.
కొందరు రాజకీయ నాయకుల కొడుకులు తండ్రులకు తలవంపులు… తలనొప్పులు… మరికొందరు రాజకీయ నాయకుల కొడుకులు తండ్రులు తలలెగరేసేలా, తలెత్తుకునేలా ఎదుగుతారు… అవును, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కొడుకు సాధించిన ఓ విజయాన్ని గర్వంగా షేర్ చేసుకున్నాడు… తలెగరేశాడు… వివరాల్లోకి వెళ్తే…
హిమంత బిశ్వ శర్మ కుమారుడు నందిల్ శర్మ అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాడు… ప్రపంచంలోనే అత్యంత కఠినమైన క్రీడా పోటీగా పేరుగాంచిన ‘ఐరన్ మ్యాన్’ (Ironman Triathlon) ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు… బెంగళూరులో లా చదువుతున్న ఈ విద్యార్థి, కఠినమైన శారీరక శ్రమతో కూడిన ఈ పోటీలో గెలవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది…
Ads
ఏమిటీ ఐరన్ మ్యాన్ సవాలు?… సాధారణ అథ్లెట్లు కూడా సాహసించని ఈ పోటీలో మూడు రకాల క్రీడలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది:
3.8 కిలోమీటర్ల ఈత (Swimming)
180 కిలోమీటర్ల సైక్లింగ్ (Cycling)
42.2 కిలోమీటర్ల పూర్తి స్థాయి మారథాన్ (Running)
ఈ మూడింటినీ ఒకే రోజున, ఎటువంటి విరామం లేకుండా పూర్తి చేయాలి… దీనిని పూర్తి చేసిన వారికి ‘ఐరన్ మ్యాన్’ అనే బిరుదు దక్కుతుంది… నందిల్ ఈ ఘనతను సుమారు 16 గంటల వ్యవధిలో సాధించడం విశేషం…
పట్టుదలకు నిదర్శనం.. ఏడు నెలల కఠిన శ్రమ … నందిల్ శర్మ ప్రస్తుతం బెంగళూరులోని ప్రతిష్టాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) లో చివరి సంవత్సరం చదువుతున్నాడు… చదువులో బిజీగా ఉంటూనే, ఈ పోటీ కోసం గత 7 నుండి 8 నెలలుగా ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు… రోజువారీ క్లాసులు, పరీక్షల ఒత్తిడి మధ్య కూడా తెల్లవారుజామునే లేచి సాధన చేస్తూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నాడు…
తండ్రిగా గర్వపడుతున్నా: సీఎం హిమంత … తన కుమారుడి విజయంపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు…
- “నందిల్ సాధించిన ఈ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది… ఒక ఐరన్ మ్యాన్‌గా మారడానికి కావాల్సిన క్రమశిక్షణ, పట్టుదల తనలో ఉండటం సంతోషకరం… 16 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని నమ్ముతున్నాను…” అని పేర్కొన్నాడు…
రాజకీయాలకు దూరం.. వృత్తిపైనే ధ్యాస … సాధారణంగా ముఖ్యమంత్రుల వారసులు రాజకీయాల్లోకి రావడం మనం చూస్తుంటాం… కానీ, నందిల్ విషయంలో సీఎం శర్మ అభిప్రాయం భిన్నంగా ఉంది… తన కుమారుడికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ఆయన ఒక మంచి న్యాయవాదిగా స్థిరపడాలని కోరుకుంటున్నట్లు శర్మ గతంలోనే వెల్లడించాడు… ఇప్పుడు ఈ క్రీడా విజయంతో నందిల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు…
నందిల్ అంటే అస్సామీలో ఆనందాన్ని ఇచ్చేవాడు, విజయాన్ని చేకూర్చేవాడు అని అర్థం… నిజమే కదా…
Share this Article