.
తమిళ రాజకీయాల్లో పాపులర్ హీరో జోసెఫ్ విజయ్ ఓ అనూహ్య సంచలనం… పార్టీ పెట్టిన కొన్నాళ్లకే ఏకంగా అధికారం… ఇది తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఏపీలో చర్చనీయాంశం… హీరో విజయ్‌లాగా ఎవరైనా ఉన్నారా..? అందరి దృష్టీ జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్ మీద పడింది… రకరకాల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు కనిపిస్తున్నాయి… కాస్త వివరాల్లోకి వెళ్దాం…
జూనియర్ ఎన్టీయార్ కథ వేరు… తనకు అగ్రనటుడు, మాజీ సీఎం ఎన్టీయార్ నెత్తుటి వారసత్వం ఉంది, పోలికలు కూడా సేమ్… నటనలో కూడా పాపులారిటీ బాగా సంపాదించాడు… మంచి ఆర్థిక నేపథ్యమున్న అత్తింటివారు… అంతేకాదు, ఒక దశలో చంద్రబాబు కోసం ప్రచారం కూడా చేశాడు… మాంచి వాగ్ధాటి… అయితే..?
Ads
తెలుగుదేశానికి తనెప్పుడూ ఉత్తరాధికారి కాలేడు… తను పొలిటికల్ ఆస్పిరేషన్లున్నాయి… కానీ ఎప్పుడైతే చంద్రబాబు మంచిగా వాడుకుని వదిలేశాడో అప్పుడు తత్వం అర్థమైంది… టీడీపీ తనది కాదు… అది లోకేష్‌ది.,. ఆల్రెడీ తండ్రి నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నాడు కూడా… మరోవైపు లోకేష్ మామ బాలకృష్ణ, ఎన్టీయార్ కుటుంబం కూడా లోకేష్ వైపే ఉంటుంది…
సో, ఈ స్థితిలో జూనియర్‌కు కొత్త పార్టీ పెట్టి దూసుకుపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు… అంత ఆసక్తిగా ఉన్నట్టు కూడా కనిపించడం లేదు… బహుశా విజయ్ విజయం తరువాత తన ఆంతరంగికులతో చర్చలు జరిపాడేమో కానీ… కొత్త పార్టీ స్థాపన, వేగంగా దూసుకుపోవడం అంత సులభమైతే కాదు… తనకు కమ్మ సామాజికవర్గం ఓ ప్లస్ పాయింట్ అదే సమయంలో మైనస్ కూడా… ఏపీ పాలిటిక్స్ నేపథ్యంలో… ఎందుకంటే, ఆల్రెడీ కమ్మవర్గానికి లోకేష్ ఉన్నాడు కాబట్టి…
తెలంగాణకు వదిలేయండి… జూనియర్‌కు, బన్నీకి ఇది కార్యక్షేత్రం కాదు… ఇద్దరూ ఆంధ్రులు… పైగా తెలంగాణలో పొలిటికల్ స్పేస్ లేదు… రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు… కేసీయార్ బలమైన పునాదులు సరేసరి… మోడీ ఫ్యాక్టర్‌తో బీజేపీ కూడా ప్రధాన పోటీదారు… కొత్తవాళ్లకు స్పేస్ లేదు… సరే, ఏపీకి వద్దాం…
ఏపీలో బీజేపీ నామమాత్రం… జగన్ మొండి, బలంగా మళ్లీ దూసుకొస్తాడు… రెడ్డి సామాజికవర్గం మద్దతు… చంద్రబాబు ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత.., మూడో పార్టీ లేదు, ప్రత్యామ్నాయం లేదు… సో, స్పేస్ ఉంది… మరి అల్లు అర్జున్ సంగతి..?
తను ఎవరో తన మిత్రుడికి మద్దతుగా ఓ వైసీపీ కేండిడేట్‌కు ప్రచారం చేశాడు తప్ప, ఎప్పుడూ పొలిటికల్ తెరపై లేడు… విజయ్‌కు ఉన్నట్టు ఫ్యాన్స్ సంఘాలు కూడా పెద్దగా లేవు… విజయ్‌కు అడ్వాంటేజెస్ ఏమిటంటే..? డీఎంకే మీద వ్యతిరేకత, అన్నాడీఎంకే నాయకత్వ లోపాలు… పైగా దళిత, మైనారిటీ, యువ వోటర్లు బలమైన మద్దతు…
బన్నీ కాపు… ఆల్రెడీ పవన్ కల్యాణ్ ఉన్నాడు ఆ కులానికి… చిరంజీవి ప్రజారాజ్యం పోయాక కాపు సెక్షన్ పవన్ కల్యాణ్‌తో ర్యాలీ అవుతోంది… (పాత వైరాలు మరిచి కమ్మ- కాపు ఒక్కటైతే తప్ప రెడ్డిని కార్నర్ చేయలేదు)… ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనారిటీ, ఒక ఎస్టీ నుంచి గాకుండా మళ్లీ అదే కమ్మ, అదే కాపు, అదే రెడ్డి కొత్త పార్టీలయితే జనాన్ని కనెక్ట్ కావడం కష్టమే… విజయ్ వేరు- బన్నీ, జూనియర్ వేరు ఇక్కడే… పైగా తమిళనాడులో ఉన్నంత ఉధృతంగా సినిమా- పాలిటిక్స్ కనెక్షన్ లేదు ఏపీలో… తెలంగాణలో అస్సలు లేదు…!!
Share this Article