్థల సహకారం ఏదైనా కావచ్చు కానీ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ఐడియాలజీ గల పార్టీలనే ప్రజలు ఎన్నుకుంటున్నారని స్పష్టమవుతోంది.
వైసీపీ, బీఆర్ఎస్ ముందున్న సవాళ్లు…. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్ తమ ప్రాథమిక సిద్ధాంతాల (Fundamental Ideology) విషయంలో స్పష్టత లేకపోతే, భవిష్యత్తులో ఇవి కూడా టీఎంసీ, డీఎంకే, ఆప్ తరహాలో నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది.
-
వైసీపీ స్థితిగతులు….: దక్షిణ, ఉత్తర భారత దేశ ఐడియాలజీల ప్రకారం చూస్తే, వచ్చే ఎన్నికలలో వైసీపీ ఖచ్చితంగా బీజేపీ ఐడియాలజీని సమర్థించడమో లేదా వ్యతిరేకించడమో చేయాలి. కేరళ, తమిళనాడు ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీల విజయాలను చాటిచెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం ఉంది. “నేను టీడీపీని విమర్శిస్తా కానీ బీజేపీని సమర్థిస్తా” అనే పాత వ్యూహాలు ఇకపై పని చేయవు.
-
బీఆర్ఎస్ పరిస్థితి…: తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 20% కొత్త ఓటర్లు (సుమారు 60- 70 లక్షలు) వచ్చారు. వీరికి తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పటి టీఆర్ఎస్ పాత్ర ఇప్పుడు అప్రస్తుతం. అందుకే కేసీఆర్ కూడా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ప్రస్తుతం యువ ఓటర్లకు ‘తెలంగాణ సెంటిమెంట్’ కంటే భవిష్యత్తు ముఖ్యం.
రాజకీయ వ్యూహకర్తలు, సోషల్ మీడియా పాత్ర….: మొన్నటి ఎన్నికలతో రాజకీయ వ్యూహకర్తలు, ఐపాక్ (I-PAC) వంటి టీమ్‌ల ప్రభావం తగ్గిందని తేలిపోయింది. అఖిలేష్ యాదవ్ వంటి నేతలు ఇప్పటికే ఐపాక్ నుండి తప్పుకోవడం మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం.
తెలంగాణలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా గత 15 ఏళ్లలో కొత్త ఓటర్ల శాతం పెరిగింది. ఇప్పటి తరం ఓటర్లకు కాంగ్రెస్ మీద పాత కోపం లేకపోవచ్చు. చుట్టూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడు, ‘రెండు కళ్ల సిద్ధాంతం’ వర్కౌట్ కాదు. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, టీవీకే విజయ్ వంటి నాయకుల ఆర్థిక- క్యాడర్ మద్దతు ఉంటే, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కాంగ్రెస్‌తో పొత్తు తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. ఓట్లు చీలకుండా ఎన్డీయే కూటమి ఎలా విజయం సాధించిందో జగన్‌కు తెలుసు.
ఇకపై పాదయాత్రలు, ధర్నాలు, రోడ్ షోల కాలం చెల్లింది. సోషల్ మీడియా నారటివ్ (Social Media Narrative) మాత్రమే జనాల అభిప్రాయాన్ని నిర్మిస్తుంది. ఉదాహరణకు, తమిళనాడులో 234 నియోజకవర్గాలు ఉంటే విజయ్ కేవలం 40 లోపే పర్యటించినా, సోషల్ మీడియా ద్వారానే భారీ రీచ్ సాధించారు. అదీ వేరే పార్టీల మీద నెెగెటివ్ క్యాంపెయిన్ కాదు, విజయ్ మీద పాజిటివ్ ప్రచారం మాత్రమే…
రాబోయే ఎన్నికల్లో తటస్థ ఓటర్లు (Neutral Voters) అనేవారు ఉండరు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు ఓటర్ల ధ్రువీకరణ (Polarization) చాలా వేగంగా, స్పష్టంగా జరిగిపోతోంది…. ( గోపు విజయ కుమార్ రెడ్డి )
Share this Article