.
నిన్న ములాయం సింగ్ చిన్న కొడుకు ప్రతీక్ హఠాన్మరణం… ఏదో అనుమానాస్పద మరణం అనీ, విషప్రయోగం అనీ, పోలీసులు దర్యాప్తు అనీ కొన్ని వార్తలొచ్చాయి… రాజకీయ కుటుంబం కాబట్టి… అఖిలేష్ ఎస్పీ అయితే, ప్రతీక్ భార్య అంటే ములాయం మరదలు బీజేపీ… సో, రకరకాల వ్యాఖ్యానాలు, విమర్శలు, సందేహాలు రావడం సహజమే… అయితే… ఈ ప్రతీక్ కథ ఓ సినిమా కథలాగే ఉంటుంది… హఠాన్మరణం దాకా…
ములాయం – సాధన గుప్తా: రహస్య పరిచయం నుండి సహజీవనం వరకు… ములాయం సింగ్ యాదవ్, సాధన గుప్తా పరిచయం 1980ల నాటిది… అప్పట్లో సాధన గుప్తా సమాజ్‌వాదీ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండేది… ములాయం సింగ్ తల్లి మూర్తి దేవి అనారోగ్యంతో ఉన్నప్పుడు సాధన ఆమెకు చేసిన సేవలు ములాయంను ఆకట్టుకున్నాయి… కాలక్రమేణా వీరి మధ్య అనుబంధం బలపడి, సహజీవనానికి దారితీసింది… అయితే, ములాయం మొదటి భార్య మాలతీ దేవి (అఖిలేష్ తల్లి) జీవించి ఉన్నంత కాలం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు…
Ads
మాలతీ దేవి మరణం, అధికారిక గుర్తింపు … 2003లో మాలతీ దేవి మరణించిన తర్వాత సాధన గుప్తాతో తన బంధాన్ని ములాయం బహిరంగపరచాల్సిన పరిస్థితి వచ్చింది… అమర్ సింగ్ ఒత్తిడితో 2003లో ఆమెను అధికారికంగా భార్యగా అంగీకరించాడు… అయితే, అంతకంటే ముందే 1988లో జన్మించిన ప్రతీక్ యాదవ్‌ను తన కుమారుడిగా అంగీకరించడానికి ములాయంకు చాలా సమయం పట్టింది… చివరకు 2007లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో, ప్రతీక్ తన కుమారుడేనని ములాయం అధికారికంగా ధృవీకరించాడు…

ప్రతీక్ యాదవ్: విభిన్నమైన లైఫ్ స్టయిల్ … రాజకీయ కుటుంబంలో పుట్టినా ప్రతీక్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల వైపు ఆసక్తి చూపలేదు…. ఆయన లైఫ్ స్టయిల్ చాలా విలాసవంతంగా ఉండేది… ఫిట్‌నెస్ ఫ్రీక్… ప్రతీక్ బాడీ బిల్డింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపేవాడు… లక్నోలో సొంతంగా భారీ జిమ్ సెంటర్‌ను నడిపేవాడు…
లగ్జరీ కార్లు…: కోట్లాది రూపాయల విలువైన లంబోర్గిని వంటి కార్లలో తిరుగుతూ వార్తల్లో నిలిచేవాడు… తను రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డాడు…
అపర్ణ యాదవ్ ఎంట్రీ- బీజేపీ ప్రయాణం… ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్… ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉండేది… 2017లో సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది… అఖిలేష్ యాదవ్‌తో ఉన్న సైద్ధాంతిక విభేదాలు, కుటుంబంలో తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆమె 2022లో బీజేపీలో చేరింది… ప్రస్తుతం ఆమె యూపీ రాజకీయాల్లో బీజేపీ నేతగానే కొనసాగుతోంది… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్ (ఉపాధ్యక్షురాలు) …
సాధన గుప్తా, అఖిలేష్ దూరం …. అఖిలేష్ యాదవ్ తన తల్లి మాలతీ దేవికి జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు… అందుకే సాధన గుప్తాతో గానీ, ప్రతీక్‌తో గానీ ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు… 2017 పార్టీ తిరుగుబాటు సమయంలో కూడా సాధన గుప్తా వెనుకుండి పావులు కదిపిందని అఖిలేష్ వర్గం భావించేది…
జూలై 2022లో సాధన గుప్తా అనారోగ్యంతో కన్నుమూసింది… ఆ సమయంలో అఖిలేష్ తన తండ్రి ఈ రెండో భార్య అంత్యక్రియలకు హాజరైనప్పటికీ, ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభజన రేఖ అలాగే ఉండిపోయింది….

ప్రతీక్‌కూ అపర్ణకూ కూడా శృతి కుదరలేదు… కొన్నాళ్ల క్రితం అపర్ణ పెద్ద స్వార్థపరురాలు, అబద్దాలకోరు, తన కుటుంబంతో తనను దూరం చేసింది, త్వరలో విడాకులిస్తాను అని ప్రతీక్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు… మళ్లీ కొన్నాళ్లకే సయోధ్య కుదిరినట్టుగా పాత సోషల్ పోస్టులన్నీ డిలిట్ చేసి, పెళ్లాంతో కొత్త ఫోటోలు పెట్టాడు… ఇంట్రస్టింగ్ కేరక్టర్…
నిన్న ప్రతీక్ యాదవ్ మరణంతో, ములాయం సింగ్ యాదవ్ వారసత్వంలో ఒక వివాదాస్పద, చర్చనీయాంశమైన అధ్యాయం ముగిసినట్లయింది… ఒకవైపు అఖిలేష్ రాజకీయ వారసుడిగా నిలబడితే, మరోవైపు ప్రతీక్ రాజకీయాలకు దూరంగా ఉంటూనే రాచ కుటుంబ కథల్లో ఒక ముఖ్యమైన పాత్రగా మిగిలిపోయాడు… ఇప్పుడిక అపర్ణకూ ములాయం కుటుంబానికీ ఏ బంధమూ లేదు… అఖిలేష్ ఉండనివ్వడు..!!
Share this Article